Train Incident: ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్‌లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. క్షణికావేశమో లేదా తప్పు చేసామన్న పశ్చాత్తాపమో తెలీదు కానీ.. కళ్ల ముందే ఒక నిండు కుటుంబం రైలు పట్టాల మధ్య నలిగిపోయి ప్రాణాలు కోల్పోయింది. భార్యాభర్తలతో పాటు ఏ పాపమూ తెలియని ఇద్దరు అమాయక చిన్నారులు కూడా బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటన వెనుక నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన ఒక హత్య కేసు లింక్ ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
రైల్వే స్టేషన్‌లో ఘోరం.. ఒక్కసారిగా దిగ్భ్రాంతి!
సింగరాయకొండ రైల్వే స్టేషన్‌లో వేగంగా దూసుకెళ్తున్న ఒక గూడ్స్ రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రయాణికులు చూస్తుండగానే క్షణాల్లో ఈ ఘోరం జరిగిపోవడంతో రైల్వే స్టేషన్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
మృతుడి జేబులో దొరికిన డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా అతడిని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లి మండలం ఆర్వీ కండ్రిక గ్రామానికి చెందిన హరికృష్ణ (45)గా గుర్తించారు. రైలు కింద దూకిన వారిలో హరికృష్ణతో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, అందరూ అక్కడికక్కడే మృతి చెందారని జీఆర్పీ ఎస్సై శ్రీరామ్ నిర్ధారించారు.
Also Read: నీ బ్రతుకంతా అబద్ధాల పునాదే.. జగన్‌పై మంత్రి అచ్చన్నాయుడు ఫైర్!
వ్యవసాయ అధికారి హత్య కేసుతో ముడిపడిన మరణం
ఈ సామూహిక ఆత్మహత్య వెనుక నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన ఒక సంచలన హత్య కేసు దాగి ఉంది. మృతుడు హరికృష్ణ ఎవరో కాదు.. బుచ్చిరెడ్డిపాలెం వ్యవసాయ అధికారి (ఏవో) శ్రీహరి హత్య కేసులో ప్రధాన నిందితుడు. గత నెల 15వ తేదీన హరికృష్ణకు వరసకు బావ అయిన శ్రీహరి దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హరికృష్ణ కోసం నెల్లూరు పోలీసులు గత కొద్ది రోజులుగా తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన కుటుంబంతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర సంచలనంగా మారింది.
గుండెపోటుగా చిత్రీకరణ.. 20 రోజుల తర్వాత వెలుగులోకి!
గత నెల 15న శ్రీహరి దారుణ హత్యకు గురికాగా, నిందితులు ఆ నెత్తుటి మరకలను కప్పిపుచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. శ్రీహరి చనిపోయింది గుండెపోటుతోనే అని నమ్మించి, హడావుడిగా అంత్యక్రియలు కూడా కానిచ్చేశారు. అంతా సజావుగానే సాగిపోయిందని భావిస్తున్న తరుణంలో.. శ్రీహరి రెండో భార్యకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది. హత్య జరిగిన దాదాపు 20 రోజుల తర్వాత ఈ దారుణ ఉదంతం వెలుగులోకి రావడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఖాకీల అండదండలు.. పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన!
ఈ హత్య కేసును తొక్కిపెట్టడంలో, నిందితులకు సహకరించడంలో స్థానిక పోలీసుల పాత్ర కూడా ఉందనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీరియస్ అయిన నెల్లూరు జిల్లా ఎస్పీ బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ప్రక్షాళన చేపట్టారు. నిందితులకు సహకరించారన్న ఆరోపణలపై బుచ్చి పీఎస్ సీఐని సస్పెండ్ చేయడంతో పాటు, ఎస్సైని వీఆర్‌కు పంపారు. అంతేకాకుండా స్టేషన్‌లో పనిచేస్తున్న మరో 23 మంది సిబ్బందిని ఏకకాలంలో బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ముందే హెచ్చరించిన ‘సెల్ఫీ వీడియో’
బావ శ్రీహరి హత్య జరిగిన తర్వాత ప్రధాన నిందితుడిగా ఉన్న హరికృష్ణ అప్పట్లోనే ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. తనపై కావాలనే అబద్ధాలు మోపుతున్నారని, ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ వీడియోలో వాపోయారు. ఒకవేళ తనను ఇందులోకి లాగితే తాను చనిపోతానంటూ ఆనాడే సెల్ఫీ వీడియో ద్వారా హెచ్చరించారు. చివరకు అన్నంత పనీ చేస్తూ.. భార్యాపిల్లలను కూడా వెంటబెట్టుకుని రైలు కింద పడి తనువు చాలించడం స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.