Botsa Anusha: బొత్స కుటుంబం నుంచి మరో నేత రాజకీయ రంగప్రవేశం చేశారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూషకు.. వైసీపీ కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు.. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా ఆమెను నియమించారు. ఇకపై.. భీమిలిలో పార్టీ కార్యక్రమాలను అనూష పర్యవేక్షిస్తారు. స్థానిక నాయకులను, కార్యకర్తలను ఏకతాటిపైకి తెచ్చి పార్టీని బలోపేతం చేయాలని అధిష్ఠానం ఆమెకు సూచించింది.
ఈ నియామకం వెనుక ఓ బలమైన కారణం ఉంది. భీమిలి వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను పార్టీని వీడి టీడీపీలో చేరారు. దీంతో ఏర్పడ్డ ఖాళీని.. జగన్ అనూష నియామకంతో పూరించారు. రాజకీయాల్లోకి రాకముందే.. అనూషకు సామాజిక కార్యక్రమాల ద్వారా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు తండ్రి బాటలోనే.. క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
బొత్స అనూష ముందున్న సవాల్ చిన్నది కాదు. భీమిలి సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2024 ఎన్నికల్లో 92 వేల భారీ మెజార్టీతో గెలిచారు. నియోజకవర్గంలో ఆయనకు బలమైన నెట్‌వర్క్ ఉంది. అలాంటి నేతను ఢీకొట్టాలంటే పార్టీకి పటిష్టమైన నాయకత్వం అవసరం. ఆ బాధ్యతను ఇప్పుడు అనూషకు అప్పగించారు.
తండ్రి బొత్స సత్యనారాయణ మద్దతు, ఉత్తరాంధ్రలో బొత్స కుటుంబ పలుకుబడి ఆమెకు కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పార్టీని నిలబెట్టడమే అసలైన పరీక్ష. బొత్స అనూష రాకతో భీమిలిలో వైసీపీకి కొత్త వ్యూహం మొదలైంది. కానీ గంటా శ్రీనివాసరావును ఢీకొట్టడం, చిన్న శ్రీనుని తట్టుకోవడం ఆమెకు అంత తేలికేమీ కాదు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఈ కొత్త ఈక్వేషన్ ఏ టర్న్ తీసుకుంటుందన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది.
Also read: మమతా బెనర్జీకి వరుస బిగ్ షాక్‌లు.. రాత్రికి రాత్రే అభ్యర్థి అరెస్ట్!