Tragic Disasters India: కొందరు పవిత్ర స్నానానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. కొందరు హలీడే ట్రిప్‌కి వెళ్లి.. టెర్రరిస్టుల చేతిలో పోయారు. ఇంకొందరు ఐపీఎల్ కప్ సెలబ్రేషన్స్‌కి వెళ్లి.. తొక్కిసలాటలో పోయారు. మరికొందరు విమానం కూలిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఆ కూలిన విమానం హాస్టల్‌పై పడి.. ఇంకొందరు చనిపోయారు. ఇక్కడ ఎవ్వరి ప్రాణాలకు గ్యారంటీ లేదు. ఏ ప్రాణం.. ఏ నిమిషంలో పోతుందో తెలియట్లేదు. అసలేం జరుగుతోంది? జీవితమంటే ఇంతేనా? మన చుట్టూ ఏమవుతుందో.. ఎలాంటి ప్రమాదాలు ముంచుకొస్తున్నాయో.. ఎందుకు సంభవిస్తున్నాయో.. ఆ దేవుడికే తెలియాలి! ఇదంతా.. ఆ భగవంతుడు ఆడిస్తున్న ఆటే అనుకొని సరిపెట్టుకోవాలా?
కలలోనైనా ఊహించని ప్రమాదాలు!
ఇంతకుముందెన్నడూ చూడని ఘోరాలు!
రాలిపోతున్న జనాలు.. గాల్లో కలుస్తున్న ప్రాణాలు!
ఈ వరుస ఘోరాలేంటి? ఊహించని ప్రమాదాలేంటి?
అసలు.. మన చుట్టూ ఏం జరుగుతోంది? ఈ వరుస ఘోరాలేంటి? ఊహించని ప్రమాదాలేంటి? మననవాళ్లతో సరదగా గడిపేందుకు, ప్రకృతి అందాల మధ్య అద్భుతమైన క్షణాలను గడిపేందుకు.. ఓ అందమైన ప్రదేశానికి వెళితే.. ఎక్కడి నుంచో వచ్చిన ఉగ్రవాదులు పగబట్టినట్లుగా కాల్చేస్తారు. మనమెంతగానో అభిమానించే ఓ క్రికెట్ టీమ్.. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత టైటిల్ గెలిస్తే.. ఒకేసారి అన్ని సంవత్సరాల ఆనందాన్ని ఆకాశాన్ని తాకేలా సెలబ్రేట్ చేసుకునేందుకు వెళితే.. తొక్కిసలాటలో చనిపోతారు. ఇక.. పనులు ముగించుకొని.. ఉన్న చోటు నుంచి.. ప్రశాంతంగా వచ్చిన చోటుకి తిరిగి వెళ్లేందుకు విమానం ఎక్కితే.. ఎవరూ ఊహించని రీతిలో గాల్లోకి ఎగిరిన కొన్ని క్షణాల్లోనే అది కూలిపోతుంది. పోనీ.. ఉన్న చోటే ఉండి.. ఎప్పటిలాగే హాస్టల్‌లో భోజనం చేస్తుంటే.. సడన్‌గా విమానం వచ్చి మీద పడుతుంది. ఆ పేలుడు ధాటికి చెలరేగే అగ్గి జ్వాలల్లో.. కాల్చేస్తుంది. అసలు.. మన చుట్టూ ఏం జరుగుతోంది? ఇదే.. ఇప్పుడు కోట్లాది మంది భారతీయుల్లో మెదులుతున్న ఆలోచన!
