DCC Presidentship: కరీంనగర్ కాంగ్రెస్ అంటేనే గ్రూపు తగదాలకి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇప్పటికే నాలుగైదు గ్రూపులుగా విడిపోయిన కరీంనగర్ కాంగ్రెస్‌ని గాడిలో పెట్టాలంటే సమర్థుడైనా నాయకుడుకి డీసీసీ అధ్యక్ష పదవి కట్టవెట్టి విభేదాలకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తుంది పీసీసీ. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఎగరాలంటే జిల్లాలోని యువ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సమర్ధుడని భావిస్తున్నారంట కాంగ్రెస్ పెద్దలు.. ఆయనకి జిల్లా పార్టీ పగ్గాలు అప్పజెప్తే అందర్నీ ఏకతాటిపైకి తీసుకువస్తారని అధిష్టానం నమ్ముతుందంట.
కాంగ్రెస్ పార్టీలో కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి తీవ్రపొటీ నెలకొంది. డీసీసీ అధ్యక్షుడు ఎంపిక కోసం ఇప్పటికే ఎఐసీసీ పరిశీలకులు ఆరు రోజులపాటు నియోజకవర్గాలలో పర్యటించి అభిప్రాయ సేకరణ చేశారు. రేసులో ఉన్న వారి తుది జాబితాని కూడా కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానానికి అందజేశారు. త్వరలోనే డీసీసీ అధ్యక్షుడ్ని ప్రకటించే అవకాశం ఉండడంతో రేసులో దాదాపుగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేరు ఖరారు అయ్యినట్లు ప్రచారం జరుగుతుంది.
కాంగ్రెస్ పార్టీ గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి డీసీసీ అభ్యర్థులని ప్రకటించే విషయంలో అభిప్రాయ సేకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. దాని కోసం ఇప్పటికీ జిల్లాలోని నియోజకవర్గాలలో ఏఐసీసీ పరిశీలకులు పర్యటించారు. అయితే కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోసం చాలమంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేరు డీసీసీ రేసులో ముందంజలో ఉందంట.
మేడిపల్లి సత్యం ప్రస్తుతం చొప్పదండి ఎమ్మెల్యే గా ఉండడం, యువకుడు, ఉస్మానియా ఉద్యమ నాయకుడుగా గుర్తింపు ఉండడంతో పాటు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరుడు కావడం ఆయనకి కలిసివచ్చే అంశాలుగా కరీంనగర్ జిల్లాలో ప్రచారం జరుగుతోంది. అభిప్రాయ సేకరణ లో కూడ చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేరునే సూచించారు అని తెలుస్తోంది.
గ్రూపు తగాదాలకి చెక్ పెట్టి జిల్లా కాంగ్రెస్ ని గాడిలో పెట్టే నాయకుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమేనని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరారు మేడిపల్లి సత్యం. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో విద్యార్థి జేఏసికి నాయకత్వం వహించి రాష్ట్రం అంతా పాదయాత్ర చేశారు. రెండు సార్లు చొప్పదండి నియోజకవర్గం నుండి ఓడిపోయినా కూడా నిత్యం ప్రజాక్షేత్రం ఉంటూ ప్రజాసమస్యలపై కోట్లాడారు.
ఎమ్మెల్యే గా గెలిచిన తరువాత కూడా నిత్యం ప్రజలతో మమేకమై అభివృద్ధి విషయంలో చొప్పదండి నియోజకవర్గాన్ని సత్యం ముందంజలో ఉంచుతున్నారు. ఇప్పుడు ఇవే సత్యం కి డిసిసి అధ్యక్షుడు పదవి చేబట్టడానికి సానుకూల, అనుకూల అంశాలుగా మారాయంట. కలహాలు, డిష్యూం..డిష్యూం ఫైట్లకి కేరాఫ్ గా ఉన్న కరీంనగర్ కాంగ్రెస్ ని గాడిలో పెట్టాలంటే యువనాయకత్వం, నాయకత్వ పటిమ ఉన్న మేడిపల్లి సత్యం డిసిసి పగ్గాలు ఇస్తే సమర్ధంగా బాధ్యతలు నిర్వర్తిస్తారని అధిష్టానం భావిస్తోందంట.
రేసులో చాలామంది పోటీదారులు ఉన్నాగాని గ్రూప్ తగదాలకి చెక్ పెట్టి రానున్న రోజులలో కరీంనగర్ కార్పొరేషన్, జిల్లాలోని మున్సిపాలిటీ లు, స్థానిక సంస్థల ఎన్నికలలో మెజారిటీ స్థానాలు గెలవాలంటే మేడిపల్లి సత్యమే సరైన క్యాండెట్ అని కాంగ్రెస్ పెద్దలు ఫిక్స్ అయ్యారంట. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ గెలిచి మూడు దశాబ్దాలు అవుతోంది. అలాగే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌పై కాంగ్రెస్ జెండా ఎగిరి రెండు దశాబ్దాలు గడిచిపోతోంది. ఈ నేపధ్యంలో కరీంనగర్లో కాంగ్రెస్‌కు పుర్వ వైభవం మేడిపల్లి సత్యంతోనే సాధ్యమని భావిస్తున్నారంట. ఆ క్రమంలో నిత్యం ప్రజలు, కాంగ్రెస్ క్యాడర్ తో మమేకం అయి ముందుండి నడిపించే నాయకుడు మేడిపల్లి సత్యం పేరునే డీసీసీ అధ్యక్ష పదవికి ఫైనల్ చేసినట్లు గా కరీంనగర్ కాంగ్రెస్లో గట్టి ప్రచారం జరుగుతోంది.
Story by Apparao, Big Tv