Proddatur: ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజకీయం మొత్తం ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్, మట్కా, జూదం చుట్టు తిరుగుతోంది. జూదాన్ని అధికార పార్టీ ఎమ్మెల్యే పెంచి పోషిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపిస్తుంటే అసాంఘిక కార్యకలాపాలకు ఆద్యులు మీరే అంటూ అధికార పార్టీ అటాక్ చేస్తోంది. కడప జిల్లాలోనే ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉన్న ఆ నియోజకవర్గం కేంద్రంలో అసాంఘిక రాజకీయం ఏంటి? ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఆరోపణలపై పోలీసులు ఏమంటున్నారు?
ప్రొద్దుటూరు కడప జిల్లా రాజకీయాల్లో కీలక నియోజకవర్గం.. రాజకీయంగా ఎంత ప్రాధాన్యత ఉంటుందో వాణిజ్య పరంగా జిల్లాలో అంతే ప్రాధాన్యత ఉంటుంది.. అందుకే సెకండ్ ముంబాయి ఆఫ్ ఇండియాగా పేరు గడించింది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా బంగారం, వస్త్ర వ్యాపారంలో ముందుంటుంది. ఆ క్రమంలో రాజకీయంగా కూడా ప్రొద్దుటూరు ఎప్పుడూ హాట్ హాట్‌గా ఉంటుంది. ఇప్పుడు అంతే స్థాయిలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందనే ప్రచారం జోరుగా సాగుతోంది..
ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా ఎవరు ఉన్నా అదే ఆరోపణలు ఎదుర్కోవల్సిందే. ఆ ఆరోపణలే గత ఎన్నికల్లో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కొంప ముంచాయి అనే టాక్ నడిచింది. గత ఎన్నికల సమయంలో మట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ లకు రాచమల్లు నడిపించారనే ప్రచారం టిడిపి అస్త్రంగా వాడుకొని గెలిచిన తర్వాత అదే ఆరోపణలు ఎదుర్కొంటోంది.. జిల్లాలో ఎక్కడ లేని విదంగా ప్రొద్దుటూరు లోనే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఎందుకు కొనసాగుతున్నాయో పోలీసులకు అంతు చిక్కడం లేదంట.
పోలీస్ అధికారులు సైతం ఒక్కోసారి ఆ ఆరోపణల ఊబిలో చిక్కుతున్నారనే ప్రచారం ఉంది. దీనింతటికి కారణం జిల్లాలో ప్రొద్దుటూరు మేజర్ కమర్షియల్ బిజినెస్ సెంటర్ కావడం అనే అభిప్రాయం ప్రజల్లో ఎక్కువగా ఉందట. అదే నేటి రాజకీయ నేతలకు ఒక వైపు వరం మరోవైపు శాపంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ప్రొద్దుటూరులో గత దశాబ్ద కాలంగా టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. వరదరాజుల రెడ్డి అనుచరుడిగా రాజకీయంగా ఎదిగిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి వరదరాజుల రెడ్డి మీద గెలిచి అసెంబ్లీ లో రెండుసార్లు అడుగు పెట్టారు. అదే ఇప్పుడు గురు శిష్యుల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేంత రాజకీయ విరోధానికి దారితీసిందట..
గత ఎన్నికల్లో రాచమల్లుపై చేసిన గాంబ్లింగ్ ఆరోపణలు నేడు సిట్టింగ్ ఎమ్మెల్యే వరద ఎదుర్కొంటున్నారట.. ప్రొద్దుటూరు కేంద్రంగా ఎమ్మెల్యే క్రికెట్ బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్తో పాటు కొత్తగా క్యాసినో నియోజకవర్గ ప్రజలకు అలవాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారని రాచమల్లు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వీటితో పాటు జపాన్, తైవాన్ దేశాలలో వాడే బెట్టింగ్ యాప్ లను తమ అనుచరులతో ఉపయోగించి అందుకు అమాయకులైన యువకుల బ్యాంక్ అకౌంట్స్ వాడుతున్నారనే ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది.
ఆ ఆరోపణలు వచ్చిన గంటల వ్యవదిలో పోలీసులు ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని ఆరుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో రాచమల్లు ఆరోపణలకు బలం చేకూరిందే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ, అవినీత ఆరోపణలు జరుగుతూనే ఉంటాయి. అయితే ప్రొద్దుటూరు లో మాత్రం అసాంఘిక కార్యకలాపాల ఆరోపణల చుట్టే రాజకీయం నడుస్తుండటం గమనార్హం.
ఎమ్మెల్యే వరదరాజులు, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు మద్య రాజకీయ విభేదాలకు ఆధిపత్య పోరే కారణమని రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు. తన దగ్గర రాజకీయ ఓనామాలు నేర్చుకున్న రాచమల్లు నేడు తన కుటుంబానికి బద్ద శత్రువుగా మారడాన్ని వరదరాజులరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకే గత ఎన్నికల్లో జగన్ ప్రభుత్వ వైఫల్యాల కంటే రామమల్లు టార్గెట్ గా ఆరోపణలు సందించారు వరదరాజుల రెడ్డి. గత ఐదేళ్లలో అధికారం అడ్డం పెట్టుకొని రాచమల్లు, ఆయన బామ్మర్ది బంగారు రెడ్డి చేయని అవినీతి లేదని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సక్సెస్ అయ్యారు వరదరాజుల రెడ్డి.
అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఎమ్మెల్యే టార్గెట్ గా రాచమల్లు ఆరోపణలు సందిస్తున్నారు. ప్రొద్దుటూరులో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను పక్కన పెట్టి ఎమ్మెల్యే టార్గెట్ గా అసాంఘిక కార్యకలాపాలు, క్యాసినో అంటూ రాచమల్లు చేస్తున్న ఆరోపణలు జిల్లాలో కొత్త రాజకీయ వివాదానికి తెర లేపిందనే చర్చ నడుస్తోంది. మరి ఇద్దరి రాజకీయ వైరం ఎంతవరకు దారి తీస్తుందో చూడాలి .
Story by Apparao, Big Tv