Sunil Kumar Ahuja: ఏపీ లిక్కర్ కేసులో నిందితుల కోసం సిట్ వేట మొదలుపెట్టిందా? రియల్టర్లను ముంచేసిన హవాలా కింగ్ పిన్ సునీల్ అహుజా కోసం గాలింపు మొదలైందా? లిక్కర్ ముడుపులు హవాలా రూపంలో ఆహుజా గ్యాంగ్ మార్చిందా? ఇంతకీ ఆయనెక్కడున్నారు? ఇండియాలో ఉన్నారా? లేకుంటే విదేశాలకు చెక్కేశారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ఏపీ లిక్కర్ కుంభకోణంలో తీగలాగితే డొంక కదులుతోంది. ఈ కేసులో డజను వరకు నిందితులను అరెస్టు చేశారు సిట్ అధికారులు. అయితే ముడుపుల రూపంలో తీసుకున్న నిధులను హవాలా మార్గం ద్వారా సునీల్ అహుజా టీమ్ తరలించినట్టు గుర్తించారు దర్యాప్తు అధికారులు. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో రూ. 11 కోట్ల రూపాయలు పట్టుబడింది.
ఆ నగదు వ్యవహారంపై సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన వివరాలు ఆధారంగా సునీల్ కుమార్ అహుజా పేరు వెలుగులోకి వచ్చింది. చాలావరకు నగదు అహూజా గ్యాంగ్ విదేశాలకు బదిలీ చేసినట్టు అనుమానిస్తున్నారు. దీంతో సునీల్ కుమార్, అతని కొడుకు అశీష్‌కుమార్ ఆహుజాపై ఓ కన్నేశారు దర్యాప్తు టీమ్.
కసిరెడ్డి గ్యాంగ్ తీసుకున్న లిక్కర్ ముడుపులను దుబాయికి తరలించడంలో అహూజా టీమ్ కీలకంగా మారినట్టు తెలుస్తోంది. దుబాయ్ నుంచి అమెరికాకు మళ్లించి అక్కడ క్రిప్టో కాయిన్స్ రూపంలో బదలాయించారనే ఆరోపణలు లేకపోలేదు. డాక్యుమెంట్లు దొరకకుండా రిమోట్ బూట్‌తో క్లౌడ్‌లో దాచి పెట్టాడని సమాచారం.
ఇంతకీ సునీల్ కుమార్ అహూజా ఎవరు? సునీల్ కుమార్ అహూజా ఎవరో కాదు.. ఆయన ఒక ఎన్నారై. ఆయన పూర్వీకులు వెస్టిండీస్‌లో స్థిరపడ్డారు. అక్కడి నుంచే సునీల్ కుమార్ అహూజా కూతురు, కొడుకుతో ఇండియా వచ్చేశారు. కరేబియన్ దీవులు హవాలాకి, డ్రగ్స్‌కి కెరాఫ్ అడ్రస్ అని చెపొచ్చు. గతంలో సునీల్ కుమార్ కూడా హవాలా బిజినెస్‌లు చేసినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఏం జరిగిందో తెలియదు కానీ ఆయన కుటుంబంతో కలిసి ఇండియాకి వచ్చేశారు. తర్వాత హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఫైనాన్స్ పేరుతో తన పేరు బయటకు తెలియకుండా చాలా మందిని మోసం చేశారు.
ఫైనాన్స్ పేరుతో ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కుచ్చు టోపీ పెట్టారు సునీల్-అశీష్ అహుజాలు. ఆస్తిని 30 శాతానికి వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే కాకుండా వడ్డీల పేరుతో చాలామందిని వేధించారు. మరికొందరైతే మరణించారు కూడా. ఆ విధంగా ఆయన పేరు బయటకు వచ్చింది.
హవాలా రూపంలో నిధులను ఎక్కడికైనా పంపించడంలో ఆయనకు తిరుగులేదని చాలామంది చెబుతుంటారు. ఆ విధంగా తన నెట్ వర్క్ విస్తరించుకున్నారు తండ్రీకొడుకులు. లిక్కర్ కేసు నిందితుడు రాజ్ కసిరెడ్డితో సునీల్ తరచూ భేటీ అవుతున్నట్లు వార్తలు లేకపోలేదు. లిక్కర్ కేసులో వీళ్లని నిందితుల జాబితాలో చేర్చుతారా? అరెస్ట్ చేసిన చేసిన తర్వాత ఛార్జిషీటులో పేర్లు ప్రస్తావిస్తారా?
మరోవైపు సునీల్-ఆశిష్ అహూజా బాధితులు హైదరాబాద్‌లో ఇటీవల ఆందోళనకు దిగారు. బెదిరించి భూములు రాయించుకుని ఇవ్వలేదని ఆరోపించారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలన్నది బాధితుల మాట. గడిచిన ఐదేళ్ల నుంచి వందలాది కుటుంబాలు పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
భారతి బిల్డర్స్‌కు రుణాలు ఇచ్చి ఆ తర్వాత భూములను తాకట్టు పెట్టి స్వాధీనం చేసుకున్నారట. రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పిన భారతి బిల్డర్స్.. ఆ తర్వాత మాట మార్చారని అంటున్నారు. ఈ వ్యవహారంపై నిలదీయగా సునీల్ అహుజాకు భూమి బదలాయింపు జరిగినట్టు తెలిందన్నారు. అహూజా గ్యాంగ్ సిట్ చిక్కితే ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.