AP Cabinet: ఏపీ మహిళలకు వచ్చే వారం రాఖీ పండుగ ఓ స్పెషల్ టర్న్ తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని రాష్ట్ర కేబినెట్ అత్యంత కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నెల 9న రాఖీ సందర్భంగా సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించనున్న ఈ పథకం, ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది. మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని తెచ్చిన ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ‘ఇది మేమిచ్చే రాఖీ గిఫ్ట్.. మహిళల కోసం తీసుకున్న నిర్ణయమని సీఎం అన్నారు.
తాజాగా ఈ రోజు తాడేపల్లిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా మహిళల కోసం తీసుకున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రకటన ఈ భేటీలో కేంద్రబిందువుగా నిలిచింది. రాఖీ పండుగను పురస్కరించుకుని ఈ నెల 9న సీఎం స్వయంగా ఈ పథకాన్ని ప్రకటించనున్నట్లు నిర్ణయించారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం నుంచి ‘స్త్రీశక్తి’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు కేబినెట్ ఓకే చెప్పింది.
అలాగే, జిల్లాల పునర్విభజనలో ఉన్న లోపాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని, సరిహద్దు సమస్యలను ఒక నెల రోజుల్లో పరిష్కరించేందుకు స్పష్టమైన గడువు విధించామని సీఎం పేర్కొన్నారు. కేంద్రం చేపట్టే జనగణన ప్రారంభానికి ముందు ఈ ప్రక్రియను పూర్తిచేయాలన్న దిశగా అధికారులు కసరత్తు చేయాలని సూచించారు.
ఈరోజు తాడేపల్లిలో కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత, మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. మొత్తం మీద ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజల జీవనశైలిని ప్రభావితం చేయనున్నవే కాక, రాబోయే పాలనకు దిశానిర్దేశకంగా నిలవనున్నాయి.
మంత్రి మాట్లాడుతూ.. ఈ పథకాన్ని స్త్రీశక్తి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఆర్‌టీసీ బస్సుల్లో 75 శాతం (సుమారు 8,456 బస్సుల్లో) ఉచితంగా ప్రయాణించేందుకు మహిళలకు అవకాశం కల్పించనున్నామన్నారు. ఈ పథకం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు వర్తించనుంది. అంటే నిత్యం పల్లె నుంచి పట్టణం వరకు వెళ్ళే మహిళలు ఇక ట్రావెల్ ఖర్చుపై ఓ ఆలోచన తగ్గించుకోనున్నారు. కుటుంబానికి నెలకు కనీసం రూ.800 వరకు ఆదా అవుతుందని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఇది కేవలం ఆదా మాత్రమే కాదు, మహిళల ఆత్మవిశ్వాసానికి, స్వేచ్ఛకు నడకే మార్గం కూడా అవుతుందని స్పష్టం చేశారు.
కేబినెట్ భేటీలో నాయీ బ్రాహ్మణులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. వారికి వినియోగించే విద్యుత్ బిల్లుల్లో 200 యూనిట్ల వరకు రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. తక్కువ ఆదాయంతో జీవనం సాగిస్తున్న ఈ వర్గానికి ఇది పెద్ద ఊరటగా మారనుంది. వారి వృత్తిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇది ఉపాధికి తోడ్పాటుగా, జీవన ప్రమాణాలను మెరుగుపరచే దిశగా వేయబడిన మంచి అడుగుగా చెప్పొచ్చు.
Also Read: Konda Surekha: బీజేపీపై బిగ్ బాంబ్ విసిరిన కొండా సురేఖ.. రాష్ట్రపతినే అవమానించారంటూ కామెంట్స్!
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా జిల్లాల పునర్విభజనలో తలెత్తిన లోపాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పునర్విభజనలో ఏర్పడిన సరిహద్దు సమస్యలపై నెల రోజుల వ్యవధిలో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణన ప్రక్రియ ప్రారంభమయ్యేలోపు ఈ పునర్విభజన ప్రక్రియను పూర్తిచేయాలని స్పష్టమైన గడువును విధించారు.
మహిళలపై తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా కూడా సీరియస్ ఎఫెక్ట్ చూపనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వం మహిళల భద్రత, సంక్షేమంపై స్పష్టమైన ఫోకస్ పెడుతుండగా, మరోవైపు రాబోయే ఎన్నికల నాడి ముందే పట్టేసే ప్రయత్నంగా ఈ నిర్ణయాన్ని చూస్తున్నారు. అయితే ఆర్‌టీసీకి నెలవారీ లాభనష్టాలపై ఈ పథకం ప్రభావం ఏంటన్నది ప్రశ్నే. అయినా సరే, మహిళల ప్రయోజనం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. ప్రయాణికుల సంఖ్య పెరగడం, టికెట్ లేని ప్రయాణాల నివారణ, భద్రతా మార్గదర్శకాలు వంటి అంశాలపై అధికారులు ఇప్పటికే కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల నుంచి పట్టణాల దాకా మహిళలు ఇప్పటికే ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పథకం అమలు ఎలా జరుగుతుందో చూడాలి కానీ, ప్రారంభం మాత్రం శుభంగా ఉందని చెప్పొచ్చు. ఈ కేబినెట్ భేటీలో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పలువురు పాల్గొన్నారు.