Jubilee Hills: రోజురోజుకు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మద్దతు తగ్గుతుందా? మారుతున్న పరిణామాలు చూస్తుంటే ఔననే సమాధానం వస్తోందంటున్నారు. వివిధ సామాజిక వర్గాలు సంఘాలు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటిస్తుండటంతో గులాబీపార్టీ గ్రాఫ్ పడిపోతోందంట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయంటూ రోడ్ షోల్లో ప్రచారం చేసుకుంటున్నా .. గ్రౌండ్ లెవల్ క్యాడర్లో మాత్రం ఆ స్థైర్యం కనపడటం లేదంట.. ఇంతకీ జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరివైపు ఉన్నట్లు?
వాడివేడిగా కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారాల్లో భాగంగా కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజల మద్దతును పొందేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తోంది. ఇప్పటికే క్రిస్టియన్, మైనారిటీ పెద్దలు కాంగ్రెస్ కు ఏకగ్రీవంగా పూర్తి మద్దతు తెలిపారు.. తాజాగా కమ్మ, కాపు, గౌడ సంఘాల ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు తమ పూర్తి మద్దతును తెలిపారు..
2023 ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం అప్పటి బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి గోపినాథ్‌కు మూడో సారి పూర్తిగా సపోర్ట్ చేసింది.. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఉపఎన్నికల్లో మాత్రం కమ్మసంఘాలు తమ మద్దతును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ప్రకటించాయి. నిజానికి గత ఎన్నికల్లో కమ్మసంఘం మద్దతుతోనే గోపీనాథ్ విజయం సాధించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కమ్మ సామాజిక వర్గమంతా కాంగ్రెస్ అభ్యర్థి వైపే ఉండటంతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు పై సందిగ్దత నెలకొందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది..
మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవీ, కొడుకు ప్రద్యుమ్నతారక్ ల ఎంట్రీ బీఆర్ఎస్‌కు గుదిబండలా మారింది.. స్వయంగా మాగంటి తల్లి మహానందకుమారి కేటీఆర్‌పై చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.. తన కొడుకును చివరిసారిగా చూడటానికి కూడా కేటీఆర్ తనకు వీలు కల్పించలేదని, తన కోడలే తనపైకి రౌడీలను పంపించిందని మహానందకుమారి ఆరోపిస్తున్నారు..
మరోపక్క తన తండ్రి మృతిచెందినప్పుడు కనీసం తమకు చివరి చూపు కూడా దక్కనివ్వలేదని గోపీనాథ్ మొదటి భార్య కొడుకు ప్రద్యుమ్న తారక్ ఓ మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. తన తండ్రికి అత్యంత సన్నిహితంగా ఉండే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మోహన్ ముల్లపూడిలు ఫోన్ చేసి మరీ అంత్యక్రియలు రావొద్దని హెచ్చరించారని… హైదరాబాద్ కు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని చెప్పుకొచ్చాడు..
కుటుంబ కలహాల్లో తాము జోక్యం చేసుకోమంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా రోడ్ షోలలో, ప్రచారాల్లో మాట్లాడుతున్నారు.. కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ తన కొడుకు మృతి మిస్టరీగా మారింది అన్న గోపినాథ్ తల్లి మహానందకుమారికి సమాధానం చెప్పాల్సింది కేటీఆరే అని సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొంటున్నారు. గోపీనాథ్ కుటుంబసభ్యులు కంప్లైంట్ చేస్తే విచారణ జరిపించి అసలు ఏం జరిగిందో, ఎలా జరిగిందో పోలీసులే బయట పెడ్తారని వ్యాఖ్యానించారు.
ఓవైపు కుటుంబంలో కలహాలు, మరోవైపు తగ్గుతున్న ప్రజాదరణ.. ఎటుచూసినా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే దాఖలాలు కనిపించట్లేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంటే బీఆర్ఎస్ ముఖ్యనేతలు మాత్రం తమ అభ్యర్థే అత్యధిక మెజార్టిటీతో జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని కైసవం చేసుకుంటారని ప్రకటిస్తుండటం హాట్‌టాపిక్‌గా మారింది. కేటీఆర్ పెయిడ్ సర్వేలతో ఓటర్లను తప్పతోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Story by Apparao, Big Tv