BigTV English

YS Jagan: బీజేపీకి దగ్గరై.. జగన్ సక్సెస్ అవుతాడా?

YS Jagan: బీజేపీకి దగ్గరై.. జగన్ సక్సెస్ అవుతాడా?

YS Jagan: ఆంధ్రప్రదేశ్లో అధికార, ప్రతిపక్షాలుగా ఉన్నా… దేశ రాజకీయాల్లో మాత్రం బీజేపీతోనే జగన్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి కేంద్రంలో అధికారంలో ఉంటున్న బిజెపికి మద్దతు ప్రకటిస్తూనే వస్తున్నారు. తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. 2029 ఎన్నికల నాటికి ఎన్డీఏలో తాము లేకపోయినా టీడీపీని మాత్రం ఎన్డీఏ కూటమిలో లో లేకుండా చేయాలనేది వైసిపి ఆలోచనగా కనిపిస్తోందంటున్నారు. గతంలో ఇదే తరహాలో మద్దతుగా నిలిచి బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేసి సక్సెస్ అయిన వైసీపీ ఈసారి ఏ మేరకు సఫలం అవుతుందనేది చూడాలి..


గతంలో బీజేపీతో సత్ససంబంధాలు కొనసాగించిన వైసీపీ

గత ఎన్నికలకు ముందు బీజేపీతో సత్ససంబంధాలు నెరిపిన వైసీపీ సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ టీడీపీ, జనసేనతో కూటమి కట్టడంతో దూరమైంది. దివంగత వైఎస్ మరణాంతరం తనను ముఖ్యమంత్రిని చేయలేదని, తర్వాత తన ఓదార్పు యాత్రలకు అనుమతించలేదని కాంగ్రెస్‌కు దూరమై వైసీపీ పేరుతో జగన్ సొంత కుంపటి పెట్టుకుని పొలిటికల్ గేమ్ మొదలెట్టారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్న వైసీపీ మరోసారి బీజేపీతో దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుంది.. పార్లమెంట్‌లో వైసీపీకి నలుగురు లోక్ సభ సభ్యులు.. ఏడుగురు రాజ్యసభ సభ్యుల బలం ఉంది..


మోడీ సర్కారుకి జగన్ దాసోహం అంటున్నారా?

పార్టీ ఆవిర్బావం నుంచి సోలో గానే పోటీ చేస్తూ వస్తున్న వైసీపీ అయిదేళ్ల అధికారం తర్వాత గత సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైనా.. పార్లమెంటులో చెప్పుకోదగ్గ బలాన్ని చాటుకుంది. అక్రమాస్తుల కేసుతో పాటు వివిధ కేసుల ఉచ్చు బిగుసుకుంటడంతో జగన్ మోడీ సర్కారుకి దాసోహం అంటున్నట్లే కనిపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా కేంద్రంలోని బీజేపీతో స్నేహ సంభందాలు కొనసాగించిందో వైసీపీ అదే తరహాలో తిరిగి తమ స్నేహాన్ని కొనసాగించేందుకు ఉపరాష్ట్రపతి ఎన్నికల ద్వారా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.. ఉప రాష్ట్రపతి ఎన్నికపై వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీయే ప్రతిపాదించిన అభ్యర్థి రాధాకృష్ణన్‌ కే తమ మద్దతు ఉంటుందని వైసీపీ ప్రకటించింది.. తమ పార్టీ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిందని స్పష్టం చేసింది.. గతంలో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీయేకు మద్దతు ఇచ్చామని ఆ పార్టీ అధిష్టానం గుర్తు చేసింది

ముందు నుంచి బీజేపీకి బేషరతు మద్దతు ప్రకటిస్తున్న వైసీపీ

అదే విధంగా పార్లమెంట్‌లో పలు బిల్లుల ఆమోదానికి మద్దతు ఇచ్చినట్లు వైసీపీ చెప్తోంది. నంబర్‌ గేమ్‌ ఉండొద్దనే ఉద్దేశంతో ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు ఆ పార్టీ నేతలు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు, అంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేంద్రానికి పలు కీలక సందర్బాల్లో బేషరతుగా బీజేపీకి మద్దతు ప్రకటించింది వైసీపీ. వ్యవసాయ చట్టాలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ సహా పార్లమెంట్‌లో పలు బిల్లులకు కూడా ఎన్డీఏ పక్షాన నిలిచింది. వీటితో పాటు ఢిల్లీ సర్వీస్ బిల్లు, ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ సంస్కరణల బిల్లు, చీఫ్ ఎలక్షన్ కమీషన్ నియామక బిల్లు, ఆర్టికల్ 370 రద్దు బిల్లు, ఓబీసీ ఎమండ్మెంట్ బిల్లు వంటి పలు కీలక బిల్లులకు కూడా వైసీపీ మద్దతు ప్రకటించింది..

