Prakasam News: కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ప్రయాణికులు భయపడుతున్నారు. ట్రావెల్ బస్సులంటే జర్నీ వద్దు బాబోయ్ అనే పరిస్థితి వచ్చేశారు. ఆ ఘటన తర్వాత పలు సంఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆదివారం రాత్రి ప్రకాశం జిల్లాలో ఓ ట్రావెల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు.
ట్రావెల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
కర్నూలు జిల్లాలో ట్రావెల్ బస్సు ప్రమాద ఘటనను కళ్లతో చూశారు ప్రజలు. మంటల్లో బస్సు దగ్ధమైన సన్నివేశాలు ఇప్పటికే చాలామంది గుర్తు చేసుకుంటున్నారు. ప్రైవేటు ట్రావెల్ బస్సులో జర్నీకి దూరంగా ఉండాలని చాలామంది నిర్ణయం తీసుకున్నారు. అయినా పోలీసులు ఎక్కడికక్కడ చెక్ చేసి మరీ ట్రావెల్ బస్సులను పంపిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించినవారిపై ఎడాపెడా కేసులు నమోదు చేస్తున్నారు.
తాజాగా ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఆ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆదివారం రాత్రి మార్కాపురం నుంచి బెంగళూరుకు ఆర్‌వీటీ ప్రైవేటు ట్రావెల్స్‌కి చెందిన బస్సు బయలు దేరింది. అయితే బస్సు.. వేములకోట-కోమటికుంట ప్రాంతంలోకి రాగానే ఎదురుగా వస్తున్న మరో బస్సుని తప్పించబోయింది.
మార్కాపురం నుండి బెంగళూరు ట్రావెల్ బస్సు
అదుపు తప్పి రహదారి పక్కన ముళ్ళ డొంకలోకి దూసుకెళ్లింది. ఘటన సమయంలో బస్సులో డ్రైవర్‌తోపాటు ఎనిమిది మంది ప్రయాణికులున్నారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ ప్రయాణికులను వేరే బస్సుల్లో గమ్య స్థానాలకు తరలించారు.
కర్నూలు ఘటన తర్వాత గడిచిన మూడురోజులుగా ట్రావెల్ బస్సుల్లో తనిఖీలు ముమ్మరం చేసింది రవాణా శాఖ. ఒక్క ఏపీలో 361 బస్సులపై కేసులు నమోదు చేశారు. 40 బస్సులను సీజ్ చేశారు. ముఖ్యంగా ఆలిండియా పర్మిట్ తీసుకున్న బస్సులు, వేరే రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసి ఏపీలో తిరుగుతున్న వాటిపై ఫోకస్ చేశారు. అన్నిపత్రాలను చెక్ చేస్తున్నారు. లేకుంటే కేసులు నమోదు చేస్తున్నారు.
ALSO READ: ఏపీ వైపు దూసుకొస్తున్న మొంథా తుపాను, ఆ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
బస్సులను ఆల్టరేషన్ చేశారా? అగ్ని ప్రమాదానికి సంబంధించిన పరికరాలు ఉన్నాయా? అనేకోణంలో తనిఖీ చేస్తున్నారు. అత్యవసర ద్వారాలు లేకుండా దాదాపు 10 బస్సులను గుర్తించినట్టు తెలుస్తోంది. కొన్ని బస్సుల్లో కనీసం ప్రయాణికుల జాబితా లేదని తేలింది. ఏపీ, తెలంగాణలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరంగా చేయడంతో సగానికి పైగా ట్రావెల్ బస్సులు రోడ్డు ఎక్కలేదని తెలుస్తోంది.
ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం..
ప్రకాశం జిల్లా మార్కాపురం నుండి బెంగళూరు వెళ్లే క్రమంలో అదుపు తప్పి ముళ్ళ కంపలోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ప్రయాణికులు
ఎవరికీ గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు pic.twitter.com/OnC3VaNZ0S
— BIG TV Breaking News (@bigtvtelugu) October 27, 2025