Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టీడీపీ, జనసేన మద్దతు బీజేపీకి కలిసొస్తుందా? ప్రచారం గడువు మరి కొద్ది గంటలే ఉన్న నేపధ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తారా..? ప్రత్యక్షంగా ప్రచారానికి రాకపోయినా ఎన్డీఏ కూటమి భాగస్వాములుగా కాషాయ పార్టీకి మద్దతు ప్రకటిస్తారా? జూబ్లీహిల్స్ ఉపఎన్నికను హిందూ, ముస్లిం పోరుగా చిత్రీకరించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తున్న నేపధ్యంలో మిత్రపక్షాలు ఈ ఎన్నికల్లో సైలెంట్ అవుతాయా? ఇంతకూ ఈ బైపోల్స్‌లో సెటిలర్స్ ఎటువైపు నిలుస్తారు?
జూబ్లీహిల్స్ ఎన్నిక అన్ని పార్టీలలో హీట్ పెంచుతోంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ప్రజలను ఆకట్టుకునే పనిలో నేతలంతా బిజీ బిజీగా గడుపుతున్నారు. జూబ్లీహిల్స్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరడం ఖాయమని కారు పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో 30 వేల మెజారిటీతో విజయం సాధించబోతున్నాం అంటుంది కాంగ్రెస్ పార్టీ, ఇక మేమైన తక్కువా.. మోడీ 3.O కార్డ్, కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలు తమని గెలిపిస్తాయనే అంచనాల్లో కాషాయ పార్టీ ఉంది.
ఎవరి పంచులు వారివి ఎవరి లెక్కలు వారివి, కాని జూబ్లీహిల్స్ ప్రజల తీర్పు ఎట్లా ఉండబోతుంది అన్నది సస్పెన్స్ గా కొనసాగుతోంది. కాంగ్రెస్ అధికార బలగమంతా జూబ్లీహిల్స్‌లోనే మకాం వేసి ఒక్కొక్క ఓటును ఒడిసి పట్టుకునే పనిలో ఉంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ పోరు కాంగ్రెస్, వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు తయారైందంటున్నారు. జూబ్లీహిల్స్ లో 7 డివిజన్లకు గాను, ఒక్కొక్క డివిజన్ కు ఇద్దరేసి మంత్రులను ఇంచార్జులుగా నియమించి, ఓటర్లను తమ వైపుకు మలుపుకొని విజయం సాధించాలనే దిశగా హస్తం పార్టీ పాచికలు కదుపుతోంది.
ఇక గత ఎన్నికలో థర్డ్ ప్లేస్‌తో సరిపెట్టుకున్న బీజేపీ సైతం గట్టిగానే ప్రచారం చేసుకొస్తోంది. తాజాగా ప్రచారానికి ఎండ్ కార్డ్ పడుతున్న సమయంలో ఎన్డీఏ కూటమిలో భాగమైన తెలుగుదేశం, జనసేనా పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి మద్దతుప్రకటించాయి. దీంతో విజయం మరింత సులువయ్యిందనే అంచనాల్లో బీజేపీ ఉంది. ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మద్దతు జూబ్లీహిల్స్ లో మంచి ఫలితాలను తెచ్చిపెడుతుందని పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.
అందులో భాగంగానే పార్టీ శ్రేణుల్లోమరింత జోష్ పెంచేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.
తెలంగానలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించింది. రెండు పార్టీలు లోకల్ గా చెప్పుకోవడానికి వారు చేసిన పనులు ఉపయోగపడతాయి. కానీ ఇక్కడ బీజేపీకి మోడి కార్డ్ తప్ప చెప్పుకోవడానికి లోకల్ గా ప్రజలను ప్రభావితం చేసే అంశాలు ఏం లేవు అన్న చర్చ జరుగుతున్న నేఫధ్యంలో బీజేపీ ఎంఐఎం ను టార్గెట్ చేస్తోంది. హిందువులంతా ఏకం కావాలని పిలుపునిస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నిక హిందూ, ముస్లిం మధ్య జరిగే ఎన్నికలా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తుందనే టాక్ నడుస్తోంది. ప్రచార గడువు దగ్గర పడుతున్న కొద్ది ఆ పార్టీ నేతల ప్రసంగాలు ఆదిశగానే కొనసాగుతున్నాయి.
