Khairatabad Bypoll: స్వేచ్చ బ్యూరో: ఖైరతాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా మళ్లీ హీటెక్కాయి. రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన దానం నాగేందర్‌కు అనుకోని చిక్కులు వచ్చిపడ్డాయి. పార్టీ ఫిరాయింపుల కింద ఎమ్మెల్యే పదవికి అనర్హత వేటు పడటంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఖాయం అయింది. అయితే మళ్లీ తాను హస్తం పార్టీ నుంచి రంగంలోకి దిగుతానని స్పష్టం చేస్తున్న దానం నాగేందర్‌కు స్థానిక నాయకులు, కేడర్ ఎంతవరకు సహకరిస్తారు? అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
గతంలో కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన దానం నాగేందర్, తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా.. స్థానిక కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఆయన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించలేకపోతున్నాయి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ జెండా మోసిన నాయకులను, కార్యకర్తలను దానం తీవ్రంగా వేధింపులకు గురిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. కేసుల నమోదు, ఆర్థికంగా దెబ్బతీయడం, కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని కొందరు స్థానిక ‘హస్తం’ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తమను ఇబ్బందులకు గురిచేసిన నేతకే.. ఇప్పుడు జై కొట్టాలా? అంటూ ఫైర్ అవుతున్నారు. టిక్కెట్ ఎంపికలో క్షేత్రస్థాయి కేడర్, నియోజకవర్గ ముఖ్య లీడర్ల అభిప్రాయాలు సేకరించాలని టీపీసీసీకి రిక్వెస్టులు వచ్చినట్లు తెలిసింది.
మరోవైపు బీఆర్ఎస్ నుంచి వచ్చినప్పుడు దానం నాగేందర్ వెంట ఆయన అనుచరులు కొందరు కాంగ్రెస్ కు వచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో గులాబీ కేడర్ మాత్రం ఆయనకు పూర్తిగా దూరంగానే ఉన్నది. ఇప్పుడు ఆ గులాబీ దళం దానం ఓటమికి కొరకు పనిచేయనున్నది. ఆయనకు వ్యతిరేకంగా పనిచేసి గులాబీకి ప్లస్ చేయాలని పావులు కదుపుతోంది.ఒక వైపు కాంగ్రెస్ పాత కేడర్ సహకరించక, మరోవైపు బీఆర్ ఎస్ పార్టీ కేడర్ గుర్రుగా ఉన్న నేపథ్యంలో దానం పోటీ చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనే దానిపై కూడా పార్టీ ఆరా తీస్తున్నది. పాత కాంగ్రెస్ నేతలు లోపల ఉంటూనే దానంను ఓడించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు కూడా పార్టీ అనుమానిస్తున్నది.
Also read: పాత ఐఫోన్ స్లో అయిందా? ఈ 5 సెట్టింగ్స్ మార్చితే కొత్తదానిలా దూసుకెళ్తుంది!
ప్రస్తుతం ఆయన సెల్ఫ్ ఇమేజ్ తోనే రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లోసీనియర్ రాజకీయ నేతగా, మంత్రిగా పనిచేసిన అనుభవంలో తనకంటూ ఓ కేడర్ ను, పరిచయాలను దానం ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు పూర్తిగా ఆ వ్యవస్థపైనే ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది. అయితే అది ఎంత వరకు సక్సెస్ ను ఇస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ గూటికి చేరడం, ఆపై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఫిరాయింపుల చట్టం కింద దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసింది. సుప్రీం కోర్టు సైతం దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు శాసనసభ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నేఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లు వచ్చాయి. వాటిలో సర్వం ఒడ్డి కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఖైరతాబాద్ మాత్రం కాస్త్ ఢిఫరెంట్ పరిస్థితులు ఉన్నట్లు పార్టీలోనూ చర్చ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి గట్టి పట్టు ఉన్న నియోజకవర్గంగా అధికార పార్టీ కూడా భావిస్తుంది. అంతేగాక దానం ఎపిసోడ్ పై అక్కడి ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారనే అనుమానం కూడా ఉన్నది. ఈ నేపథ్యంలోనే దానంతో పాటు మరి కొందరి పేర్ల అభ్యర్థిత్వాన్ని కూడా కాంగ్రెస్ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా రోహిన్ రెడ్డి, విజయారెడ్డి పేర్లపై అత్యధికంగా ప్రచారం జరుగుతుండగా, ఢిల్లీ స్థాయిలో కేకే ఫ్యామిలీ కూడా ట్రై చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం ఉన్నది. ఇక ఈ సీటులో వైఫల్యం చెందితే కాంగ్రెస్ పార్టీ మరింత డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉన్నది. దీంతోనే ఆచితూచీ నిర్ణయం తీసుకోవాలని పార్టీ భావిస్తుంది.