BigTV English

India Alliance: కూటమిలో కుంపట్లు.. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది.?

India Alliance: కూటమిలో కుంపట్లు.. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది.?

ఇండియా కూటమి భవిష్యత్తుపై ప్రశ్నలు

ఇది తెలిసిన చరిత్రేగా అనుకోవద్దు. చీలకలు, మెలికలు ఎన్నున్నా తట్టుకోని, రెండు పర్యాయాలు దేశాన్ని పాలించిన కూటమి ఇది. నాడు ప్రతిపక్ష ఎన్డీయేను నిద్రపోకుండా చేసిన బలం ఈ కూటమి సొంతం. అయితే, ఇప్పుడు దాని పేరు మారినప్పటికీ నాటి ఆత్మ మాత్రం అలాగే ఉంది. కానీ, అందులో సామరస్యమే లోపిస్తోంది. యూపీఏ నుండి ఇండియాగా మారిన భారత ప్రతిపక్ష కూటమి సామర్థ్యం ఇప్పుడు పూర్తి ప్రక్షాళన దిశగా వెళుతుందా అనే సందేహాలు వస్తున్నయ్. ఇండియా కూటమి భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నయ్. ఎందుకంటే, అందులోని అనేక వర్గాల మధ్య విభేదాలు తెరపైకి వస్తున్నాయ్. కూటమిని నడిపే కాంగ్రెస్ తీవ్రమైన ఆత్మపరిశీలన చేసుకోవాలనే విమర్శలు పెరుగుతున్నయి.


కూటమిలోని కీలకమైన పార్టీల మధ్య చీలిక

ఇటీవల, బాబ్రీ మసీదు కూల్చివేతపైన ఉద్ధవ్ థాక్రే శివసేన హర్షం వ్యక్తం చేసిన తర్వాత మహా వికాస్ అఘాడి నుండి నిష్క్రమిస్తున్నట్లు సమాజ్ వాదీ పార్టీ ప్రకటించింది. మహారాష్ట్ర నుండి మొదలైన ఈ తాజా ఘర్షణ, ఇప్పుడు కూటమిలోని కీలకమైన పార్టీల మధ్య చీలికకు కారణం అయ్యింది. ఇది, పార్లమెంట్ ముందు నడుస్తున్న ఇండియా కూటమి నిరసనల్లో స్పష్టంగా కనిపించింది. సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ కూడా అదానీ సమస్యపై నిరసనల సమయంలో పాల్గొనలేదు. ఒక విధంగా.. పార్లమెంటు లోపలా, బయటా కూడా కూటమి భాగస్వాముల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత కూటమిలో పార్టీలు తమ అసహనాన్ని మరింత పెంచాయి. బలహీనమైనమవుతున్న ప్రధాన పార్టీ కాంగ్రెస్‌తో కలిసి నడవడంపై కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలనే మాట వచ్చింది. ముఖ్యంగా, కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా.. ఇతర పార్టీలకు కూడా అనుకూలంగా ఉండాలనే డిమాండ్ పెరిగింది.

ఇండియా కూటమిని తానే నడిపిస్తానన్న మమతా బెనర్జీ

విపక్షాల కూటమిలో కాంగ్రెస్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పలువురు నేతలు ఇప్పటికే స్వరం పెంచారు. భాగస్వామ్య పక్షాల్లో విబేధాల మధ్య.. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఇండియా బ్లాక్ పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంకో అడుగు ముందుకేసి, అవకాశం ఇస్తే ఇండియా కూటమిని తానే నడిపిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా తన పాత్రను కొనసాగిస్తూనే.. ప్రతిపక్ష ఫ్రంట్‌ను నడిపే డ్యూయల్ రోల్‌ను మమతా దీదీ నిర్వహించగలరని టీఎంసీలో బడా నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు.

