AP new bar policy: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బార్‌లపై పూర్తి పునర్వ్యవస్థీకరణ చేస్తూ కొత్త బార్ పాలసీని ప్రకటించింది. తాడేపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాలను తీసుకున్నారు. భేటీ అనంతరం రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. కొత్త బార్ పాలసీ 2025 సెప్టెంబర్ 1 నుంచి 2028 ఆగస్ట్ 31 వరకు అమలులో ఉంటుందని తెలిపారు.
ఈ పాలసీని చూస్తుంటే.. ఇది కేవలం బార్ల పునర్విభజన కాదనిపిస్తుంది. ఇది ఓ విధంగా మందుబాబుల జీవనశైలిని, వ్యాపార వాతావరణాన్ని, ప్రభుత్వ ఆదాయాన్ని సమపాళ్లలో తూనిక వేయడం లాంటి ప్రయత్నం. ఇక పాలసీ హైలైట్స్ చూస్తే అర్థమవుతుంది… దాన్ని తయారుచేయడంలో ఒక దూరదృష్టి, పరిపక్వత ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఇక అసలు వివరాల్లోకి వెళితే..
840 బార్లకు లాటరీ పద్ధతిలో టెండర్లు
రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లకు లైసెన్సులు ఇచ్చేందుకు టెండర్లు పిలవనున్నారు. అయితే గతానికి భిన్నంగా ఈసారి లాటరీ విధానాన్ని తీసుకురానున్నారు. పారదర్శకత కోసం ఈ మార్గం ఎంచుకున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఎవరికైనా అవకాశం లభించేలా, చెరువు ఇసుక లాక్కోవడంలా కాకుండా సాఫ్ట్‌వేర్ లాటరీ ద్వారా ఎంపిక చేయడం అనేది పాలసీలోని ముఖ్యమైన పారదర్శక కోణం.
కల్లు గీత కార్మికులకు ప్రత్యేక రాయితీలు
ఈ కొత్త పాలసీలోని మరో విశేషం.. కల్లు గీత కార్మికుల పట్ల తీసుకున్న సానుభూతి నిర్ణయం. తమ వృత్తిలో ఉన్నవారికి జీవనోపాధిని మరింత స్థిరంగా మార్చేందుకు 50 శాతం రాయితీతో బార్ లైసెన్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అంతేకాకుండా వారికి 10 శాతం రిజర్వేషన్ కూడా కల్పించనుంది. అంటే ఇది కేవలం వాణిజ్య పాలసీ కాదు.. సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించే ప్రయోగం కూడానని చెప్పవచ్చు.
జనాభాపై ఆధారపడి లైసెన్సు ఫీజులు
ఈసారి లైసెన్సు ఫీజులను కూడా సమతుల్యంగా, వ్యాపారధారుల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయించారు. జనాభా 50 వేల లోపు ఉంటే లైసెన్సు ఫీజు రూ.30 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షలలోపు అయితే రూ.55 లక్షలు, 5 లక్షల పైగా జనాభా ఉన్న నగరాల్లో అయితే రూ.75 లక్షలు, ఇలా పట్టణ స్థాయి, జనాభా పరిమాణాన్ని బట్టి వ్యాపార ఫీజులు ఉండటం వల్ల చిన్న వ్యాపారస్తులకు మరింత అవకాశం లభించనుంది.
Also Read: AP Cabinet: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ కేబినెట్.. ఒకటి కాదు సుమా.. అవేమిటంటే?
ప్రస్తుత బార్లకు ఊరట
ఇప్పటికే బార్ లైసెన్సులు కలిగివున్న వ్యాపారులకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా రీ-అప్లికేషన్ మినహాయింపు కూడా అందించనున్నారు. అంటే తమ అనుభవంతో ముందుకు సాగాలనుకునే వారికి తిరిగి అవకాశాలు ఉంటాయి. అదనంగా, టూరిజం ఫోకస్ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక అనుమతులపై కూడా ప్రభుత్వం దృష్టిసారించనుంది.
నూతన టైమింగ్స్
కొత్త పాలసీలో బార్‌లకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పని చేయడానికి అనుమతి లభించింది. అంటే ఎప్పటికప్పుడు మందుబాబులకు అందుబాటులో ఉండే విధంగా లిక్కర్ షాపులు నడవనున్నాయి. కానీ ప్రభుత్వం పక్కా నిబంధనలు, నిఘా వ్యవస్థతో వ్యవహరించనుంది.
గ్రీన్ పీరియడ్
పాలసీ అమలులోకి వచ్చే ముందు గ్రీన్ పీరియడ్‌ను పాటిస్తామని మంత్రి చెప్పారు. ఈ కాలంలో లైసెన్సు దరఖాస్తుదారులకు అవసరమైన సమాచారం, డాక్యుమెంటేషన్ మొదలైనవి సిద్ధం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈసారి ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొత్త బార్ పాలసీ చూసి.. సాధారణ ప్రజలు ఆశ్చర్యపోవచ్చు. కానీ లోతుగా చూస్తే.. ఇది ఒక ఆర్థిక వ్యూహం, సామాజిక బూస్టింగ్, నియంత్రిత తాగుడుకు ఒక పద్ధతి. ఇకపై మందుబాబులు తమ కిక్కు కోసం రూల్ బ్రేక్ చేయాల్సిన అవసరం లేకుండా, అన్నీ ఉన్న వ్యవస్థలోనే కిక్కు పొందే ఆవకాశం పొందనున్నారు.