E-Paper
Advertisement

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్.. కేటీఆర్ సంచలన ప్రకటన!

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్.. కేటీఆర్ సంచలన ప్రకటన!
Advertisement

BRS National: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ పుంజుకోవాలని ప్రయత్నిస్తున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కు జాతీయ రాజకీయాలు కలిసివస్తాయా? తెలంగాణకే పరిమితమైన పార్టీగా మిగిలిపోతుందా? లేక మరోసారి జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తుందా? పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ ప్రశ్నలను మరోసారి తెరపైకి తెచ్చాయి. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ కీలక పాత్ర పోషించగలరన్న ఆయన అభిప్రాయం గులాబీ శిబిరంలో కొత్త చర్చకు దారితీసింది. అయితే, ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ ఆకాంక్షను వెల్లడిస్తున్నాయా? లేక భవిష్యత్తు వ్యూహానికి సంకేతమా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గతంలోనూ ఇదే లక్ష్యంతో అడుగులు

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి అధికార పీఠం వరకు సాగిన కేసీఆర్‌ ప్రస్థానం.. జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించాలన్న ఆలోచనతో కొత్త మలుపు తీసుకుంది. ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి, జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిని నిర్మించాలన్న లక్ష్యంతో ఆయన ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే 2022లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మార్చారు. పార్టీని తెలంగాణ సరిహద్దులు దాటించి దేశవ్యాప్తంగా విస్తరించాలన్న సంకల్పాన్ని ప్రకటించారు. మహారాష్ట్ర, బీహార్, లతోపాటు వివిధ రాష్ట్రాల్లో పర్యటనలు, ఇతర పార్టీలలో ని ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు, జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలపై కసరత్తు.. ఇలా కొంతకాలం బీఆర్‌ఎస్‌ కార్యాచరణ రాష్ట్రం వెలుపలకూ విస్తరించింది.అయితే, ఆ ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాల్లో పార్టీకి బలమైన సంస్థాగత పునాది ఏర్పడకపోవడం, స్థానిక రాజకీయ సమీకరణాలు అనుకూలించకపోవడం, జాతీయ స్థాయిలో పార్టీకి విస్తృత గుర్తింపు లభించకపోవడం వంటి అంశాలు విస్తరణకు అడ్డంకులయ్యాయి. దీంతో జాతీయ రాజకీయాలపై సాగిన హడావుడి క్రమంగా తగ్గిపోయింది.

అసెంబ్లీ ఓటమితో మారిన ప్రాధాన్యాలు

Advertisement

2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో బీఆర్‌ఎస్‌ రాజకీయ ప్రాధాన్యాలు మారిపోయాయి. పదేళ్ల పాలన అనంతరం ప్రతిపక్షంలోకి వచ్చిన పార్టీకి రాష్ట్రంలో తన ఉనికిని కాపాడుకోవడం, శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడం, ప్రజల్లో కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి పొందడం ప్రధాన సవాళ్లుగా మారాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, పార్టీ నుంచి కొందరు నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లడం, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరాటాన్ని ఉద్ధృతం చేయాల్సిన అవసరం.. ఇవన్నీ బీఆర్‌ఎస్‌ దృష్టిని ప్రధానంగా తెలంగాణ రాజకీయాలపైనే కేంద్రీకరించాయి. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల ప్రస్తావన చాలాకాలం తెరమరుగైంది. రాష్ట్రంలో పార్టీని పునర్వ్యవస్థీకరించుకోవడం, కేడర్‌ను నిలబెట్టుకోవడం, ప్రజా సమస్యలపై పోరాటం చేయడం వంటి అంశాలకే ప్రాధాన్యం పెరిగింది. గతంలో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్న లక్ష్యంతో ముందుకెళ్లిన పార్టీ.. ప్రస్తుతం రాష్ట్రంలో తిరిగి బలపడటమే ప్రధాన కర్తవ్యంగా వ్యవహరిస్తోంది.

Also read: రూ.736కే ట్రెండీ ఇయర్‌బడ్స్..ఫీచర్లు చూస్తే ఫిదా అవడం గ్యారంటీ

మళ్లీ ఎందుకీ ప్రస్తావన?

Advertisement

ఇటీవల పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందన్న అంచనాల నేపథ్యంలో కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ పాత్ర కీలకమవుతుందన్న అభిప్రాయం వెనుక రాజకీయ సంకేతాలున్నాయా? రాష్ట్రంలో పార్టీ శ్రేణులకు భరోసా కల్పించడమే ఉద్దేశమా? లేక భవిష్యత్తులో జాతీయ స్థాయిలో మరోసారి క్రియాశీలం కావాలన్న ఆలోచనకు ఇది ఆరంభమా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.రాష్ట్రంలో అధికార పార్టీపై పోరాటం చేస్తున్న బీఆర్‌ఎస్‌కు కేసీఆర్‌ అనుభవం, పరిపాలనా నేపథ్యం, రాజకీయ వ్యూహాలు ప్రధాన బలాలు. వాటిని జాతీయ స్థాయిలో ప్రస్తావించడం ద్వారా పార్టీ నాయకత్వంపై విశ్వాసాన్ని పెంచాలన్న ప్రయత్నం కూడా ఉండవచ్చు.

కేసీఆర్‌ పాత్ర..

ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ రాజకీయ భవిష్యత్తుపై నెలకొన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సందర్భంలో.. కేసీఆర్‌ పాత్రను మరోసారి ముందుకు తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, వ్యాఖ్యలు చేయడం ఒక ఎత్తయితే.. వాటిని కార్యాచరణగా మార్చడం మరో ఎత్తు. జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపాలంటే ఇతర రాష్ట్రాల్లో పార్టీకి సంస్థాగత నిర్మాణం, విశ్వసనీయ నాయకత్వం, స్థానిక సమస్యలపై అవగాహన, ఎన్నికల్లో పోటీ చేసే సామర్థ్యం అవసరం. గత అనుభవాల నేపథ్యంలో ఈ అంశాలపై బీఆర్‌ఎస్‌ ఎంతవరకు దృష్టి సారిస్తుందన్నదే కీలకం.

ప్రాంతీయ పార్టీలతో మళ్లీ దోస్తీ కుదిరేనా?

జాతీయ స్థాయిలో ఏ ప్రాంతీయ పార్టీకైనా ఇతర పార్టీలతో సంబంధాలు, రాజకీయ అవసరాలకు అనుగుణంగా కూటములు కీలకంగా మారతాయి. గతంలో కేసీఆర్‌ వివిధ పార్టీల నేతలతో చర్చలు జరిపినా.. దేశ రాజకీయాల్లో స్థిరమైన ప్రత్యామ్నాయ వేదికను నిర్మించడంలో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో ప్రధాన పార్టీల మధ్య పోటీ, ప్రాంతీయ పార్టీల రాష్ట్రాలవారీ ప్రయోజనాలు, కూటముల లెక్కలు మరింత సంక్లిష్టంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ మళ్లీ జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయాలంటే.. ఎవరితో కలిసి పనిచేయాలి? ఏ అంశాల ఆధారంగా రాజకీయ సమీకరణాలు నిర్మించాలి? తెలంగాణ ప్రయోజనాలను జాతీయ వేదికపై ఎలా ప్రస్తావించాలి? అనే ప్రశ్నలకు స్పష్టత అవసరం. గతంలో చేసిన ప్రయత్నాలకు, ఇప్పుడు అనుసరించబోయే వ్యూహానికి మధ్య తేడా ఏమిటో కూడా పార్టీ వివరించాల్సి ఉంటుంది.

ముందు తెలంగాణ.. ఆ తర్వాతే జాతీయం?

ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ఎదుర్కొంటున్న ప్రధాన సవాలు తెలంగాణలో తన పూర్వ వైభవాన్ని తిరిగి సాధించడం. రాష్ట్రంలో ప్రజా మద్దతును మరింత పెంచుకోవడం, కేడర్‌లో ఉత్సాహాన్ని నింపడం, ప్రభుత్వంపై ప్రజా సమస్యల ఆధారంగా పోరాటాన్ని బలోపేతం చేయడం వంటి అంశాల్లో పార్టీ సాధించే పురోగతే దాని తదుపరి రాజకీయ ప్రయాణాన్ని నిర్ణయించనుంది. రాష్ట్రంలో బలమైన పునాది లేకుండా జాతీయ స్థాయిలో ప్రభావం చూపడం కష్టమే.

సందేశంగానే మిగులుతుందా?

అదే సమయంలో, జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ అనుభవాన్ని ఉపయోగించుకోవాలన్న ఆలోచనను పూర్తిగా తోసిపుచ్చలేం. అయితే, అది తక్షణ రాజకీయ కార్యాచరణగా మారుతుందా? లేక పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచే రాజకీయ సందేశంగానే మిగులుతుందా? అన్నది చూడాలి. గతంలో తెలంగాణ రాజకీయాలను శాసించిన బీఆర్‌ఎస్‌.. ఇప్పుడు తిరిగి రాష్ట్రంలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ దశలో జాతీయ రాజకీయాల ప్రస్తావన పార్టీకి కొత్త ఊపునిస్తుందా? లేక గతంలో అసంపూర్తిగా మిగిలిన ప్రయోగాన్ని మళ్లీ గుర్తుచేస్తుందా? అన్నది కాలమే తేల్చాలి. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ పాత్రపై చర్చ మొదలైనా.. ఆ చర్చను వాస్తవ రాజకీయ ప్రభావంగా మార్చగలగడమే బీఆర్‌ఎస్‌ ముందున్న అసలు పరీక్ష.

Also read: ఆన్‌లైన్ క్లాసులు,ఆఫీస్ వర్క్ కోసం ఏసర్ క్రోమ్‌బుక్ లాంచ్- ధర ఎంతంటే?

Tags

Related News

తెలంగాణలో బీజేపీ బిగ్ ప్లాన్.. కాంగ్రెస్‌ను నిలదీసేందుకు వేసిన ప్లాన్ ఇదే?

ఫలించిన రేవంత్‌ దౌత్యం! తుమ్మిడిహెట్టి రీ డిజైన్‌తో జఠిల సమస్యను పరిష్కరించే దిశగా..! కేసీఆర్ చేతులెత్తేసిన చోటే..తాను సాధించే దిశగా అడుగులు..!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొత్తు వద్దే వద్దు..! అతన్ని చూసి ఇక్కడ ఓట్లేసే సీన్ లేదు..!?

ఆకాశంలో రెక్కలు విప్పి ఎగిరే చేప.. దీని వెనుక ఉన్న అద్బుత రహస్యం ఇదే?

కూటమిలో కుమ్ములాట.. బరిలోకి దిగేదెవరు? ఇంకా క్లారిటీ ఇవ్వని పెద్దలు!

స్వేచ్ఛ చెప్పిందే నిజమైందా.. హెచ్‌సీఏ కుంభకోణంలో షాకింగ్ నిజాలు!

సంక్రాంతి తర్వాత గ్రామాల బాట.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్?

Big Stories

Advertisement
×