ఇలా.. ఎన్నో ప్రశ్నలు అందరి మనసుల్లో మెదులుతున్నాయి
జీవితమంటే అంత సులువు కాదని అందరికీ తెలుసు. జీవితమంటే అర్ధాంతరంగా ముగిసిపోయేది కాదనీ తెలుసు. కానీ.. ఇప్పుడు ఎవ్వరి జీవితాలకు గ్యారంటీ లేదు. ఏ క్షణంలోనైనా.. ప్రాణం పోవచ్చు. ఊహంచని ప్రమాదం ముంచుకు రావొచ్చు. ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చు. ఎక్కడున్నా.. ప్రాణాలకు గ్యారంటీ లేదని నిరూపిస్తున్నాయి ఇటీవల జరుగుతున్న దుర్ఘటనలు. అది.. పహల్గామ్ టెర్రరిస్ట్ ఎటాక్ అయినా.. బెంగళూరు తొక్కిసలాట అయినా.. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ అయినా.. ఘోరం ఏదైనా కానీ.. దూరం ఎంతున్నా గానీ.. జనం ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోతున్నాయి. వరుస దుర్ఘటనలు.. ప్రతి ఒక్కరి మనసును కలచివేస్తున్నాయి. ఇవన్నీ.. మానవ తప్పిదాలతోనే జరుగుతున్నాయా? వ్యవస్థాగత లోపాలు, భద్రతా వైఫల్యాల ఫలితమా? లేక.. ఇదంతా దైవ లీలతో జరుగుతోందా? మనుషులు చేసిన పాపాలే.. ఇలా వెంటాడుతున్నాయా? ఇలా.. ఎన్నో ప్రశ్నలు అందరి మనసుల్లో మెదులుతున్నాయి. దీని వెనుక అంతుచిక్కని ఆ భగవంతుడి లీల దాగుందని నమ్మేవాళ్లు కొందరైతే.. మానవ తప్పిదాలే మరణ శాసనం రాస్తున్నాయనేది మరికొందరి వాదన.
భారత చరిత్రలోనే ఓ మహా విషాదంగా మిగిలిపోతుంది
అహ్మదాబాద్‌లో అంతుచిక్కని విధంగా విమానం కూలిపోయింది. ఈ ఒక్క ప్రమాదం.. వందలాది మందిని బలితీసుకుంది. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనతో దేశం మొత్తం నివ్వెరపోయింది. ఒక్కొక్కరి గాథలు విన్నాక.. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి కళ్లు చెమ్మగిల్లాయి. దేశం మొత్తాన్ని కదిలించిన ఈ ఘోర ప్రమాదం.. భారత చరిత్రలోనే ఓ మహా విషాదంగా మిగిలిపోతుంది. విమానం కూలిపోవడం, హాస్టల్ భవనంపై పడి పేలిపోవడం, భారీ ప్రాణనష్టం సంభవించడంతో.. జనంలో ఇప్పుడు విమాన ప్రమాణమంటే భయాందోళన, అభద్రతాభావం కనిపిస్తున్నాయి. ఫ్లైట్ జర్నీపై అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ప్రమాదానికి సంబంధించిన హృదయవిదారక దృశ్యాలు చూసి.. ఎంతో మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భగవద్గీత పుస్తకం చెక్కుచెదరకుండా ఉండటం, భక్తులు మరణించడం లాంటి ఘటనలు కూడా ప్రజల్లో భిన్నమైన చర్చకు దారితీశాయి.
ఈ దేశ ప్రజలందరి గుండెలను పిండేసిన దుర్ఘటన
విమాన ప్రమాదమే అత్యంత విషాదమనుకుంటే.. ఆ విమానం హాస్టల్ భవనంపై కూలడం, అందులో ఉన్న మెడికోలు దుర్మరణం చెందడం మరింత విషాదకరం. తమకు ఏం జరిగిందో తెలిసేపోలే.. కొందరు ప్రాణాలు కోల్పోయారు. భోజనం చేస్తూనే ప్రాణాలు వదిలారు. భారీ విమానం రూపంలో వచ్చిన చావు నుంచి తప్పించుకోలేక.. ప్రాణాలు విడిచారు. చావును మోసుకొచ్చిన ఆ ఫ్లైట్ ఎక్కి ప్రయాణికులు చనిపోయారు. కానీ.. ఎలాంటి సంబంధం లేకుండా, వారి ఎలాంటి తప్పిదమూ జరగకుండా.. ఆ మృత్యు విహంగానికి.. హాస్టల్‌లోని మెడికల్ స్టూడెంట్స్ బలైపోయారు. ఇది.. కేవలం ఓ విషాదం మాత్రమే కాదు. ఈ దేశ ప్రజలందరి గుండెలను పిండేసిన దుర్ఘటన. ఇదంతా.. ఆ దేవుడు ఆడిస్తున్న ఆటే. ఎందుకిలా జరుగుతుందో.. ఎందుకిలా చేస్తున్నాడో.. ఎందుకు ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయో.. ఆ దేవుడికే తెలియాలి.
దేవుడనే వాడు ఉంటే.. ఇన్ని ఘోరాలు జరుగుతుంటే.. చూస్తూ ఊరుకుంటున్నాడా?
ఎవరిని చూస్తే భయం చస్తుందో.. ఎవరిని తలిస్తే ధైర్యం వస్తుందో.. ఎవరిని స్మరిస్తే.. మన గుండెల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుందో.. ఎవరి అనుగ్రహం ఉంటే.. ఏదైనా సాధించగలమనే నమ్మకం వస్తుందో.. అతనే దేవుడు. అయినా.. మనుషుల జీవితాలే అంత! ఆట మనమే ఆడుతున్నా.. ఆడించేవాడు ఆ భగవంతుడని నమ్మేస్తాం. ఎప్పుడైనా.. ఏదైనా జరగొచ్చు. లైఫ్‌కి గ్యారంటీ లేదు. కానీ.. ఈ మధ్యకాలంలో జరుగుతున్న వరుస దుర్ఘటనలు.. అసలు దేవుడు ఉన్నాడా? అనే ప్రశ్న తలెత్తేలా చేస్తున్నాయి? దేవుడనే వాడు ఉంటే.. ఇన్ని ఘోరాలు జరుగుతుంటే.. చూస్తూ ఊరుకుంటున్నాడా? ఈ ప్రమాదాల నుంచి మానవుల్ని ఎందుకు బయటపడేయడం లేదు? మనుషుల కర్మ ఇంతేనా?
భగవంతుడి సన్నిధిలోనే ఇలా జరిగితే.. ఇంకెవరికి మొర పెట్టుకోవాలి?
చేసిన పాపాల ఫలితమో తెలియట్లేదు.. మనుషులందరి దురదృష్టం ఒకేసారి ప్రభావం చూపుతుందో అర్థం కావట్లేదు. కానీ.. ఈ ఏడాది మొదటి నుంచే.. ఈ ఘోరాలు మొదలయ్యాయి. 144 ఏళ్లకోసారి వచ్చే మహా కుంభమేళాలో.. ఆధ్యాత్మికత వెల్లివిరిసే సమయంలో.. కోట్లాది మంది భక్త జనం భక్తిశ్రద్ధలతో పుణ్య స్నానం ఆచరించే వేళలోనూ.. జరగబోయే దుర్ఘటనని ఆ భగవంతుడు ఆపలేకపోయాడు. ఆ దేవుడి సన్నిధిలో.. ఆధ్యాత్మిక క్షేత్రంలో.. పవిత్ర త్రివేణి సంగమానికి సమీపాన తొక్కిసలాట జరిగి.. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. పుణ్య స్నానాల కోలాహలం కనబడాల్సిన చోట.. విషాద ఛాయలు అలముకున్నాయ్. ఈ ఘటన.. దేశం మొత్తాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఆ భగవంతుడి సన్నిధిలోనే ఇంతటి ఘోరం జరిగితే.. ఇంకెవరికి మొర పెట్టుకోవాలి?
పహల్గామ్‌లో జరిగింది ఓ హింసాత్మక చర్య..
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కూడా ఈ కోవలోకే వస్తుంది. కొన్నాళ్ల పాటు ఈ టెన్షన్లన్నీ మర్చిపోయి.. ప్రకృతిని ఆస్వాదించేందుకు, అందమైన ప్రదేశాలను చుట్టి వచ్చేందుకు.. మనకు నచ్చిన వాళ్లతో, కుటుంబసభ్యులతో సరదాగా గడిపేందుకు వెళ్లినా.. ప్రాణాలతో ఉంటామనే గ్యారంటీ లేదని నిరూపించిన ఘటన పహల్గామ్ టెర్రర్ ఎటాక్. మనకెలాంటి సంబంధం లేకపోయినా.. ఎవరో స్వార్థం కోసం.. ఎవరో లక్ష్యాల కోసం.. ఎవరో సిద్ధాంతాల కోసం.. అమాయకులు బలి కావాల్సి వస్తుంది. ఉగ్రవాదం విసిరిన పంజాకు.. టెర్రరిస్టులు పేల్చిన తూటాలకు.. అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. చివరికి.. పిక్నిక్ వెళ్లినా సేఫ్‌గా ఉంటామని కచ్చితంగా చెప్పే పరిస్థితులు లేకుండా చేసింది పహల్గామ్ ఉగ్రదాడి ఘటన. చావు ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో.. మన ఊహకు కూడా అందదని మరోసారి రుజువు చేసిన ఘోర విషాదం అది. పహల్గామ్‌లో జరిగింది ఓ హింసాత్మక చర్య.. దేశం మొత్తాన్ని తీవ్రంగా కలిచివేసింది. అనవసరంగా అమాయకుల ప్రాణాలు తీసేశారని.. ప్రతి ఒక్కరూ బాధపడేలా చేసింది.
