BigTV English

Wild Cows In Nandigama: లంక అడవుల్లో అడవి ఆవుల భయం

Wild Cows In Nandigama: లంక అడవుల్లో అడవి ఆవుల భయం

Wild Cows In Nandigama: మామూలుగా మనకు ఆవు కనిపిస్తే.. గోమాత అని మొక్కుతాం. ప్రేమగా నిమురుతాం. కానీ.. అక్కడ ఆవు కనిపిస్తే చాలు.. బెంబేలెత్తిపోతున్నారు. భయపడిపోతున్నారు. పరుగులు పెడుతున్నారు. ఎందుకంటే.. అది మామూలు ఆవు కాదు. అడవి ఆవు. జనాన్ని ఇంతలా భయపెడుతున్న అడవి ఆవులు ఎక్కడున్నాయి?


నందిగామ నియోజకవర్గంలో అడవి ఆవుల బెడద

అడవి పందుల గురించి తెలుసు! అడవి దున్నల గురించి తెలుసు! అడవి ఏనుగుల గురించి తెలుసు! కానీ.. అడవి ఆవుల గురించే చాలా మందికి తెలియదు. అసలు.. అలాంటి ఆవులు కూడా ఉంటాయని ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు. కానీ.. నిజంగానే అడవి ఆవులు ఉనికిలో ఉన్నాయి. ఎక్కడో కాదు.. మన ఏపీలోనే తిరిగేస్తున్నాయి. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో.. అడవి ఆవులు గుంపులు, గుంపులుగా సంచరిస్తున్నాయి. చందర్లపాడు మండలంలో కృష్ణానది తీర ప్రాంతాల్లో.. అడవి ఆవులు రాత్రి వేళల్లో గుంపులుగా పొలాల్లోకి వచ్చి పంటల్ని ధ్వంసం చేస్తున్నాయి. వాటిని అదుపు చేయాలని ఎప్పట్నుంచో రైతులు కోరుతున్నారు. దాంతో.. ఈ విషయాన్ని నందిగామ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. ఆమె చెప్పిన విషయం విని.. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా ఆశ్చర్యపోయారు. అడవి ఆవులు కూడా ఉంటాయా? అని ప్రశ్నించారు.


అసెంబ్లీలో ప్రస్తావనతో హాట్‌ టాపిక్‌గా అడవి ఆవులు

నందిగామ నియోజకవర్గ ప్రజలకు ఈ అడవి ఆవుల గురించి ముందే తెలిసినా.. చాలా మందికి అసెంబ్లీలో వాటి ప్రస్తావన వచ్చాకే తెలిసింది. అడవి ఆవులు కూడా ఉంటాయని.. అవి కూడా అడవి పందులు, ఏనుగుల్లాగే.. పంటలు నాశనం చేస్తాయనే విషయంపై కొంత క్లారిటీ వచ్చింది. ప్రభుత్వం కూడా అడవి ఆవులను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో.. జిల్లా కలెక్టర్ స్వయంగా డ్రోన్ కెమెరాల ద్వారా అడవి ఆవుల్ని పరిశీలించారు. అవన్నీ.. గుంపులు, గుంపులుగా సంచరిస్తున్న దృశ్యాలు డ్రోన్‌కు చిక్కాయి. ఎన్నో ఏళ్లుగా.. ఈ అడవి ఆవులు నందిగామలోని చందర్లపాడు మండలంలో రైతులు వేసిన పంటల్ని నాశనం చేస్తూ.. వేధిస్తున్నాయి.

రైతులు వేసిన పంటల్ని నాశనం చేస్తున్న అడవి ఆవులు

లక్షల్లో పెట్టుబడులు పెట్టి.. పంటలు సాగు చేస్తున్న రైతులకు ఈ అడవి ఆవులు కన్నీరు తెప్పిస్తున్నాయి. పంటలు వేశాక.. అవి దిగుబడి వచ్చేంత వరకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని లంక అటవీ భూముల్లో తిష్ట వేసిన ఈ అడవి ఆవులు.. పంట పొలాలపై మందలు, మందలుగా పడి.. పంటల్ని ధ్వంసం చేస్తున్నాయి. ముఖ్యంగా.. రైతులు ఎక్కువగా సాగు చేసే కూరగాయలు, ఆకు కూరలు, పెసర, మినుము, మొక్కజొన్న, పత్తి, మిరప లాంటి పంటల్ని తొక్కేస్తున్నాయి. నారు దశ నుంచి పంట చేతికి వచ్చే వరకు.. సాగులో ఉన్న పొలాల్ని కాపాడుకోవడం ఎంతో కష్టమవుతోంది. దాంతో.. అడవి ఆవుల నుంచి తలెత్తుతున్న సమస్యలకు పరిష్కారం చూపాలని ఎప్పట్నుంచో కోరుతున్నారు.