అవిశ్వాస తీర్మానం సమయంలో బీజేపీకే జగన్ మద్దతు

అంతేకాకుండా 2023లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలో బీజేపీకే జగన్ మద్దతు ప్రకటించారు.. వీటితో పాటు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి వంటి దేశ అత్యున్నత పదవులను రాజకీయాలతో ముడి పెట్టకుండా ఏకగ్రీవంగా గెలిపించుకోవాలని జగన్ అంటూ బీజేపీకి మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు.. అత్యున్నత పదవులు అందరి అంగీకారంతో ఏకగ్రీవంగా గెలిపించాలని, అప్పుడే దేశ ప్రతిష్ట పెరుగుతుందని జగన్ భావిస్తున్నారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చి సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న జగన్ 2012లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆనాటి యూపీఏ కూటమి అభ్యర్ది ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చారు. అప్పట్లో ప్రణబ్ ముఖర్జీ సీనియార్టీకి తలవంచే మద్దతిచ్చారన్న అభిప్రాయం ఉంది.

రాంనాథ్ కోవింద్, వెంకయ్యనాయుడిలకు వైసీపీ మద్దతు

ఆ తర్వాత 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే బలపరచిన రాంనాధ్ కోవింద్ కి.. ఉప రాష్ట్రపతి పదవికి వెంకయ్యనాయుడుకు వైసీపీ మద్దతుగా ఓటేసింది.. 2022లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కూడాఎన్డీయే బలపరచిన ద్రౌపది ముర్ముకి.. ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధంకర్ కి మద్దతుగా ఓటేసింది వైసీపీ.. అయితే ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధంఖర్ రాజీనామా చేయడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.. దీంతో ఎన్డీఏ తరఫున ఉప రాష్ట్రపతి బీజేపీ సీపీ రాధకృష్ణన్ ఉప రాష్ట్రపతి అభ్యర్దిగా బరిలో నిలవటంతో మద్దతుగా నిలిచింది వైసీపీ.. మొత్తంమీద మరోసారి తమకు బీజేపీతో స్నేహ సంబంధాన్ని పునరుద్దరించుకోవడానికే జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ నుంచి తెలుగు బిడ్డ జస్టీస్ సుదర్శనరెడ్డిని ఇండియా కూటమి అభ్యర్ధిగా ప్రకటించినా జగన్ అలాంటి నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదంగా మారింది.

వైసీపీతో కాంగ్రెస్ సీనియర్ నేతల సంప్రదింపులు

మరోవైపు కాంగ్రెస్ అగ్ర నేతలు వైసీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.. రాజ్యసభలో ఏడుగురు సభ్యుల బలమున్న వైసీపీనీ తమ వైపు లాక్కోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది.. దాంట్లో భాగంగానే తాజాగా ఢిల్లీలో కొన్ని కీలక పరిణామాలతో చేసుకున్నాయి.. ఎంపీ రఘునాథరెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుగు ఖర్గే నివాసానికి వెళ్లి భేటీ ఆవ్వటం ఏపీ రాజకీయాల్లో కీలకంశంగా మారింది.. అది జరిగిన గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ అగ్ర నేత జై రాం రమేష్ వైసీపీకి కీలక నేత వైవీ సుబ్బారెడ్డి కి ఫోన్ చేసి మద్దతు కోరడంతో వైసీపీ కాంగ్రెస్ వైపు వెళ్తుందా.! అనే చర్చ మొదలైంది. అయితే వైసీపీ నేతలు మాత్రం ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ విషయంలో తాము మొదటి నుంచి ఎన్డీఏ వైపే ఉన్నామని స్పష్టంగా చెప్తున్నారు.. అలాగే ఎన్డీఏ నుంచి తమను ముందుగా అడిగారని.. దాంతో వెంటనే ఓకే చెప్పాల్సి వచ్చిందని.. మీరు లేటుగా అడిగారని సుబ్బారెడ్డి సమాధానం చెప్పినట్లు సమాచారం.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైసిపి పాలనలో చేసిన అక్రమాలు, దౌర్జన్యాలపై పలు కేసు నమోదు అయ్యాయి.. కీలక నేతల సైతం అరెస్టయి జైల్లో ఉన్నారు.. లిక్కరు కేసులో జగన్ అరెస్ట్ అదిగో ఇదిగో అంటూ చక్కర్లు కొడుతుంది.. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ ఇండియా వైపు వెళ్లే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు..

