Cyclone Montha: ఏపీ వైపు మొంథా తుపాను దూసుకొస్తుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో గంటకు 8 కి.మీ వేగంతో కదిలిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతానికి చెన్నైకి 720 కి.మీ, విశాఖపట్నంకి 790 కి.మీ, కాకినాడకి 780 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందన్నారు. ఇది 12 గంటల్లో నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుందన్నారు. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా(మొంథా) మారి, ఆరోజు రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలన్నారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఆదివారం రాత్రికి నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యల కోసం 9SDRF, 7NDRF జిల్లాల్లో ఉన్నాయని, మరికొన్ని బృందాలు హెడ్ క్వార్టర్స్ ల్లో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం ,మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
తుపాను ప్రభావిత జిల్లాలకు టీఆర్-27 కింద రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. బాధితులను సహాయ శిబిరాలకు తరలించడం, సురక్షితమైన తాగునీరు, ఆహారం, పాలు అందించడం, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు అత్యవసర మరమ్మతులు, ఇతర సహాయ కార్యకలాపాలు కోసం ఈ నిధులు వినియోగించాలని జీవో విడుదల చేసింది.
తుపాను హెచ్చరికలతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. సహాయక చర్యల కోసం 8 NDRF, 9 SDRF బృందాలను సిద్ధం చేసింది. నదులు, సముద్ర తీరాల్లో చేపలు పట్టడం, అన్ని బోటింగ్ కార్యకలాపాలు నిలుపుదల చేసింది. బీచ్‌లకు పర్యాటకుల ప్రవేశం నిషేధించాలని కోస్తా జిల్లాల కలెక్టర్లకు సూచించింది.
మొంథా తుపాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పలు జిల్లాల కలెక్టర్లు అక్టోబర్ 27,28,29 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
1.కృష్ణా జిల్లా- అక్టోబర్ 27,28,29
2.తూర్పు గోదావరి జిల్లా- అక్టోబర్ 27,28
3.అన్నమయ్య జిల్లా – అక్టోబర్ 27,28
4. కడప జిల్లా – అక్టోబర్ 27,28
5. బాపట్ల జిల్లా- అక్టోబర్ 27,28,29
6. ఎన్టీఆర్ జిల్లా -అక్టోబర్ 27,28,29
7.గుంటూరు జిల్లా – అక్టోబర్ 27,28,29
8.అనకాపల్లి జిల్లా – అక్టోబర్ 27,28,29
9.కాకినాడ జిల్లా – అక్టోబర్ 27,28,29,30,31
10.ఏలూరు జిల్లా- అక్టోబర్ 27,28
11.పల్నాడు జిల్లా- అక్టోబర్ 27
12. కోనసీమ జిల్లా – అక్టోబర్ 28,29
13. విజయనగరం జిల్లా -అక్టోబర్ 27,28,29
14.పశ్చిమ గోదావరి జిల్లా – అక్టోబర్ 27
Also Read: Amaravati News: న్యూఇయర్‌కి ముందే.. కూటమి ప్రభుత్వం కొత్త ప్లానేంటి?
మొంథా తుపాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో సీఎం చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేశారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే తీర జిల్లాలలో మోహరించాయి. తుపానుపై ప్రెడిక్టివ్ మోడల్, రియల్ టైమ్ డేటా ఆధారంగా విశ్లేషణ చేస్తూ ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగానికి సూచించారు.