Yellandu Politics: పార్టీ హవా కొనసాగింది.. అధికారంలో ఉన్నప్పుడు అక్కడి ఎమ్మెల్యే హరిప్రియకి కుటుంబ సభ్యులు షాడో ఎమ్మెల్యేలుగా పెత్తనం చెలాయించారు .. వీరికి తోడు ఆ నియోజకవర్గంలో ఇంకొందరు నేతలు భూ కబ్జాలు, ఆర్థిక పరమైన పంచాయతీలతో చెలరేగిపోయారు. పవర్ను అడ్డం పెట్టుకొని గులాబీ పార్టీ నేతలు ఆడిందే ఆట పాడిందే పాటగా నడిచిందంట. అలా ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ నేతలను గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి హస్తం పార్టీ నేతకు పట్టం కట్టారు.. ఆ ఓటమితో పింక్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఇల్లందు నియోజకవర్గానికి చుట్టపు చూపుగా తయారయ్యారంట. ఆమె పవర్ లో ఉన్నప్పుడు ఓ వెలుగులు వెలిగిన నేతలు అంతా సైలెంట్ మోడ్ లోకి వెళ్లి ఇతర ప్రాంతాల్లో సెటిలైపోయారంట..
ఇల్లందులో మాజీ ఎమ్మెల్యే హరిప్రియకు షాడో ఎమ్మెల్యేలు
భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పవర్ లో ఉన్నప్పుడు.. ఆమె భర్త హరిసింగ్, ఆమె తండ్రి అక్కడ షాడో ఎమ్మెల్యేలుగా నియోజకవర్గాన్ని వారికి కనీసన్నుల్లో శాసించారు.. కానీ 2023 సవంత్సరం చివర్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు అప్పటి ఎమ్మెల్యే హరిప్రియ ఓడించి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్యకు భారీ మెజారిటీ ఇచ్చారు.. దాంతో హరిప్రియ పదవిలో ఉన్నంతకాలం హంగు ఆర్భాటాలు ప్రదర్శించిన గులాబీ పార్టీ నేతలు అధికారం కోల్పోగానే మొహం చాటేయడంతో మాజీ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి చుట్టం చూపులా వచ్చివెళ్తున్నారంట.
హరిప్రియ వైఖరితో అసహనానికి గురవుతున్న గులాబీ క్యాడర్
ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీ విధానాలను, ప్రజా సమస్యలుపై ఎప్పటికప్పుడు నిలదీయాల్సిన నేత నియోజకవర్గానికి ఎప్పుడో ఒకసారి వస్తుండటంతో కార్యకర్తలు అసహనానికి గురవుతున్నారట .. ఆ క్రమంలో ఇల్లందు నియోజకవర్గంలో గులాబీ పార్టీ కి దిక్కెవరు అనే పరిస్థితి నెలకొందంట.. ఇల్లందులో బీఆర్ఎస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే నాయకుడు లేక పోవడంతో అయోమయ స్థితిలో ఉందంట. పార్టీ నియోజకవర్గ ఇంచార్జి అయిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఓటమి తో మొహం చాటేయడంతో కార్యకర్తలు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందంటున్నారు. 2019 జనరల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ తరపున గెలిచిన హరిప్రియ ఆనాడు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఒక వెలుగు వెలిగిన హరిప్రియ తన క్యాంప్ కార్యాలయాన్నే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చుకొని పార్టీ కార్యక్రమాలు నడిపారు. అప్పుడు పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉన్న హరిప్రియ 2023 సవంత్సరంలో జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ చేతిలో ఘోర ఓటమిపాలయ్యారు.
ఇల్లందు మున్సిపల్ చైర్మన్‌తో పాటు కార్యకర్తలపై తప్పుడు కేసులు
అధికారంలో ఉన్నన్ని రోజులు తమకు ఎదురు లేదంటూ విర్రవీగిన హరిప్రియ, ఆమె భర్త ఒంటెద్దు పోకడలతో గులాబీ పార్టీకి తీవ్ర డ్యామేజ్ చేశారన్న విమర్శలున్నాయి. ఇల్లందు మున్సిపాలిటీ చైర్మన్‌తో పాటు మరి కొంతమంది పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులతో ఇబ్బందులు పెట్టించిన ఘటనలు సైతం పెద్ద దుమారమే రేపాయి… అలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ సైతం పార్టీకి కార్యకర్తలు దూరమవుతున్నారని గ్రహించి నియోజకవర్గంలో పర్యటించినప్పటికీ.. ప్రయోజనం లేకుండా పోయందంటున్నారు .. అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ చరిష్మా ఏ మాత్రంత పనిచేయకపోవటంతో గులాబీ పార్టీ ఘోరంగా ఓడిపోయిందని ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నారు.
ఇల్లందులో పార్టీ కార్యాలయం లేకుండా పోయిన బీఆర్ఎస్
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని కార్యక్రమాలు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోనే నిర్వహించేవారు.. కనీసం పార్టీ కి సొంత కార్యాలయాన్ని కూడా నిర్మించలేదు.. పదవి చేజారిపోయిన తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేయడంతో పార్టీకి కార్యాలయం కూడా లేకుండా పోయింది. అప్పటినుండి పార్టీ ఇంచార్జ్ అయిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు కొంతమంది హరిప్రియ తో పాటు ఆనాడు వాళ్ళ స్వప్రయోజనాలకోసం బీఆర్ఎస్ లో చేరినా అధికారం కోల్పోవడంతో.. మళ్లీ నేతలు యు టర్న్ తీసుకుని కాంగ్రెస్ సొంత గూటికే చేరారట.. మరి కొంతమంది నేతలు .. ఇల్లందు పట్టణం వదిలి వేరే ప్రాంతాల్లో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తూ ఉన్నారట..ఇంకొందరు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటంతో కింది స్థాయి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే నాయకులే కరువయ్యారట.
Also Read: బ్రేక్ ఇచ్చిన రెయిన్.. నేటి నుంచి మళ్లీ భారీ వర్షాలు..
ఇల్లందు బీఆర్ఎస్ ఇన్చార్జ్ పదవి ఆశిస్తున్న సంజీవనాయక్
అంతకు ముందు నుంచే ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి పదవి ఆశిస్తున్న సూర్యాపేటకు చెందిన మాజీ జెడ్పీటీసీ సంజీవ నాయక్ అధిష్టానం పెద్దల ఆశీస్సుల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారంట.. మాజీ ఎమ్మెల్యే స్థానంలో సంజీవ్ నాయక్ నియోజకవర్గంలో అడపా దడపా పర్యటిస్తుండటంతో కార్యకర్తలు మరింత అయోమయానికి గురవుతున్నారంట. నియోజకవర్గంలో నాయకులెవరు అందుబాటులో లేక పోవడంతో కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తమ్మీద ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ ప్రస్తుతం ఇల్లందు లో కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని.. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కారు స్టీరింగ్ పట్టే నాధుడు లేకపోవడంతో గడ్డు పరిస్థితి నెలకొంటుందని క్యాడర్ వాపోతోంది.
Story By Rami Reddy, Bigtv