ఉప రాష్ట్రపతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ

ఉప రాష్ట్రపతి ఎన్నికను బీజేపీ ఎంతో ప్రతిష్టగా తీసుకుంటోంది. నిజానికి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి ఎలక్ట్రోరల్ కాలేజిలో పూర్తి మెజారిటీ ఉంది. కానీ ఇది చాలదు బంపర్ విక్టరీ కొట్టాలి ఇండియా కూటమిని ఓడించాలి. అంతే కాదు ఎక్కువ పార్టీలు పరోక్షంగా అయినా తమతోనే ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేసేలా బీజేపీ అడుగులు వేస్తుంది. ఈ ఎత్తుగడతోనే బీజేపీ జగన్‌కి టచ్‌లోకి రాజ్‌నాథ్ సింగ్ వచ్చారనే టాక్ నడుస్తోంది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కే ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి విపక్షాలను కో ఆర్డినేట్ చేసుకునే బాధ్యతను కేంద్రం అప్పగించింది. దాంతో ఆయన జగన్ కి ఫోన్ చేసి మాట్లాడారు. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదనతో జగన్ పార్టీ నేతలతో చర్చించి ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు ప్రకటించారంటున్నారు.

ఆర్ఎస్ఎస్ వాదికి మద్దతు ఇస్తారా ? అని వైసీపీపై ధ్వజం

వైసీపీకి, బీజేపీకి మధ్య లోపాయి కారీ ఒప్పందం ఉందని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల తరచూ ఆరోపిస్తున్నారు. మోడీ దత్తపుత్రుడు జగన్ అని విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ ముసుగు మళ్ళీ తొలగిందని.. లోనున్న కాషాయ కండువా మరోసారి బయటపడిందని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. ఆంధ్రప్రవేశ్ రాష్ట్రంలో కూటమి పక్షాలతో కుస్తీ.. ఢిల్లీలో మతపిచ్చి బీజేపీతో దోస్తీ అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ ప్రతిపక్షాలన్నీ కలిసి రాజకీయాలతో సంబంధం లేని ఒక తెలుగు బిడ్డ, న్యాయ నిపుణుడిని నిలబెడితే, బీజేపీ నిలబెట్టిన RSS వాదికి మద్దతు ఇస్తారా ? అని వైసీపీపై ధ్వజం ఎత్తుతున్నారు.

Also Read: దారుణం.. హైదరాబాద్‌లో కరెంట్ షాక్‌తో మరో వ్యక్తి దుర్మరణం..

ఎవరితో పొత్తులు, అవగాహన లేవని వైసీపీ ప్రకటనలు

ఏ పార్టీతోను పొత్తులు కానీ అవగాహన కానీ లేవని వైసీపీ నేతలు చెబుతున్న మాట. తమది న్యూట్రల్ పార్టీ అంటూ వైసీపీ ప్రకటించుకుటుంది. కేంద్ర స్థాయిలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమితో కానీ అలాగే కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమితో కానీ వైసీపీకి రాజకీయ బంధం అయితే లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే జాతీయ స్థాయిలో ఎన్డీఏకు జగన్ పదేపదే బేషరతుగా మద్దతు ఇవ్వడం తీవ్ర విమర్శల పాలవుతోంది.

Story By Rami Reddy, Bigtv

Related News

Anantapur News: ఎమ్మెల్యే దగ్గుపాటి ఆఫీస్ వద్ద టెన్షన్.. తరలివచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్

Vangaveeti Statue: వంగవీటి రంగా విగ్రహం.. నిందితుడు దొరికాడు, వెనుక ఎవరున్నారు?

CM Chandrababu: నేతలను దులిపేసిన సీఎం చంద్రబాబు.. సమయం ఆసన్నమైందంటూ వ్యాఖ్య

Vizag real estate: విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. చీప్ అండ్ బెస్ట్ ప్లాట్ కావాలా? ఇదే ఛాన్స్!

CM Chandrababu: పెద్దాపురంలో కలకలం.. చంద్రబాబు కాన్వాయ్ ఆపిన భూమి బాధితుడు!

Big Stories

×