మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు రాసిన అగ్నిధార కవితా సంపుటిలోని విప్లవగీయం ఇక్కడ ప్రస్తావనార్హం అనిపించింది.
ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో..
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో
భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠాలెన్నో
కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో…
………..
దీన్ని ఇప్పటి పరిస్థితులకు ఇలా అన్వయించుకోవచ్చేమో..!
గ్లోబలైజేషన్‌లో భాగంగా చేతిలో సెల్‌ఫోన్ కంపల్సరీ అయిపోయి.. ఇంటర్నెట్ ఇంట్లో ఓ భాగమైపోయిన వేళ.. ఈ పరిణామాలు దుష్పరిణమాలకే దారి తీస్తున్నాయి. అక్రమ సంబంధాలు, హత్యలు పరిపాటిగా మారిపోయిన సంఘటనలకు ఇవే మూలకేంద్రాలుగా మారుతున్నాయి. మనిషి కోరికలకు, వారి బుద్దిని పక్కదారి పట్టేవిధంగా తీర్చిదిద్దే యంత్రాలుగా మారుతున్నాయి. దీన్ని మనం కంట్రోల్ చేయలేక దాని కంట్రోల్‌లోకి వెళ్లిపోయాం.
ఇదే వ్యాపకంతో రీల్స్ చేసి.. యూట్యూబర్‌గా మారి.. పైగా దీంట్లోనే పైకం సంపాదించాలనే ఆలోచన ఈ అగాథంలోకి మరీ నెట్టేసి అందులోనే సమిధలను చేసేస్తున్నాయి. అతిగారాభం. మధ్యలోనే చదువు ఆపేయడం, చిన్నతనంలోనే పెళ్లి చేయడం.. అంతకు ముందే ఆమె రీల్స్‌కు బానిసవ్వడం, ఇంటి సంసారమంతా యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో పెట్టడం… ఇవన్నీ ఆమె హత్యకు ప్రేరేపించుకున్న పరిస్థితులే.
వైష్ణవి.. అన్నదమ్ములు కూడా దీనికేం మినహాయింపు కాదు. అదే రీల్స్ మాయలో పడిపోయిన వాళ్లే. చివరకు వైష్ణవి తల్లితో సహా. ఆమెను హరిబాబు చంపడం.. ప్రతీకారేచ్చతో రగిలిపోవడం, బెయిల్‌పై వచ్చిన హరిబాబాను వెంటాడి , వేటాడి హతమార్చడం.. ఇదంతా ఓ ప్రతీకార హత్యగానే కనబడుతున్నది. కానీ ఇందులో మరో విషాదం కూడా దాగి ఉంది. చంపినోడు వీడియో తీసి తనకు సపోర్టు చేయమని అర్థిస్తున్నాడు. శిక్ష పడకుండా మీరే కాపాడాలని నెటిజన్లను కోరుతున్నాడు. తనకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలున్నారని వారికి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్పుకున్నాడు.
పోలీసులు,చట్టం గురించి కనీస అవగాహన లేని ఆ కుటుంబం.. ఇలా నెటిజన్లే లోకంగా, వారిచ్చిన ప్రోత్సహమే కొండంత బలంగా, మొత్తానికి ఓ ట్రాన్స్‌లో, వారిదైన ఓ లోకంలో బతికేశారు. ఇన్నాళ్లూ అలాగే బతుకుతున్నామనే భ్రమలో తమను తాము చంపేసుకున్నామని తెలుసుకోలేకపోయారు. తెలుసుకోవడానికి వీరికి ఇకెంతకాలం పడుతుందో…? కానీ ఇప్పటి వరకు జరిగిన నష్టం పూడ్చలేనిది. ప్రాణాలు తిరిగి రాలేనివి.
నిందితుడు హరిబాబును చంపిన సంతోష్ భార్య కూడా.. బేలగా, దీనంగా అర్థిస్తున్నది.. కాపాడండి అని. ఎవరిని? నెటిజన్లను. అంటే వారు అంతగా వీరి వెంట ఉన్నారన్నమాట. వారు పెట్టే కామెంట్లే వీరిని ఉసిగొల్పాయి. వీరికి తోడు యూట్యూబ్ చానెళ్ల యాంకర్లు.. తీసుకున్న ఇంటర్వ్యూలు…ఉత్ప్రేరకాలుగా పనిచేశాయి. చంపినప్పుడు వెంటపడి, చంపకపోతే వేటాడి, ప్రతీకారం తీర్చుకున్న తరువాత పైశాచికానందాన్ని అనుభవించి .. చివరకు ఆ కుటుంబాన్ని మొత్తం చిన్నాభిన్నం చేసి గానీ వదల్లేదు వీరంతా.
కులమతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందురో.. అని దాశరథి అన్నాడు. ఇప్పుడు ఈ సెల్‌ఫోన్లు, రీల్స్ పిచ్చిలో పడి వైష్ణవిలా బలైనవారెందరో.. బలికాబోయేదెందరో.. అని అనాల్సి ఉంటుందేమో..!