Nalgonda leaders: జూబ్లీహిల్స్ బైపోల్ పోరు నల్లగొండ నేతల మధ్య ఆధిపత్యపోరులా మారింది. ఎన్నికల ప్రచారంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు చురుగ్గా పాల్గొంటుంటే.. అందుకు ధీటుగా బీఆర్ఎస్ మాజీలు కూడా కన్వాసింగ్‌లో యాక్టివ్ అయ్యారు. నల్గొండ జిల్లాలో జరిగిన ఉపఎన్నికల్లో పనిచేసిన అనుభవంతో ఎవరికి వారు జూబ్లీహిల్స్ ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు. కాంగ్రెస్ నుంచి స్టార్ క్యాంపైనర్లుగా మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ శ్రావణ్ తమదైన ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తుండటం ఆసక్తి రేపుతోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని బీఆర్ఎస్, గెలిచి ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని అధికార కాంగ్రెస్ పోటాపోటీగా తలపడుతున్నాయి. ఆ క్రమంలో ప్రచార పర్వం ముగియనున్న నేపధ్యంలో ఎవరికి వారు స్పీడ్ పెంచారు. అందులో భాగంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నేతలు సందడి చేస్తున్నారు. ప్రచార పోరులో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల నడుమ పొలిటికల్ ఫైట్ జరుగుతోంది.
నల్లగొండ జిల్లాలో గతంలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో ఇరు వర్గాలు తలపడ్డాయి. మూడు ఉప ఎన్నికల్లో పని చేసిన అనుభవంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు జూబ్లీహిల్స్‌లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో మిగతా జిల్లాల నేతల కంటే ఎక్కువగా నల్లగొండ జిల్లా నాయకులే హాల్ చల్ చేస్తున్నారట. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి స్టార్ క్యాంపైనర్లుగా జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలను పార్టీ హైకమాండ్ రంగంలోకి దింపింది. బూత్ ఇన్చార్జిలుగా పలువురు ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించింది. బీఆర్ఎస్ స్టార్ క్యాంపైనర్ల లిస్ట్ లో మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఉండగా, బూత్ ఇన్చార్జిలుగా మాజీ ఎమ్మెల్యేలకు ప్రచార బాధ్యతలు అప్పగించారు.
నల్లగొండ జిల్లాలో గతంలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో హుజూర్ నగర్, నాగార్జునసాగర్, మునుగోడుల్లో అధికార బలంతో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ వేదికగా నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం దక్కిందట. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో జానారెడ్డి, పద్మావతి, పాల్వాయి స్రవంతిని ఓడించడంలో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రి జగదీష్ రెడ్డి అధికార బలంతో కీలకంగా వ్యవహరించారు. మళ్లీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇదే టీమ్ రంగంలోకి దిగింది. ఉపఎన్నికల్లో ఆరితేరిన బీఆర్ఎస్ మాజీలకు, అధికారంలోకి వచ్చాక బైపోల్ ఎదుర్కుంటున్న జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య హోరాహోరీ పోటీ జరుగుతోందట.
తెలంగాణ లో ఏ జిల్లా నేతలు కూడా జూబ్లీహిల్స్‌లో ఇంతగా ప్రచారంలో కనపడటం లేదంటున్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికలు నలగొండ జిల్లాలో జరుగుతున్నాయా అనే విధంగా జిల్లా నేతల హడావుడి కొనసాగుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జిల్లా కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో బోరబండ లో మకాం వేయగా ఇటు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలతో పాటు గుత్తా అమిత్ రెడ్డి, సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా యూసుఫ్ గూడా నుంచి చక్రం తిప్పుతున్నారు. మరి బీఆర్ఎస్‌కు నల్గొండ నేతలు ఏ మాత్రం ఝలక్ ఇస్తారో చూడాలి.
Story by Apparao, Big Tv