ఇక ఇదే జోష్ ను మరింతగా పెంచాలని కమలం పార్టీ స్కెచ్ వేస్తోంది. హిందువులంతా ఏకం కావాలని ఒకవైపు ఇంటింటి ప్రచారం చేస్తూనే, మరోవైపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల ఛరిష్మాలను ఉపయోగించుకోవాలని చూస్తోంది. ప్రచారానికి మరికొద్ది గంటలే ఉన్న నేపద్యంలో చివరి రోజున పవన్ కళ్యాణ్ ను జూబ్లీహిల్స్ ప్రచారానికి తీసుకురావాలనే యోచనలో పార్టీ వర్గాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ మద్దతుతో జూబ్లీహిల్స్ లో ఉన్న సెటిలర్స్ నుంచి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మద్దతుతో సినిమా ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్స్ నుంచి కూడా బీజేపీకి కలిసొస్తుందనే అంచనాల్లో పార్టీ వర్గాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
అంతేకాదు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కుటుంబంపై రౌడీ షీటర్ అనే ముద్ర ఉండటంతో పాటు, గత పదేళ్ల బీఆర్ఎస్ అవినీతి పాలన, రెండేళ్ల కాంగ్రెస్ వైఫల్యాల పాలన వంటి అంశాలు కమలం పార్టీకి పూర్తి మెజారిటీ జూబ్లీహిల్స్‌లో తెచ్చిపెడుతుందనే కాన్ఫిడెన్స్ లో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇకడి వరకు బాగానే ఉన్నప్పటి టీడీపీ, జనసేన పొత్తుల అంశంలో నేతల మధ్య భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. టీడీపీతో పొత్తు ఉంటుందని ఒకరు, లేదని మరొకరు, పవన్ కళ్యాణ్ ప్రచారానికి వస్తున్నారని ఒకరు, రావడం లేదని మరొకరు ఇట్లా ఎవరికి వారు స్పష్టత లేని ప్రకటనలిస్తున్నారు. అంతేకాదు సొంత పార్టీలో ఎవరు ఎక్కడ ప్రచారం చేయాలో, ఎవరేం మాట్లాడాలో తెలియని సమన్వయ లోపంతో కాషాయ నేతలు కనిపిస్తున్నారు .
మొత్తమ్మీద సీఎం చంద్రబాబు ప్రచారానికి వస్తారా లేదా అన్నది అటుంచితే, పవన్ కళ్యాణ్ దురుసు తనంతో కూడిన వాఖ్యల వల్లే గతంలో తెలంగాణలో బీజేపీ నష్టపోయింది అన్న భావనలో ఉన్న కాషాయ పార్టీ పవన్ కళ్యాణ్ ను జూబ్లీహిల్స్ ప్రచారానికి తీసుకొస్తారా..? ఒకవేళ పవర్ స్టార్ వచ్చినా, ఆయన పంచ్ లకు ఒక్క రోజులో జూబ్లీహిల్స్ సీన్ మారిపోతుందా..? అన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. ఇక మరోవైపు ఉన్నపలంగా కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంతో, జూబ్లీహిల్స్ ఎన్నికను హిందూ, ముస్లిం ఎన్నికగా అభివర్ణిస్తూ బీజేపీ ప్రచారం ఎత్తుకుంది. సో ఈ అంశాలన్నీ జూబ్లీహిల్స్‌లో బీజేపీకి ఎలాంటి ఫలితాలను తెచ్చిపెడతాయన్నది చూడాలి.
Story by Apparao, Big Tv