Hydraa AV Ranganath: హైడ్రాకు మద్ధతు పలికిన నగర ప్రజలకు హైడ్రా కృతజ్ఞతలు తెలిపింది. సామాజిక మాద్యమాలు వేదికగా.. వేల ఇళ్లను హైడ్రా కూల్చిందంటూ కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని ర్యాలీలు, ప్రదర్శనల ద్వారా తిప్పి కొట్టిన వారికి హైడ్రా ధన్యవాదాలు తెలిపింది. ప్రజల నుంచి వచ్చిన మద్దతు హైడ్రాకు మరింత స్ఫూర్తినిచ్చిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. నగర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని.. పర్యావరణ హితమైన నగరంలో ప్రజలు మెరుగైన జీవనాన్ని కొనసాగించాలనే ప్రభుత్వ లక్ష్యం మేరకు హైడ్రా పని చేస్తోందని స్పష్టం చేశారు.
హైడ్రా వల్ల జరిగిన మేలును వివరిస్తూ.. పెద్దలు, పిల్లలు, మహిళలు, యువకులు ర్యాలీలు నిర్వహించి మద్ధతు తెలపడం పట్ల హైడ్రా హర్షం వ్యక్తం చేసింది. హైడ్రా వల్ల లక్షల మందికి లాభం చేకూరిందంటూ.. నగరవ్యాప్తంగా జరిగిన మేలును వివరిస్తూ ప్లకార్డులు ప్రదర్శించిన తీరు స్ఫూర్తిని నింపిందన్నారు. మీడియా సంస్థలతో పాటు.. చాలా వరకు సోషల్ మీడియాలో కూడా హైడ్రా కార్యక్రమాలను ప్రజలవద్దకు చేరవేసిన తీరును అభినందిస్తున్నామన్నారు.
చట్టాలను గౌరవిస్తూనే ముందుకు..
చట్టంలో ఉన్న అక్షరాల వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం, ఆంతర్యం, లక్ష్యం తెలుసుకుని హైడ్రా పని చేస్తోందని ఏవీ రంగనాథ్ తెలిపారు. రాజ్యాంగం, న్యాయస్థానాలు, చట్టాలపైన హైడ్రాకు ఎనలేని గౌరవం ఉందని.. వాటి స్ఫూర్తితోనే ప్రకృతి పరిరక్షణకు పాటుపడుతున్నామన్నారు. పేదవారిని అడ్డం పెట్టుకొని బడాబాబులు సాగిస్తున్న కబ్జాలను వెలికి తీస్తుందన్నారు. ధనదాహంతో ఇష్టానుసారం కబ్జాలు చేసి ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నవారు హైడ్రాపై దాదాపు 700ల వరకూ కేసులు పెట్టారని.. వ్యక్తిగతంగా తనపై కూడా 31 వరకు కంటెంప్ట్ కేసులు వేశారని గుర్తు చేశారు.
వారి జోలికి హైడ్రా వెళ్లదు..
చట్టాలను గౌరవిస్తూ.. ప్రజలు ఇచ్చిన స్ఫూర్తితో పర్యావరణాన్ని, ప్రజల ఆస్తులను పరిరక్షిస్తామని చెప్పారు. ప్రభుత్వం దిశానిర్దేశం చేసిన విధంగా చెరువులు, ప్రభుత్వ, ప్రజల ఆస్తులను కాపాడుతూ ప్రకృతిని పరిరక్షించేందుకు పని చేస్తున్నామన్నారు. 2024 జూలైకి ముందు నుంచే నివాసం ఉన్నవారి ఇళ్ళ జోలికి హైడ్రా వెళ్ళదని స్పష్టం చేశారు. తప్పనిసరి అయి తొలగించాల్సివస్తే వారికి ప్రత్యామ్నాయం, పరిహారం అందేలా ప్రభుత్వానికి నివేదిస్తామని హైడ్రా కమిషనర్ తెలిపారు.
రూ. 55వేల కోట్ల విలువైన ప్రజల ఆస్తులను కాపాడాం
హైడ్రా ఏర్పాటయిన నాటి నుంచి నేటి వరకు మొత్తం 181 డ్రైవ్స్ నిర్వహించి 954 కబ్జాలను తొలగించామని ఏవీ రంగనాథ్ గారు తెలిపారు. మొత్తం 1,045.12 ఎకరాల భూమిని హైడ్రా కాపాడిందని.. వీటి విలువ సుమారు రూ.50,000 కోట్ల నుండి రూ.55,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇందులో ప్రభుత్వ భూములు 531.82 ఎకరాలు కాగా.. రహదారుల కబ్జాలు 222.30 ఎకరాల వరకూ ఉన్నాయి. చెరువుల కబ్జా 233.00 ఎకరాలు, పార్కుల కబ్జాలు 35 ఎకరాలు ఇలా.. మొత్తం 1045.12 ఎకరాలను హైడ్రా స్వాధీనం చేసుకుంది. వర్షాలు వచ్చినప్పుడు కాకుండా.. ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడంతో.. ఈ ఏడాది వరదలు చాలా వరకు నియంత్రించామన్నారు. క్యాచ్‌పిట్స్ క్లీనింగ్ 56,330, నాళాల క్లీనింగ్ 6,721, నీటి నిల్వ పాయింట్లు క్లియర్ చేయడం 10,692, కల్వర్ట్లు క్లియర్ చేయడం 1,928, ఇతర పనులు 21,301 ఇలా మొత్తం 96,972 పనులు హైడ్రా ఈ వర్షాకాలంలో చేపట్టిందన్నారు.
ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాలపై దృష్టి..
ఈ ఏడాది వర్షాలు ఎడతెరిపి లేకుండా పడ్డాయి. భారీ వర్షాలు చాలా సార్లు నమోదయ్యాయి. భారీమొత్తంలో కాలువల్లో పూడికను తొలగించడంతో ఈ సారి నగరంలో వరదలను కట్టడి చేశామన్నారు. 5 సెంటీమీటర్ల వర్షం పడితే అమీర్‌పేట మైత్రీవనం పరిసరాలు వరద నీట మునిగేవి. ఇందుకు గల కారణాలను మూలాలకు వెళ్లి హైడ్రా కనుగొంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ప్రధాన రహదారి కింద భూగర్భంలో ఉన్న పైపులు పూర్తిగా పూడుకుపోవడంతో వరద ముంచెత్తే పరిస్థితతులు తలెత్తుతున్నాయని హైడ్రా గ్రహించింది. వెంటనే ఆ పైపులైన్లలో పూడికను తొలగించడంతో వరద ముప్పు తప్పింది. తర్వాత 15 సెంటీమీటర్ల వర్షం పడినా ఎలాంటి ఇబ్బంది ఏర్పడలేదు’ అని వివరించారు.
దీంతో పైన ఉన్న అంబేద్కర్ నగర్ బస్తీ, శ్రీనివాసనగర్, కృష్ణానగర్, యూసుఫ్‌గూడ ప్రాంతాలకు వరద ముప్పు తప్పింది. ఇదే పరిస్థితి ప్యాట్నీ నాలా వద్ద కూడా నెలకొంది. ఈ నాలా వాస్తవ విస్తీర్ణం 70 అడుగులు కాగా.. ప్యాట్నీ వద్దకు వచ్చేసరికి 15 అడుగులకు వెడల్పు తగ్గిపోయింది. ఈ ఆక్రమణలు తొలగించి రిటైనింగ్ వాల్ నిర్మించడంతో పాయిగా కాలనీ, ప్యాట్నీ కాలనీ, విమాన్‌నగర్, బీహెచ్ ఈ ఎల్ కాలనీచ ఇందిరమ్మ నగర్ ఇలా అనేక కాలనీలకు వరద ముప్పు తప్పింది. దశాబ్దాల సమస్య పరిష్కారం అయ్యింది. తూముకుంట మున్సిపాలిటీ దేవరయాంజల్ విలేజ్‌లోని తురకవాణికుంట నుంచి దేవరయాంజల్ చెరువుకు వెళ్లే వరద కాలువ 6 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. అక్కడ కొంతమంది ఆ నాలాను కేవలం 2 ఫీట్ల పైపులైను వేసి మిగతా భూమిని కబ్జా చేయడంతో తమ ప్రాంతాలన్నీ నీట మునుగుతున్నాయని ఫిర్యాదు అందగానే ఆ సమస్యను పరిష్కరించాం’ అని వివరించారు.
రూ. 58.40 కోట్లతో చెరువుల పునరుద్ధరణ..
నగరంలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని హైడ్రా చేపట్టింది. మొదటివిడతగా చేపట్టిన 6 చెరువుల్లో ఇప్పటికే బతుకమ్మకుంట ప్రారంభమవ్వగా.. తమ్మిడికుంట (మాధాపూర్), కూకట్‌పల్లి నల్ల చెరువు, పాతబస్తీలోని బమ్‌రుక్ ఉద్ దౌలా చెరువులు ఈ నెలాఖరుకు సిద్ధం చేస్తున్నామని హైడ్రా కమిషనర్ తెలిపారు. ‘సున్నం చెరువు (మాదాపూర్), నల్లచెరువు (ఉప్పల్) చెరువుల పునరుద్ధరణతో వరద ముప్పును తగ్గించాం. అంతే కాదు.. పై చెరువుల ఆక్రమణలను తొలగించి 105 ఎకరాల నుండి 180 ఎకరాలకు పెంచాం. 75 ఎకరాల భూమి తిరిగి ప్రజలసొంతమయింది. బతుకమ్మకుంట పునరుద్ధరణతో అక్కడ లోతట్టు ప్రాంతాలను, కూకట్‌పల్లి నల్లచెరువుతో చుట్టూ ఉన్న బస్తీలు, తమ్మిడికుంటతో శిల్పారామం ప్రధాన రహదారిపై వరద లేకుండా చేశాం’ అని కమిషనర్ తెలిపారు. ప్రాధాన్య క్రమంలో మరిన్నిచెరువులు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో హైడ్రా పని చేస్తోందని చెప్పారు.
ALSO READ: HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం