దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థలలో అనుమానాస్పద మరణాలపై మిస్టరీ కంటిన్యూ అవుతోంది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో.. కీలక ముందడుగు పడింది. శ్రీక్షేత్ర సమీపంలోని అటవీప్రాంతంలో.. కొన్ని శవాలను పూడ్చిపెట్టానని ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రదేశాల్లో.. పోలీసులు తవ్వకాలు జరుపుతున్నారు. ఇందులో.. ఆరో సైట్‌లో.. కొన్ని మానవ అవశేషాలను గుర్తించారు. ఈ కేసులో.. బయటపడిన తొలి ఆధారం ఇదే.
పారిశుద్ధ్య కార్మికుడి ఫిర్యాదుతో..
50 ఏళ్ల పారిశుద్ధ్య కార్మికుడు.. 1995 నుంచి 2014 వరకు సుమారు 100కు పైగా శవాలను అక్కడ పూడ్చినట్లు చెప్పాడు. అతడి ఫిర్యాదు మేరకు.. అనుమానాస్పద మరణాలపై కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. 4 రోజులుగా సిట్ అధికారులు అతడిని తీసుకెళ్లి దర్యాప్తు చేపట్టారు. నేత్రావతి నది స్నాన ఘట్టానికి అవతలి వైపు ఉన్న ప్రాంతం నుంచి పరిశోధన మొదలుపెట్టారు. మృతదేహాలను పూడ్చిపెట్టినట్లుగా.. అతను గుర్తించిన 13 ప్రదేశాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఆరో ప్రదేశంలో మానవ అవశేషాలు బయటపడ్డాయి. వాటిని ఫోరెన్సిక్ బృందం సేకరించి.. ల్యాబ్‌కు పంపింది. ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాతే.. మరిన్ని వివరాలు తెలుస్తాయని సిట్ అధికారులు చెబుతున్నారు.
ఆ అవశేషాలు ఆమెవేనా?
అక్కడ లభ్యమైన అవశేషాలు 2003లో అదృశ్యమైన అనన్య భట్‌దేనా? అనే సందేహాలు నెలకొన్నాయి. అక్కడ తవ్వకాల్లో 15 ఎముకలు, లోదుస్తులు లభించినట్లు సిట్ వెల్లడించింది. అయితే పుర్రె మాత్రం దొరకలేదని, ఇంకా తవ్వకాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ధర్మస్థలలో శ్రీమంజునాథ ఆలయానికి వెళ్లిన తర్వాత మళ్లీ ఆమె జాడ కనిపించలేదు. అప్పటి నుంచి ఆ కేసు మిస్టరీగా మిగిలిపోయింది. జులై 15న అనన్య భట్ తల్లి సుజాత భట్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తాను డీఎన్ఏ టెస్టులకు సిద్ధమని తెలిపింది. సత్యమేవ జయతే అంటూ ఆమె తరపు న్యాయవాది ఓ ప్రకటన విడుదల చేశారు. ధర్మస్థలలో చాలామంది అమ్మాయిలు మిస్ అయ్యారని సమాచారం. వేదవల్లి, పద్మలత, మరో 17 ఏళ్ల అమ్మాయి కూడా మిస్ అయినట్లు తెలిసింది. అంతేగాక బడికి వెళ్లే చాలామంది బాలికలు, మహిళలు మిస్ అయ్యారని, వారిని అక్కడే పాతిపెట్టారని పారిశుద్ధ్య కార్మికుడు వెల్లడించారు.
అతడు చెప్పిందే నిజమైంది
ఈ కేసులో దర్యాప్తు మొదలయ్యాక.. ధర్మస్థల క్షేత్రంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. గత 20 ఏళ్లలో అనేక మంది మహిళల్ని పూడ్చి పెట్టానని.. అందులో అనేక మంది మహిళలు, యువతులు, చిన్నారులు ఉన్నారని.. అందులో పనిచేసిన ఓ పారిశుద్ధ్య కార్మికుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాదు.. వారంతా అనుమానాస్పద రీతిలో.. లైంగిక దాడులకు గురై చనిపోయి ఉంటారని చెప్పడంతో అంతా ఉలిక్కిపడేలా చేసింది. దీనికి సంబంధించి కోర్టు ముందు స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. గతంలో పాతిపెట్టిన అస్థిపంజర అవశేషాలతో పాటు సంబంధిత ఫోటోలను కూడా సమర్పించాడు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. సిట్ ఏర్పాటు చేసింది. మృతదేహాలను ఖననం చేయమని చెప్పిందెవరు? ఎవరిసాయంతో వాటిని తీసుకెళ్లేవారు? లాంటి అంశాలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. మానవ అవశేషాలు దొరకడంతో అతడి ఫిర్యాదుకు బలం చేకూరింది. తవ్వకాలను మరింత ముమ్మరం చేస్తున్నారు.