Guava: అత్యంత రుచికరమైన పండ్లలో జామ ఒకటి. ఇది పోషకాలతో నిండి ఉంటుంది. విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కూడా వీటిలో పుష్కలంగా ఉంటాయి. కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జామను తినకూడదు. ఎందుకంటే..జామ పండ్లు వారి సమస్యను మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉంటుంది. ఇంతకీ జామపండ్లు ఎవరు, ఎందుకు తినకూడదో ఇప్పుుడు తెలుసుకుందాం.
1. జీర్ణ సమస్యలు:
కొంతమందిలో జామ పండు తిన్న తర్వాత కడుపులో గ్యాస్ లేదా ఉబ్బరం సమస్యలు తలెత్తుతాయి. జామలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడినప్పటికీ.. కొన్నిసార్లు అది పొట్టలో గ్యాస్ ఉత్పత్తిని పెంచుతుంది. మీరు ఇప్పటికే జీర్ణ సమస్యలతో బాధపడుతున్నట్లయితే.. జామ పండ్లను అధికంగా తినడం మానుకోవడం మంచిది.
2. దగ్గు, జలుబు లేదా జ్వరం:
దగ్గు, జలుబు లేదా జ్వరం ఉన్నప్పుడు జామ తినకపోవడమే మంచిది. జామ పండు స్వభావం చాలా చల్లగా ఉంటుంది. జ్వరం ఉన్నప్పుడు జామ పండు తింటే.. అది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. అలాగే.. జలుబు, దగ్గును కూడా మరింత పెంచుతుంది.
3. మధుమేహం:
జామ పండులో సహజ చక్కెరలు ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు జామ పండు ఎక్కువగా తినకుండా ఉండాలి. మీ ఆహారంలో జామ పండును చేర్చుకునే ముందు డాక్టర్ లేదా డైటీషియన్‌ని సంప్రదించడం మంచిది.
4. గర్భధారణ సమయంలో:
గర్భధారణ సమయంలో మహిళలు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జామ పండులో విటమిన్ సి, ఇతర పోషకాలు ఉన్నప్పటికీ.. అధికంగా తినడం మంచిది కాదు. అధికంగా తింటే జీర్ణ సమస్యలు, గ్యాస్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
5. మూత్రపిండాల సమస్యలు:
జామ పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు పొటాషియం అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే.. అధిక పొటాషియం మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది.
6. ఆపరేషన్ అయిన వారు:
ఆపరేషన్ చేయించుకున్న వారు జామ తినకపోవడమే మంచిది. ఆపరేషన్ తరువాత జీర్ణవ్యవస్థ నెమ్మదిగా పనిచేస్తుంది. జామ పండు గ్యాస్, ఉబ్బరం కలిగించవచ్చు. ఇది ఆపరేషన్ అయిన తర్వాత కోలుకోవడాన్ని ఆలస్యం చేస్తుంది.
అందరికీ జామ పండు మంచిదే. కానీ పైన చెప్పిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే తినాలి. జామ పండును రాత్రిపూట తినడం మానుకోండి. ఇది జీర్ణ సమస్యలను పెంచుతుంది. పగటిపూట జామ తినడం మంచిది. ఎందుకంటే.. ఇది శరీరానికి పోషకాలను అందించి, ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది.