JC Brothers: అనంతపురం జిల్లా రాజకీయ ఉద్దండులు జేసీ బ్రదర్స్ .. అన్నదమ్ములు ఇద్దరు ఇద్దరే…ఎవరేం తక్కువ కాదు… నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు… నచ్చకపోతే ఎవరినైనా తిడతారు… మరి ముఖ్యంగా అధికారులను, పోలీసులను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు . అన్న జేసీ దివాకరరెడ్డి వయోభారంతో సైలెంట్ అయినా.. తమ్ముడు జేసీ ప్రభాకరరెడ్డి మాత్రం మరింత దూకుడు ప్రదర్శిస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు.
జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ ఇద్దరు అన్నదమ్ముల గురించి ఎంత చెప్పినా తక్కువే. రాష్ట్రంలోని విలక్షణ రాజకీయ నాయకుల్లో వీరిద్దరిది సపరేట్ ఫ్యాన్ బేస్. అధికారంలో ఉన్నా , ప్రతిపక్షంలో ఉన్న వెనక్కి తగ్గరు. ఎవరైనా ఎన్నికల్లో ఓడిపోతే సైలెంట్ గా ఉంటారు. కానీ వీరు మాత్రం 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా తమదైన దూకుడు ప్రదర్శించారు. అప్పట్లో పోలీసులే టార్గెట్గా తీవ్ర వ్యాఖ్యలే చేశారు దివాకరరెడ్డి. పోలీసులు వైసీపీ నేతలకు వంగి వంగి దండాలు పెడుతున్నారన్న ఆయన.. తాము అధికారంలోకి వచ్చాక, చెప్పినట్లు వినే పోలీసులను తెచ్చుకుంటామని వివాదాస్పద స్టేట్‌మెంట్లు ఇచ్చారు.
పోలీసులపై వివాదస్పద, పరుష పదజాలం వాడి జేసీ దివాకరరెడ్డి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు తమ్ముడు ప్రభాకర్రెడ్డి కూడా అన్న బాటలోనే వెళ్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై నోరు పారేసుకున్నారు ప్రభాకరడ్డి. అందునా పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజున చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. నా దగ్గరా గన్ ఉంది, దానికీ లైసెన్సు ఉంది.. మీ ఇంట్లోకి దూరతానంటూ తీవ్ర అభ్యంతరకరంగా మాట్లాడారాయన. అసలు నువ్వు పోలీసు ఉద్యోగానికి పనికిరావు, నీకు ఎవరు ఉద్యోగం ఇచ్చారంటూ ఏఎస్పీని ఉద్దేశించి ఇష్టానుసారం నోరు పారేసుకోవడంపై మండి పడుతున్నాయి పోలీస్ సంఘాలు.
పోలీస్ అరవీరుల దినోత్సవం రోజున నాలుగు మంచి మాటలు చెప్పకుండా పోలీసులను ఈ విధంగా తిట్టడం ఏమాత్రం బాగాలేదని జిల్లా ఎస్పీ, అనంతపురం రేంజ్ డీఐజీ జేసీ ప్రభాకరరెడ్డి తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ మరో అడుగు ముందుకేసి దీనిపై చట్టపరంగా కేసు పెట్టే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని, అదేవిధంగా జేసీ ప్రభాకరరెడ్డి గన్ లైసెన్స్ రద్దుకు కూడా సిఫార్సు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీని కలిసేందుకు ప్రభాకర్ రెడ్డి రాగా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.
కానీ తాడిపత్రి ఎస్పీపై జేసీ ప్రభాకర్ రెడ్డి వర్షన్ వేరేలా ఉంది. ఎస్పీ గురించి బయట వ్యక్తులకు ఏం తెలుస్తుందని, తాను వైసీపీ హాయంలో డీఎస్పీ చైతన్య లాంటి వ్యక్తులతోనే పోరాడానని గుర్తు చేస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి అన్న అయిన దివాకర్ రెడ్డి 2019 తర్వాత పోలీసులపై ఇంతకంటే తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కానీ అప్పట్లో టీడీపీ ప్రతిపక్షంలో ఉండడంతో JC దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పటికీ తమ్ముడు ప్రభాకరరెడ్డి ఇదే విధమైన వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి… ఈ వ్యాఖ్యలు చూసి ఇద్దరు అన్నదమ్ములు ఎవరు తగ్గడం లేదని జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
Story by Apparao, Big Tv