సీఎం ఇలాఖా కొడంగల్ లో కవిత భారీ బహిరంగ సభ సక్సెస్ అయ్యింది. గ్రాండ్ ఎంట్రీగా వెళ్లి.. కేసీఆర్‌ను తలపించేలా సభలో ఆమె చేసిన ప్రసంగం ఆకట్టుకున్నది. మధ్య మధ్యలో పద్యాలు అలవోకగా గుర్తు చేస్తూ తప్పించుకు తిరుగువాడు రేవంత్ సుమతీ..!అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అసెంబ్లీలో రెండు పార్టీల డ్రామాలపై గద్దర్ పాడిన ..భలేగుందిరో అసెంబ్లీ..! ఇటోడు అటు కుసుండు.. అటోడు ఇటు కుసుండు..వీని మాట వాని నోట.. వాని మాట వీని నోట.. ఓట్లేసిన ప్రజలకేమో నోట్లెమట్టి కొడుతుండ్రు.. ! భలేగుందిరో అసెంబ్లీ..! అని ఆమె రాగయుక్తంగా పాడి వినిపించడంతో సభ కేరింతలు, విజిల్స్‌తో మార్మోగిపోయింది.
తను ఏ పార్టీ వదిలిన బాణాన్ని కాదని, బహుజనుల కోసం ఎక్కుపెట్టిన బాణాన్నని ఈ వేదికగా క్లారిటీ ఇచ్చారామె. పితృస్వామ్య వ్యవస్థకు చరమ గీతం పాడి, తెలంగాణలో మాతృస్వామ్య వ్యవస్థను తెద్దామా? అని ప్రజలను అడిగిన ఆమె.. లేడీ సీఎం దేశంలో ఒక్కరు తప్ప ఎవరూ కాలేకపోయారని, ఇక్కడ చరిత్రను తిరగరాద్దామన్నారు. పరోక్షంగా తనకు అధికారాన్ని ఇచ్చి..సీఎంను చేయాలని ఆమె ప్రజలను కోరారు.
బీసీల్లో ఉన్న నిమ్నకులాలను పట్టించుకున్న పార్టీలు లేవని, వారిని చట్టసభల్లోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా పనిచేస్తానన్న ఆమె.. ఎస్సీ, ఎస్టీ,మైనార్టీల సంక్షేమానికి, రాజ్యాధికారంలో వారి వాటా విషయంలో కట్టుబడి ఉంటానన్నారు. కొత్త పార్టీ ఎందుకు అని కొందరు అంటున్నారు? ఇప్పుడు ఏ పార్టీలతో జనానికి ఏం ఒరిగిందని కవిత ప్రశ్నించారు.
కేసీఆర్, రేవంత్, బీజేపీ అంతా ఒక్కతాను ముక్కలేనని, అందుకే తాను కొత్త పార్టీగా వచ్చానన్న ఆమె.. ఇది నా కోసం కాదు.. నా పార్టీ మీ కోసం.. కొత్త చరిత్ర లిఖిస్తాను.. నమ్మండి.. అధికారం ఇవ్వండి.. అని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పాంచజన్యం ఎలా అమలు చేస్తారని కొందరు వెకిలిగా అంటున్నారని, మేధావులందరితో చర్చించిన తరువాతే.. ఉచిత వైద్యం, విద్యకు సిద్దపడ్డానని, 2 లక్షల కోట్ల బడ్జెట్‌లో.. వీటికి ఒక లక్ష కోట్లు కేటాయిస్తాను..ఈ రెండు పరిపూర్ణంగా అందరికీ అందితే.. ఆ మిగిలిన సొమ్ముతో జనం ఇతర వ్యాపారాలు చేసుకోవచ్చని ఆమె అన్నారు.
పేదలు, మధ్యతరగతి వర్గాలు అత్యధికంగా ఖర్చు పెట్టేది విద్య, వైద్యానికేనని.. వీటిని తాను ప్రైవేటులో ఉచితంగా అందిస్తానన్నారు. యువతకు 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణాలిచ్చి వ్యాపారాలు చేసుకునేలా ఊతకర్రగా నిలుస్తానన్నారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్లైనా.. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ప్రభుత్వాలు తమ అసమర్థతను చాటుకున్నాయని, రైతులను పట్టించుకోలేదన్నారు.
జూరాల నుంచి 10లక్షల ఎకరాలకు తాను నీరందిస్తానని, అధికారం ఇవ్వండని కోరారు. రైతులు అధికారుల కాళ్లు పట్టుకునే దుస్థితి ఏర్పడిందన్నారు. రైతులు అసువులు బాస్తున్నారని, వీరే రేవంత్‌ను గద్దెదించుతారని కవిత ధ్వజమెత్తారు.
సీఎంగానే కాదు విద్యాశాఖ మంత్రిగా కూడా రేవంత్ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారామె. కాంగ్రెస్‌ను గద్దె దించి.. బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తానని శపథం తీసుకున్నారు కొండగల్ సాక్షిగా కవిత.