3, 4 ఏళ్లుగా రైతులను వేధిస్తున్న అడవి ఆవుల సమస్య

అసలే నష్టాల్లో ఉన్న తమకు.. అడవి ఆవుల సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. 40 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న తమకు.. అడవి పందులు, దున్నలు, కుక్కలు, ఏనుగుల గురించి విన్నామే తప్ప.. విచిత్రంగా ఈ అడవి ఆవులు తమను వేధిస్తున్నాయని వాపోతున్నారు. గత 3, 4 ఏళ్లుగా.. ఈ అడవి ఆవుల సమస్య.. తమనెంతో ఇబ్బంది పెడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అసెంబ్లీలో ప్రస్తావనతో హాట్‌ టాపిక్‌గా అడవి ఆవులు

నందిగామ నియోజకవర్గంలో నెలకొన్న ఈ అడవి ఆవుల బెడద గురించి.. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అసెంబ్లీలో ప్రస్తావించారు. అవి.. పంటల్ని ఎలా నాశనం చేస్తున్నాయో వివరించారు. ఎప్పుడైతే.. అసెంబ్లీలో ఈ ప్రస్తావన వచ్చిందో.. అప్పట్నుంచి ఏపీలో అడవి ఆవుల గురించి చర్చ మొదలైంది. త్వరలోనే.. ఈ సమస్యపై చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఇటీవలే.. డ్రోన్ కెమెరాల ద్వారా గాలించి.. అడవి ఆవులు ఎక్కడెక్కడ ఉన్నాయనే దానిపై సర్వే చేశారు. ఎంత మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి? ఈ ఆవుల్ని.. ఎక్కడికి, ఎలా తరలించాలి? అనే దానిపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు? అడవి ఆవుల్ని ఇక్కడి నుంచి తరలించడమా? అదికాకుండా.. ప్రత్యామ్నాయ మార్గాలేమైనా ఆలోచించాలా? అనేదానిపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని.. అధికారులు చెబుతున్నారు.

అసలు.. ఈ ప్రాంతంలో వీటి సంతతి ఎలా పెరిగింది?

మనకు తెలిసిన ఆవులకు.. ఈ కృష్ణా నది తీరప్రాంతంలో తిరిగే అడవి ఆవులకు ఉన్న తేడా ఏంటి? అసలు.. ఈ ప్రాంతంలో వీటి సంతతి ఎలా పెరిగింది? వీటిని.. లంక అడవుల్లో ఎవరు వదిలేశారు? ఇన్నేళ్లుగా.. వీటిని ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలేంటి.. అడవి ఆవుల వెనకున్న అసలైన స్టోరీ?

అడవి ఆవుల విధ్వం అంతా ఇంతా కాదు!

సాధారణ ఆవులు.. పంట పొలాల్లో పడటం, మేత మేయడం సహజమే. వాటి గురించి అయితే.. ఇంత చర్చ అవసరం లేదు. కానీ.. మామూలుగా కనిపిస్తున్న ఈ అడవి ఆవులు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. అందుకే.. ఇష్యూ లంక అడవుల్ని, నందిగామ నియోజకవర్గాన్ని దాటి.. ఏపీ అసెంబ్లీలో దాకా వెళ్లింది. రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సమస్య గురించి విన్నాక.. అందరిలోనూ కలిగిన డౌట్ ఒకటే. అసలు.. ఈ అడవి ఆవులేంటి? అని!

అడవి ఆవుల్ని లొంగదీసుకునే అవకాశం లేదా?

మామూలు ఆవులకు.. ఈ అడవి ఆవులకు తేడా ఏంటి? వీటిని రైతులు లొంగదీసుకోలేరా? సులువుగా పట్టుకొని.. పొలాల దగ్గర కట్టేసుకోలేరా? మిగతా ఆవుల మాదిరిగానే.. వీటిని సాదుకోలేరా? అసలు.. అడవి ఆవుల్ని లొంగదీసుకొనే అవకాశం ఎందుకు లేకుండా పోయింది? ఇలా.. చాలా మందిలో చాలా రకాల అనుమానాలున్నాయ్. అందుకు తగ్గట్లుగానే.. అడవి ఆవుల వ్యవహారం, దాని వెనక చరిత్ర కొంచెం పెద్దగానే ఉంది. ఈ అడవి ఆవుల ఈ మధ్యే అడవుల్లోకి వచ్చినవేమీ కాదు.