అదానీ అవినీతిపై అమెరికాలో ఆరోపణలు వచ్చిన అంశం ఒక్కదాన్నే తీసుకొని, పార్లమెంటు స్థంభింపచేయడం సరికాదంటూ టీఎంసీ వాదిస్తోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిధుల కొరత, మణిపూర్ అశాంతితో సహా ఆరు కీలక అంశాలను పార్లమెంటులో లేవనెత్తాలనుకుంటున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ అబ్జెక్షన్ మాత్రమే కాదు.. ఇండియా కూటమిలో భాగమైనప్పటికీ.. ఎన్నికల్లో కాంగ్రెస్ భాగస్వామిగా లేని ఏకైక పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్. ఈ పార్టీ నేతలు, ఇప్పుడు ఇండియా బ్లాక్‌నే తమ ఆధీనంలోకి తీసుకుంటామని అంటున్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోమన్న ఆప్

మరోవైపు, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్‌తో కొనసాగడం కష్టమని కుండ బద్దలు కొట్టింది. హర్యానా, మహారాష్ట్రలో ఓటమితో ఇప్పటికే బలహీనపడిన కాంగ్రెస్‌తో.. 2025 ప్రారంభంలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పొత్తు పెట్టుకోకూడదని అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ తన సొంత బలంతో ఎన్నికల్లో పోటీ చేస్తుందని కేజ్రీవాల్ సోషల్ మీడియా ఎక్స్‌లో ప్రకటించారు.

ఇక, టిట్ ఫర్ టాట్ రెస్పాన్స్ ఇచ్చిన ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్.. ఢిల్లీలో కాంగ్రెస్ ఒంటిరిగా పోటీ చేసి గెలుస్తుందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ పార్టీతో పొత్తు పెట్టుకోబట్టే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని కూడా సెటైర్లు వేశారు. అయితే, ఇటీవల, హర్యానాలో కాంగ్రెస్‌ చేతిలో కేజ్రీవాల్‌ పార్టీ ఓటమి పాలైన తర్వాత ఈ ప్రకటన రెండు పార్టీల మధ్య మరింత హీట్ పెంచింది. స్వయంగా కేజ్రివాలే “మేము కాంగ్రెస్‌తో కలవట్లేదు” అని చెప్పడంతో ఇక బ్రేక్ తప్పదనే సంకేతాలు వెళ్లాయి.

అదానీ, రైతుల సమస్యలపైన మాత్రమే కాంగ్రెస్ దృష్టి

ఇక, పార్లమెంట్ శీతాకాల సమావేశాల వాయిదాల పర్వం కూటమి పార్టీలను మరింత అసహనానికి గురిచేస్తుంది. అదానీ, రైతుల సమస్యలపైన మాత్రమే కాంగ్రెస్ దృష్టి సారించడం.. అంతకుమించి, అంశాలేవీ లేవన్నట్లు నడుచుకోవడం, దాని భాగస్వాములను మరింత దూరం చేస్తోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అనేక సమస్యలను లేవనెత్తాల్సిన కాంగ్రెస్, ఇప్పుడు పార్లమెంటులో ఒంటరిగా మిగిలిందనే కామెంట్లు వస్తున్నాయి.

జూన్ 2023లో లోక్‌సభ ఎన్నికలకు ముందు “బిజెపి హటావో, దేశ్ బచావో” నినాదంతో ప్రతిపక్ష కూటమి ఏర్పడింది. కానీ దాని వ్యవస్థాపకు్లో కీలకమైన జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీష్ కుమార్ మొదట్లోనే ప్లేట్ ఫిరాయించారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని అధికార నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌తో చేతులు కలిపారు. ఇప్పుడు, బెంగాల్ టీఎంసీ దారిలోనే సమాజ్ వాదీ పార్టీ కూడా నడిచేలా కనిపిస్తుంది. తమ పార్టీ ఇప్పటికీ ఇండియా కూటమిలో ఉందనీ.. అయితే, కూటమిలో అభిప్రాయ భేదాలు ఉన్నాయని అంగీకరించారు.