సైలెంట్‌గా ఉన్న చోటే ఉన్నా.. ఎప్పటికీ ప్రాణాలతో ఉంటామనే నమ్మకం లేదు
బెంగళూరులో జరిగిన తొక్కిసలాట.. మరింత విషాదకరం. ఆటపై ప్రేమతో.. ఆటగాళ్లపై అభిమానంతో.. తాము నెత్తిన పెట్టుకొని మోస్తున్న జట్టు.. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. టైటిల్ విన్నర్‌గా నిలిస్తే.. ఆ సంతోషాన్ని, ఆనందాన్ని నలుగురితో పంచుకునేందుకు వెళ్లినా.. ప్రాణాలతో తిరిగొస్తామనే నమ్మకం లేదని రుజువు చేసిన ఘటన అది. అభిమానంకొద్దీ వెళితే.. ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి. ఎవరో నిర్లక్ష్యానికి.. ఎందరో బలైపోయిన విషాద ఘటన ఇది. అంటే.. సెలబ్రేషన్ కోసం వెళ్లినా, సైలెంట్‌గా ఉన్న చోటే ఉన్నా.. ఎప్పటికీ ప్రాణాలతో ఉంటామనే నమ్మకం లేదు. ఆయుష్షు తీరిన తర్వాత ప్రాణాలు వదలడం వేరు. అర్ధాంతరంగా తనువు చాలించడం వేరు. ఎలా చనిపోతున్నామో తెలియకుండానే.. వందల మంది ప్రాణాలు కోల్పోవడమే.. ఇక్కడ విషాదకరం. అందుకే అనుమానం కలుగుతోంది.. ఇది ఆ దేవుడు ఆడుతున్న ఆటేనని! ఇందుకు మరో ఎగ్జాంపులే.. విశ్వాస్ రమేశ్ కుమార్. 241 మంది ప్రాణాలు కోల్పోయిన విమాన ప్రమాదం నుంచి.. మృత్యుంజయుడిగా బయటపడిన ఒకే ఒక్కడు విశ్వాస్ రమేశ్. ఎయిరిండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానంలో ఉన్నోళ్లంతా చనిపోయి.. విశ్వాస్ ఒక్కటే ప్రాణాలతో బయటపడ్డాడంటే.. ఇది కచ్చితంగా ఆ దేవుడి ఆటే కదా! అనే వాదనలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి.
మనం చేయగలిగిందేమీ లేదు. ఒక్క.. దేవుడిని నిందించడం తప్ప!
ఈ భూమిపై జన్మించిన వాళ్లంతా.. ఇక్కడే శాశ్వతంగా ఉండిపోయేందుకు రాలేదు. అది కుదరదు కూడా. ప్రతి ఒక్కరికీ.. చావు అనేది ఏదో ఒక రోజు తప్పదు.! కానీ.. ఇలా జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోవడంలోనే అర్థం ఉండట్లేదు. ఈ వరుస దుర్ఘటనలు.. దేవుడి ఉనికినే ప్రశ్నిస్తున్నాయి. ఓ భారీ హెచ్చరికను పంపుతున్నాయి. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. అందువల్ల.. ప్రతిసారీ నిస్సహాయంగా ఎదురుచూడకుండా.. మార్పు కోసం ముందడుగు వేయాలి. ఉన్నంతలో.. జీవితాన్ని గొప్పగా జీవించాలి. ఈ జన్మకు సరిపడా జ్ఞాపకాలను, అనుభూతులను పోగేసుకోవాలి. పోయేటప్పుడు.. ఎలాంటి చింత లేకుండా పోవాలి. అంతకుమించి.. మనం చేయగలిగిందేమీ లేదు. ఒక్క.. దేవుడిని నిందించడం తప్ప!
Story By: Anup, Big Tv Live