Anantapur News: అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్- జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య వివాదం కంటిన్యూ అవుతోంది. క్షమాపణ చెప్పేవరకు కదిలేది లేదంటూ నిరసనకు దిగారు ఎన్టీఆర్ అభిమానులు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముట్టడి వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసింది.
అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీసు వద్ద టెన్షన్ కంటిన్యూ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర ఫ్యాన్స్ ఇచ్చిన 48 గంటల డెడ్‌లైన్ గడువు ముగిసింది. సదరు ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పలేదు. టీడీపీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేయలేదు. ఈ క్రమంలో జూనియర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంపు ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే దగ్గుపాటి ఇంటి ముట్టడికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు-జూనియర్ అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫ్యాన్స్ నినాదాలు చేశారు.
ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఎమ్మెల్యే దగ్గుపాటి ఇంటికి ముట్టడికి జూనియర్ వస్తారన్న సమాచారంతో అలర్ట్ అయ్యారు పోలీసులు. ఆయన ఇంటి చుట్టూ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఇంటికి వచ్చే పరిసర ప్రాంతాల్లో బారికెట్లు ఏర్పాటు చేశారు.
ALSO READ: వంగవీటి రంగా విగ్రహం.. నిందితుడు అడ్డంగా దొరికాడు
ఇంటికి వెళ్లేందుకు ఎక్కడిఎక్కడ పోలీసులు ఉండడంతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్, బళ్లారి నుంచి భారీగా జూనియర్ ఫ్యాన్స్ అనంతపురం చేరుకున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పరిస్థితి గమనించి పోలీసులు, చివరకు లాఠీఛార్జ్ చేశారు. చివరకు చేసేదేమీ లేక రోడ్డుపై బైఠాయించిన అభిమానులు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పేంతవరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని అంటున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే దగ్గుపాటికి చీవాట్లు పెట్టింది పార్టీ హైకమాండ్.
ఈ విషయంలో అభిమానులను సముదాయించే ప్రయత్నం చేయలేదని కొందరు దగ్గుపాటి వర్గీయుల మాట. కచ్చితంగా వైసీపీ ప్రమేయముందని అంటున్నారు. ఈ వ్యవహారానికి ఎలాంటి ముగింపు వస్తుందో చూడాలి.