Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ అభివృద్ధి పనులు, ‘మొంథా’ తుపాను నష్టపరిహారంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై కీలక దిశానిర్దేశం చేశారు.
కృష్ణా నదిపై ఏటిమొగ, ఎదురుమొండి దీవులను కలిపే హై లెవెల్ వంతెన నిర్మాణాన్ని సాకారం చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇది 20 వేల మంది దీవుల వాసుల చిరకాల కల అని ఆయన పేర్కొన్నారు. ఈ వంతెన కోసం గతంలో రూ.109 కోట్ల నాబార్డు నిధులు మంజూరైనప్పటికీ, అలైన్‌మెంట్ మార్పుల కారణంగా అంచనా వ్యయం మరో రూ.60 కోట్ల వరకు పెరిగిందని అధికారులు తెలపగా, ఆ అదనపు నిధులను రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ‘సాస్కీ’ పథకం ద్వారా సమకూరుస్తామని ఆయన స్పష్టం చేశారు.
అవనిగడ్డ నియోజకవర్గంలో అవుట్‌ఫాల్ స్లూయిజ్‌ల సమస్యపై కూడా ఉప ముఖ్యమంత్రి దృష్టి సారించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా, కనీస నిర్వహణకు నోచుకోక స్లూయిజ్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఫలితంగా 5 వేల ఎకరాల పొలాలు ముంపుకు గురవుతున్నాయని అన్నారు. మొత్తం ఏడు స్లూయిజ్‌లను పునర్నిర్మించాల్సి ఉందని, ఇందుకు రూ.50 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. ఈ నిధులను జాతీయ విపత్తుల నిర్వహణ నిధులు, కేంద్ర ప్రభుత్వ సహాయంతో సమకూర్చుకుంటామని, అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలతో చర్చిస్తానని భరోసా ఇచ్చారు.
Read Also: Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!
‘మొంథా’ తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంపై మాట్లాడుతూ, పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా, నష్టపోయిన కౌలు రైతులను గుర్తించి వారికి న్యాయం చేయాలని నొక్కి చెప్పారు. కృష్ణా జిల్లాలోనే 60 వేల మందికి పైగా సీసీఆర్‌సీ కార్డులున్న కౌలు రైతులు ఉన్నారని, నమోదు కాని వారిని కూడా గుర్తించి, ప్రతి ఒక్కరికీ పరిహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అటవీ శాఖ అనుమతుల కోసం నిలిచిపోయిన అభివృద్ధి పనులను కూడా త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.