మిగిలిన పార్టీలను గౌరవించాలన్న సీపీఐ నేత డి.రాజా

మరోవైపు, ప్రతిపక్ష కూటమిలో ఇటీవలి పరిణామాలపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూటమికి చైర్‌పర్సన్ కాబట్టి, సమస్యలపై ఆయనే స్పందించాలని చురకేశారు. అయితే, కాంగ్రెస్ తన భాగస్వామ్య పక్షాల విషయంలో మరింత అనుకూలంగా ఉండాలనీ.. కొంత ఆత్మపరిశీలన కూడా చేసుకోవాలని రాజా ఒప్పుకున్నారు. ఇటీవలి, అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకం ఎందుకు సరిగ్గా జరగలేదంటూ ప్రశ్నించారు. అందులో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్.. ప్రతిపక్షాల లీడర్‌గా లోతుగా ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. “బీజేపీ హఠావో, దేశ్ బచావో” నినాదంతో ఏర్పడిన ఇండియా కూటమి, ఆ లక్ష్యంతోనే కృషి చేయాలనీ.. దానికి, మిగిలిన పార్టీల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.

ఇండియా కూటమిది అవకాశవాదమంటున్న బిజెపి

సాధారణంగా, ఏ కూటమిలో అయినా విభేదాలు కొత్తేమీ కాదు. అయితే, కాంగ్రెస్ నడిపించే కూటమిలో ఇది కాస్త ఎక్కువ అనేది చరిత్ర చెబుతున్న వాస్తవం. అలాగే, ఇప్పుడు కూడా ఇండియా కూటమి విఛ్చిన్నం దిశగా అడుగులేస్తుందన్నది కొందరు అంటున్న మాట. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పేలవమైన పర్ఫామెన్స్ తర్వాత నుండీ సమాజ్ వాదీ పార్టీ కాస్త వెనకడుగు వేసిందనడంలో సందేహం లేదు. “ఇండియా కూటమి కేవలం కాగితాలపై మాత్రమే కనిపించింది కానీ, ఇప్పుడు.. అది కూడా ఉండదు” అనే టాక్ ఎస్పీతో పాటు చాలా మంది కూటమి నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ పరిస్థితి, ఇప్పుడు అధికార బీజేపీకి మరింత బలాన్ని ఇస్తోంది. ఇండియా కూటమిది అవకాశవాదమని అభివర్ణిస్తున్నారు. ఈ విమర్శల మధ్య.. కూటమిని మరో బలమైన నేత నడపాలనే పరిస్థితిని తీసుకొచ్చింది.

ఇప్పుడున్న పరిస్థితులు, అప్పుడు చేసిన ప్రతిజ్ఞలకు విరుద్ధం

పాట్నాలో జరిగిన ఇండియా కూటమి తొలి సమావేశంలో ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని ఖర్గే అన్నారు. ఈ సమావేశానికి దాదాపు 17 రాజకీయ పార్టీలకు చెందిన 32 మందికి పైగా నేతలు హాజరయ్యారు. వీళ్లందర్నీ ఉద్దేశించి, రాహుల్ గాంధీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలు ఏవైనా గత విభేదాలను పక్కన పెట్టి, క్లీన్ స్లేట్‌తో సమావేశానికి హాజరయ్యానంటూ తెలిపారు.

దేశాన్ని కాపాడేందుకు కలిసికట్టుగా పని చేయాలని స్పష్టమైన సందేశం ఉందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా అన్నారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితులు, అప్పుడు చేసిన ప్రతిజ్ఞలకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. అయినా సరే, కాంగ్రెస్ నేతలు మాత్రం ఇలాంటివి సర్వసాధారణమనీ… ఏది ఏమైనా… గ్రాండ్ ఓల్డ్ పార్టీ అండ లేకుండా ఏ ప్రతిపక్ష కూటమి పనిచేయలేదని భావిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వైఖరి ఇలాగే ఉంటే కూటమిలో వేరే కుంపటికి దారి తీస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×