Internet: మనసుల్లో ఊహించని మార్పులకు, ప్రపంచాన్ని వేగంగా మార్చిన శక్తికి పేరు ఇంటర్నెట్! ఒకప్పుడు కేవలం ల్యాబ్‌లలో, కంప్యూటర్లలో కనిపించే ఈ ఇంటర్నెట్ ఇప్పుడు మన జేబులో ఉంది! ఒక చిన్న స్మార్ట్‌ఫోన్ క్లిక్‌తో ప్రపంచం మన చేతిలోకి వస్తోంది. సమాచారాన్ని తెలుసుకోవాలన్నా, డబ్బు పంపాలన్నా ఏది చేయాలన్నా ఇంటర్నెట్ అవసరం. కానీ ఈ ఇంటర్నెట్ కథ ఎప్పుడూ మొదలైంది? ఎలా మారింది? దీని వల్ల ఉపయోగాలు, నష్టాలు ఉన్నాయా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంటర్నెట్ అంటే ఏంటి? ఎప్పుడు మొదలైందో తెలుసా?
ఇంటర్నెట్ అనేది ఎన్నో కంప్యూటర్ నెట్‌వర్క్‌లను కలిపిన ఒక మహా వ్యవస్థ, ఇది ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుంది. ఇది మొదట అమెరికాలో 1969లో ARPANET అనే ప్రాజెక్టుగా మొదలైంది. మొదట ఈ వ్యవస్థను అమెరికా రక్షణ శాఖ ఉపయోగించేది. కానీ.. 1990 తర్వాత, ప్రపంచానికి ఈ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. మనం నేడు ఉపయోగించే వేదికలు – Google, Facebook, YouTube, WhatsApp – ఇవన్నీ కూడా ఇంటర్నెట్‌పై ఆధారపడి పనిచేస్తున్నవి.
ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మన జీవితాల్లో వచ్చిన మార్పులు:
మన తల్లిదండ్రులు, బామ్మ-తాతలు, మునుపటి తరం జీవించిన కాలంలో సమాచారాన్ని తెలుసుకోవాలంటే న్యూస్‌పేపర్ లేదా రేడియో, టీవీ ఉండాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు – మీరు ఇంట్లోనే కూర్చొని, ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలోని ఏ విషయాన్ని అయినా చూడగలుగుతారు, తెలుసుకోగలుగుతారు.
* పాఠశాల విద్యార్ధి ఇంటర్నెట్‌లో చదువుకుంటున్నాడు.
* రైతు మార్కెట్ రేట్లు ఇంటర్నెట్‌లో తెలుసుకుంటున్నాడు.
* ఉద్యోగం కోసం వెతుకుతున్న యువకుడు ఇంటర్నెట్ ద్వారా అప్లై చేస్తున్నాడు.
* ఒక గృహిణి కొత్త వంటకాలు, హోం డెకోరేషన్ టిప్స్ ఇంటర్నెట్‌లో నేర్చుకుంటోంది.
ఈ విధంగా ఇంటర్నెట్ ద్వారా మనం బిజినెస్ చేయగలగడం, డబ్బు సంపాదించగలగడం, ప్రపంచంతో టచ్‌లో ఉండటం – ఇవన్నీ సాధ్యమవుతున్నాయి.
ఇంటర్నెట్ లేకపోతే ఏమవుతుంది?
ఇంటర్నెట్ లేని జీవితం అనే భావన ఇప్పుడు ఊహించలేం. ఒక రోజు ఇంటర్నెట్ ఆఫ్ అయితేనే మనం అసహనంతో ఎదుర్కొంటాం. బ్యాంకింగ్, బిల్ పేమెంట్స్, టికెట్ బుకింగ్స్, ఆన్‌లైన్ క్లాసెస్ – ఇవన్నీ ఆగిపోతాయి. ఇంటర్నెట్ నిద్రపోతే మన జీవితం కూడా కొన్ని గంటల పాటు స్తంభించినట్లే.
ఇంటర్నెట్ వల్ల కలిగే నష్టాలు..
అన్నీ మంచే కాదు కదా! ఇంటర్నెట్ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.
* ఫేక్ న్యూస్ – సత్యం ఏది? అసత్యం ఏది? అనేదాన్ని ఖచ్చితంగా గుర్తించలేకపోవడం
* సైబర్ క్రైమ్స్ – హ్యాకింగ్, డేటా చోరీలు, ఆన్లైన్ మోసాలు
* సోషల్ మీడియా అడిక్షన్ – పిల్లల నుంచి పెద్దల వరకు సోషల్ మీడియాలో బానిసలైపోతున్నారు
* గోప్యత సమస్యలు – మన వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతుంది
* ఆన్లైన్ గేమ్స్ – పిచ్చిగా మునిగిపోవడం. ఇవి పిల్లలు, యువత, పెద్దలు అందరినీ ప్రభావితం చేస్తున్న అంశాలు. అందుకే ఇంటర్నెట్‌ను జాగ్రత్తగా ఉపయోగించాలి.
ఇంటర్నెట్‌కి ముందు – తర్వాత
* ఒకప్పుడు లేఖలు రాసేవాళ్లం, ఇప్పుడు WhatsApp మెసేజ్‌లు పంపుతున్నాం.
* ఒకప్పుడు ఎవరినైనా కలవాలంటే వాళ్ల ఇంటికి వెళ్లాల్సి వచ్చేది, ఇప్పుడు Zoom కాల్ పెడతాం.
* ఒకప్పుడు విద్యార్థి పుస్తకాలపై ఆధారపడి ఉండేవాడు, ఇప్పుడు Google మీద ఆధారపడతున్నాడు.
* ఒకప్పుడు సినిమా టికెట్ కోసం థియేటర్ ఎదుట క్యూలో నిల్చేవారు, ఇప్పుడు BookMyShowతో ముందే బుకింగ్ చేసేస్తున్నాం. ఇలా ఇంటర్నెట్ మన అభివృద్ధిలో భాగం అయిపోయింది.
ఫ్యూచర్‌లో ఇంటర్నెట్ ఎలా ఉండబోతుంది?
ఇప్పుడు మనం 5G యుగంలోకి అడుగుపెడుతున్నాం. రాబోయే రోజుల్లో 6G, 7G కూడా రావొచ్చు. ఇంటర్నెట్ ద్వారా ఇంటిని ఆటోమేటిక్‌గా నియంత్రించగలిగే Smart Homes వస్తున్నాయి. AI, Machine Learning వంటివి ఇంటర్నెట్ ఆధారంగా పని చేస్తున్నాయి. అన్నీ డిజిటలైజేషన్ వైపు పరుగులు పెడుతున్నాయి. ఇంటర్నెట్ అనే అద్భుతం మనకు రెండు రూపాల్లో పనిచేస్తుంది. ఒకటి – మంచికోసం, మరొకటి మోసం చేయడానికి. ఇది మన చేతుల్లో ఉంది – దీన్ని ఎలా ఉపయోగించాలో అంటే.. విద్య కోసం, అభివృద్ధి కోసం, సరైన సమాచారాన్ని పొందేందుకు మాత్రమే ఉపయోగించుకుంటే మంచిది.