HCA Scam: స్వేచ్చ బ్యూరో: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో భారీగా అక్రమాలు జరిగినట్టుగా సీఐడీ విచారణలో నిర్ధారణ అయ్యింది. క్రికెట్ అభివృద్ధి కోసం బీసీసీఐ మంజూరు చేసిన 211.98కోట్ల గ్రాంట్ తోపాటు మొత్తంగా హెచ్‌సీఏకు వచ్చిన 257.12కోట్ల ఆదాయంలో పెద్ద మొత్తంలో అవినీతి జరిగినట్టుగా తేలింది. ఫలితంగా హెచ్సీఏ 92.08కోట్ల రూపాయల నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని దర్యాప్తు అధికారులు తేల్చారు. ఈ మేరకు 80 పేజీల ఛార్జ్ షీట్ ను రూపొందించిన సీఐడీ అధికారులు దానిని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కోర్టుకు సమర్పించింది.
హెచ్‌సీఏలో జరుగిన అక్రమాలపై గతంలో ‘స్వేచ్ఛ’ వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు హెచ్సీఏ అధ్యక్షునిగా ఉన్న జగన్మోహన్ రావు దొడ్డిదారిన అసోసియేషన్ లోకి ప్రవేశించిన విషయంతోపాటు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొందరు కీలక నేతల అండదండలతో జగన్మోహన్ రావు..అతనితోపాటు మరికొందరు చేసిన అవినీతి బాగోతాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ప్రధాన కార్యదర్శి ధారం గురువారెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసులు నమోదు చేసిన అధికారులు విచారణ జరిపారు. 2023, అక్టోబర్ నుంచి 2025, జూన్ వరకు జగన్మోహన్ రావు హెచ్సీఏ అధ్యక్షునిగా, దేవరాజ్ రాంచందర్ కార్యదర్శిగా, జగన్నాథ్ శ్రీనివాసరావు కోశాధికారిగా, సునీల్ కాంటే సీఈవోగా పనిచేశారు. ఆ సమయంలో వీళ్లంతా కలిసి కౌన్సిల్ నిర్ణయాలు తీసుకున్నారు. వీటిపై సీఐడీ అధికారులు శ్రీ లక్ష్మీనివాస్ అండ్ కంపెనీతో ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించింది. దీంట్లో జగన్మోహన్ రావు, మిగితావారు కలిసి తీసుకున్న పలు కౌన్సిల్ నిర్ణయాలను కంపెనీ తప్పుపట్టింది.
అసలు, హెచ్సీఏ అధ్యక్షునిగా జగన్మోహన్ రావు నియామకం కావటమే అక్రమమని సీఐడీ విచారణలో తేలింది. మాజీ మంత్రి సీ.కృష్ణాయాదవ్ సంతకాలను ఫోర్జరీ చేసి ఆయనకు చెందిన గౌలిపురా క్రికెట్ క్లబ్ పేరును శ్రీచక్ర క్రికెట్ క్లబ్ గా మార్చి దాంట్లో జగన్మోహన్ రావు చేరినట్టుగా వెల్లడైంది. దీనికి కృష్ణాయాదవ్ సోదరుడు రాజేందర్ యాదవ్..ఆయన భార్య కవిత సహకరించినట్టుగా తేలింది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ లో సభ్యున్నని చెప్పి జగన్మోహన్ రావు హెచ్సీఏ అధ్యక్ష స్థానానికి పోటీ చేసి ఒక్క ఓటు తేడాతో గెలిచినట్టుగా వెల్లడైంది. నిజానికి గౌలిపురా క్రికెట్ క్లబ్ పేరును శ్రీచక్ర క్రికెట్ క్లబ్ గా మార్చటం చెల్లుబాటు కాదని హెచ్‌సీఏకు గతంలో అంబుడ్స్ మన్ గా వ్యవహరించిన జస్టిస్ నర్సింహారెడ్డి నిర్ధారించారు. ఈ క్రమంలో హెచ్సీఏ అధ్యక్షునిగా జగన్మోహన్ రావు ఎన్నిక అక్రమమని సీఐడీ తేల్చింది.
Also read: సిక్సులు కొట్టడం బాబర్ దగ్గర నేర్చుకో…వైభవ్ పై తన్వీర్ అహ్మద్ సంచలనం!
అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఉద్యోగుల వేతనాలు మినహా ఇతర ఆర్థిక లావాదేవీల్లో హెచ్సీఏ ఎలాంటి విధానపర నిర్ణయాలు తీసుకోవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, వీటిని ఉల్లంఘించిన హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ 39.11కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసింది. 2024, జనవరిలో భారత్..ఇంగ్లాండ్ మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన టెస్ట్ మ్యాచ్ సమయంలో సరైన కారణాలు చూపించకుండానే హెచ్సీఏ అకౌంట్ల నుంచి 18.5కోట్లను విత్ డ్రా చేశారు. జనరేటర్ల అద్దెకు 88,500రూపాయలకు టెండర్ వేసిన సుజాత ఎలక్ట్రికల్స్ ను పక్కనబెట్టి 99,999రూపాయలు కోట్ చేసిన పవర్ మాక్ ఎల్ఎల్పీకి టెండర్ ను కేటాయించారు. ఫుడ్ సరఫరా టెండర్ లో కూడా ఇలాగే అక్రమాలకు పాల్పడ్డారు. 815 రూపాయలకు ప్లేట్ భోజనం సరఫరా చేస్తామన్న ఎస్వీఎం గ్రాండ్ రిసార్ట్స్ ను కాదని 1,050 రూపాయలకు కోట్ చేసిన సురభి ఫ్యామిలీ రెస్టారెంట్ కు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇక, క్రికెటర్లను హోటల్ నుంచి స్టేడియంకు..స్టేడియం నుంచి హోటల్ కు తీసుకెళ్లటానికి ఖర్చు చేసినట్టుగా చెప్పిన 19.94లక్షల రూపాయలకు సంబంధించి రికార్డులు లేవని సీఐడీ విచారణలో తేలింది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే హెచ్సీఏ తమకు 8.95లక్షల రూపాయలు బాకీ ఉందంటూ అశోక ట్రావెల్స్ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించటం. దీంతోపాటు ఎయిర్ ట్రావెల్స్ కు సంబంధించి 1.48కోట్ల రూపాయలను పక్కదారి పట్టించినట్టుగా కూడా సీఐడీ దర్యాప్తులో తేలింది.
భారత్..ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాల కోసం హెచ్సీఏ వెస్ట్ ల్యాండ్ ఎంటర్ టైన్ మెంట్ కంపెనీతో టిక్కెట్ సర్వీస్ అగ్రిమెంట్ చేసుకుంది. 1.9లక్షల టిక్కెట్ల ముద్రణ కోసం 14.25లక్షలు చెల్లించారు. అయితే, దీంట్లో 49,628 టిక్కెట్ల తేడాను సీఐడీ అధికారులు గుర్తించారు. మొత్తంగా 14.01కోట్ల రూపాయలను లెక్కల్లో చూపలేదని నిర్ధారించారు.
ఇక, వైట్ టర్ఫ్ కొకాబుర్రా క్రికెట్ బాల్స్ కోసం టెండర్ దక్కించుకున్న కంపెనీకి హెచ్సీఏ 19.46లక్షలు చెల్లించింది. దీంట్లో కూడా అక్రమాలు జరిగినట్టుగా సీఐడీ విచారణలో తేలింది. 2024, డిసెంబర్ 23న హర్యానాలో బాల్స్ రవాణాకు సంబంధించిన వే బిల్లు జనరేట్ అయ్యింది. ఆశ్చర్యకరంగా అదే రోజు హైదరాబాద్ లో డెలివరీ చేసినట్టుగా రికార్డుల్లో పేర్కొన్నారు. అంటే 24గంటల్లోపు 1,576కిలోమటర్ల దూరం నుంచి క్రికెట్ బాల్స్ ను ఎలా తీసుకురాగలిగారు? అన్న ప్రశ్నకు హెచ్సీఏ వర్గాల నుంచి సమాధానం రాలేదు. గమనించాల్సిన అంశం ఏమిటంటే నకిలీ కోకాబుర్రా బంతులను సప్లయ్ చేసినట్టుగా సీఐడీ విచారణలో నిర్ధారణ కావటం. 5లక్షలకన్నా ఎక్కువ వ్యయమయ్యే పనులకు టెండర్లు పిలవాలన్న నిబంధన ఉన్నా దానిని పక్కనపెట్టి 8.86కోట్ల రూపాయల పనులను హెచ్సీఏ పెద్దలు తమ అస్మదీయులకు కట్టెబెట్టినట్టుగా దర్యాప్తులో తేలింది.
ఐపీఎల్ టిక్కెట్ల కోసం హెచ్సీఏ సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్ మెంట్ ను బ్లాక్ మెయిల్ చేసినట్టుగా కూడా సీఐడీ దర్యాప్తులో స్పష్టమైంది. నిజానికి ఒప్పందం ప్రకారం 10శాతం టిక్కెట్లను ఫ్రాంచైజ్ హెచ్‌సీఏకు ఇస్తూ వచ్చింది. అయితే, అదనంగా 30 ఓనర్స్ లాంజ్ టిక్కెట్లు కావాలని..దాంతోపాటు 2,500 టిక్కెట్లకు తమకు అమ్మాలని హెచ్‌సీఏలోని కొందరు పెద్దలు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ పై ఒత్తిడి తెచ్చారు. ఇవ్వలేదని 2025, మార్చి 27న సన్ రైజర్స్ హైదరాబాద్..లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలోని ఎఫ్3 కార్పోరేట్ బాక్స్ కు తాళం వేశారు. బ్లాక్ మెయిలింగ్ తో విసిగిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓ దశలో తాము ఆంధ్రప్రదేశ్ వెళ్లిపోతామని ప్రకటించింది. దాంతో తప్పనిసరై హెచ్సీఏ రాజీ కుదుర్చుకున్నట్టుగా కూడా సీఐడీ విచారణలో వెల్లడైంది.
Also read: ఒరేయ్ గంభీరా? వైభవ్‌ను ఓపెనర్‌గా పంపింటే ఇరగదీసేవాడు!