Shreyas Iyer: ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ ని 2-2 తో టీమిండియా డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ టెస్ట్ సిరీస్ ముగియడంతో టీమ్ ఇండియా ఆటగాళ్లకు సుధీర్గ విరామం లభించింది. దాదాపు 35 రోజులపాటు భారత ఆటగాళ్లు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడపనున్నారు. అనంతరం సెప్టెంబర్ 9 నుండి యూఏఈ వేదికగా జరిగే ఆసియా కప్ 2025తో టీమిండియా మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ని మొదలు పెట్టబోతోంది.
Also Read: Jasprit Bumrah: టీమిండియాకు దరిద్రంగా మారిన బుమ్రా.. అతడు ఆడితే ఓటమే.. ఇదిగో లెక్కలు!
ఈసారి టి-20 ఫార్మాట్ లో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ కి ఆతిథ్య జట్టు భారత్ అయినప్పటికీ.. ఈ ఈవెంట్ ని తటస్థ వేదిక యూఏఈ లో మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు బరిలోకి దిగుతాయి. అబుదాబి, దుబాయ్ వేదికగా మొత్తం 19 మ్యాచ్ లు జరగనున్నాయి. భారత జట్టు తన తొలి మ్యాచ్ ని ఆతిథ్య యూఏఈ తో సెప్టెంబర్ 10వ తేదీన తలపడనుంది. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో సెప్టెంబర్ 14న ఆడబోతోంది. ఈ టోర్నీ ఫైనల్ సెప్టెంబర్ 28న జరగనుంది.
అయితే ఇంగ్లాండ్ తో సిరీస్ ముగియడం, సెప్టెంబర్ 9 నుండి ఆసియా కప్ 2025 ప్రారంభం కానుండడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆసియా కప్ లో పాల్గొనే టీమ్ ఇండియా జట్టుపై పడింది. టి-20 ఫార్మాట్ లో ఈ టోర్నీ జరగనుండడంతో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇందులో పాల్గొనరు. ఎందుకంటే వీరిద్దరూ ఇప్పటికే టెస్ట్ లతో పాటు టి-20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ టోర్నీలో ఆడే భారత జట్టు ఎంపికపై ఇప్పటికే సెలెక్టర్లు ఫోకస్ చేశారు. సీనియర్లు, యంగ్ ప్లేయర్లతో సమతూకంగా జట్టును ఎంపిక చేయాలని భావిస్తున్నారు.
ఈ టోర్నీ కోసం బరిలోకి దిగే భారత జట్టును సెలెక్టర్లు ఆగస్టు మూడవ వారంలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా భారత టి-20 జట్టు కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ ఈ మెగా టోర్నీ ఆడతాడా..? లేదా..? అన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే అతడు స్పోర్ట్స్ హెర్నియాకు సర్జరీ చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అతడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మరి ఆసియా కప్ లోపు అతడు పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధిస్తాడా..? అన్నది తేడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ టీమ్ ఇండియా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ.. గిల్ రాకతో ఇది సాధ్యం కాదని అనిపిస్తుంది.
ఎందుకంటే టెస్ట్ కెప్టెన్ గా ఇంగ్లాండ్ గడ్డపై ఇరగదీసిన గిల్.. అంతకుముందు ఐపీఎల్ 2025 లోను గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా సత్తా చాటాడు. దీంతో అతడే కెప్టెన్ అవుతాడని చెప్పవచ్చు. ఇక ఈ టోర్నీకి టీం ఇండియా స్టార్ పేసర్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా ఈ టోర్నీ నుండి బుమ్రాకు రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి కూడా ఈ జట్టులో చోటు దక్కడం కష్టమే. గాయాల నుంచి కోలుకున్న షమీ ఇంతకుముందులా సత్తా చాటలేకపోతున్నాడు. ఈ క్రమంలో అతడి స్థానంలో హర్షిత్ రానా ని జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్ జట్టులో చోటు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. వీరితో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా ఈ జట్టులో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
Also Read: Champagne Bottle: టెస్టుల్లో ఈ బ్లాక్ కలర్ వైన్ బాటిల్ ఎందుకు ఇస్తారో తెలుసా ?
ఐపీఎల్ 2025లో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్ కి ఈసారైనా టి-20 లో ఆడే అవకాశం లభిస్తుందా..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 2023 డిసెంబర్ నుండి అతడు ఇంటర్నేషనల్ టి-20 ల్లో ఆడలేదు. గత ఐపీఎల్ సీజన్ లో 175 స్ట్రైక్ రేట్ తో 600కు పైగా పరుగులు చేశాడు శ్రేయస్ అయ్యర్. దీంతో అతడికి జట్టులో చోటు కల్పించాలని క్రీడాభిమానులు కోరుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో కూడా భారత జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించిన శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్ లో పంజాబ్ జట్టును ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు. దీంతో ఈసారి శ్రేయస్ అయ్యర్ కి జట్టులో చోటు దక్కకపోతే సెలక్టర్లపై విమర్శలు రావడం సహజమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.