Criticism: కొంతమంది జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా.. మానసిక స్థైర్యంతో వాటిని ఎదుక్కొంటూ ముందుకు వెళ్తుంటారు. మరికొందరిలో క్షమించే గుణం, జాలి, దయ, కరుణ వంటి లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆసరాగా చేసుకుని కొంతమంది వారిని మానసికంగా దెబ్బతీస్తుంటారు. అయితే, కొంతమంది ఎంత ధైర్యంగా ఉన్నప్పటికీ.. కొన్ని విమర్శలు, అవమానాలను మాత్రం తట్టుకోలేరు. ఇలాంటి పరిస్థితి అందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో జరుగుతుండటం సహజం. అయితే, ఇలాంటి అలవాట్లు ఎదుటివ్యక్తి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంటాయి. ఇలాంటి పరిస్థితులను ప్రశాంతంగా ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎవరైనా మిమ్మల్ని అవమానపరిస్తే.. వెంటనే చెప్పలేనంత కోపం, బాధ కలుగుతుంటాయి. వెంటనే వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనిపిస్తుంటుంది. కానీ, ఆవేశంలో అలా ప్రతిస్పందించినప్పుడు సమస్య మరింత పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. దానివల్ల మీకెలాంటి పరిష్కారమూ దొరకదు. కాబట్టి.. మొదట మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. ఆ తర్వాత వారికి శాంతియుతంగా మీ అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి.
కొంతమంది పనేంటంటే.. ఎదుటివారి చేతలను గమనిస్తూ, వారిని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. సమయం వచ్చినప్పుడు వారి అహంకారాన్ని ఇతరులపై చూపిస్తుంటారు. ఇలాంటి వ్యక్తులకు ఎదుటివారు బాధపడతారన్న ఆలోచన అస్సలే ఉండదు. ఈ వర్గానికి చెందిన వ్యక్తులతో సానుకూలంగా ఉన్నా ప్రయోజనం లేదు కాబట్టి.. వీళ్లకి దూరంగా ఉండటమే మీ సమస్యలకు ఏకైక పరిష్కారం అంటున్నారు నిపుణులు.
మిమ్మల్ని బాధపెట్టాలనే ఉద్దేశంతోనే అందరూ విమర్శలు చేయరనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ లోపాలను సరిదిద్దాలనే ఉద్దేశంతో.. మీకు అత్యంత సన్నిహితులు, శ్రేయోభిలాషులు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి వారు విమర్శించినప్పుడు వాళ్లమీద గట్టిగా అరవకుండా, వారితో ఒకసారి చర్చించడం ఉత్తమం. ఈ క్రమంలో మీ ప్రవర్తన, మీలో ఉండే లోపాల గురించి మీకు తెలియజేసి వారు మిమ్మల్ని సరిదిద్దాలనుకుంటున్నారేమో తెలుసుకోవడం కూడా అవసరమే.
ఎలాంటి సమస్యలకైనా సానుకూల ధోరణే సరైన పరిష్కారం అనే నిజాన్ని మరవొద్దు. అయితే, అన్ని సందర్భాల్లోనూ సానుకూలంగా ఉండటం కష్టమే. ముఖ్యంగా మనల్ని ఎవరైనా ఏదైనా విషయంలో అనవసరంగా విమర్శించినప్పుడు, అవమానించినప్పుడు విపరీతమైన కోపం వస్తుంటుంది. సరిగ్గా అలాంటప్పుడే మన వ్యక్తిత్వం బయటపడుతుందంటున్నారు నిపుణులు. అందుకే, ఇలాంటి సందర్భాల్లో సానుకూల దృక్పథంతో ఆలోచిస్తూ కోపాన్ని నియంత్రించుకోవడం ఎంతో ముఖ్యం.