50 ఏళ్ల క్రితం లంక భూముల్లో ఆవుల్ని వదిలిన స్థానికులు

50 సంవత్సరాల క్రితం.. కృష్ణా నది అడవి లంక భూముల్లో.. స్థానికులు వదిలేసిన ఆవులే ఇవి. అప్పట్నుంచి.. ఇప్పటివరకు.. ఏళ్లు గడుస్తున్నకొద్దీ.. వాటి సంతతి పెరుగుతూ పోతోంది. మొదట్లో వందల్లో ఉండేవి. ఇప్పుడవి వేలల్లోకి పెరిగిపోయాయి. ఆవులు, ఎద్దులు, దూడలు.. అలా పెరుగుతూ.. పెరుగుతూ.. మందలు, మందలుగా అడవుల్లో సంచరిస్తున్నాయి. పైగా.. వీటిలోనూ గ్రూపులున్నాయట. వేటికవి.. వేర్వేరుగా సంచరిస్తుంటాయి. అలా.. లంక అడవుల్లో ఆవుల సంతతి వేలల్లోకి పెరిగిపోయింది.

లంక భూముల్లో అడవి ఆవులకు సరిపోని మేత

కృష్ణా తీర ప్రాంతంలోని అడవుల్లో.. ఈ అవుల సంతతి భారీగా పెరిగిపోవడంతో.. లంక భూముల్లో మేత సరిపోవట్లేదు. అందుకోసమే.. అడవి ఆవులన్నీ గుంపులుగా వచ్చి.. రైతుల సాగు చేస్తున్న పంట పొలాలపై పడుతున్నాయి. ఒక్కో గుంపులో.. 200, 300, ఆ పైచిలుకు ఆవులుంటాయి. మందలు, మందలుగా వచ్చి పంటలను నాశనం చేస్తుండటంతో.. రైతులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. వీటిని కంట్రోల్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే.. ఇవి పుట్టినప్పటి నుంచి వీటికి మనుషులతో సంబంధం లేదు.

అడవి ఆవుల సమస్యకు ఇప్పుడెలా పరిష్కారం చూపుతారు?

అందువల్ల.. రైతుల్ని చూడగానే బెదిరిపోతున్నాయి. తమపై దాడి చేయడానికి వచ్చారేమోననుకొని.. అవే ముందుగా ఎటాక్ చేసేస్తున్నాయని చెబుతున్నారు. ఒకట్రెండు ఆవుల్ని పట్టుకొచ్చి.. వాటిని సాదుకుందామనే ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయి. ఈ అడవి ఆవుల్ని మచ్చిక చేసుకోవడం కూడా కష్టమవుతోంది. వీటికి.. మనుషులతో అనుబంధం లేదు. ఎలా వ్యవహరించాలో తెలియదు. అందుకోసమే.. రైతుల్ని చూడగానే.. పొడిచేందుకు వచ్చేస్తున్నాయ్. దాంతో.. రైతులంతా వీటి జోలికి వెళ్లేందుకు బెంబేలెత్తిపోతున్నారు.

రాత్రి, పగలు అనే తేడా లేకుండా.. పంటల్ని కాపాడుకోవడానికే సరిపోతోంది

నందిగామ నియోజకవర్గం పరిధిలోని చందర్లపాడు మండలంలో ఈ అడవి ఆవుల బెడద ఎక్కువగా ఉంది. కృష్ణానది పరివాహక ప్రాంతాలైన విభరింతలపాడు, ఏటూరు, చింతలపాడు, తోటరావులపాడు, తురల్లపాడు, ముప్పాళ్ల, పోపురు, కొడవటికల్లు, పున్నవెల్లి, వెలది కొత్తపాలెం, ఉస్తేపల్లి, కాసారాబాద్ గ్రామాల్లో.. వీటి సమస్య తీవ్రంగా ఉంది. దాంతో.. రైతులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా.. పంటల్ని కాపాడుకోవడానికే సరిపోతోంది. అందువల్ల.. ఈ అడవి ఆవుల సమస్యకు ఇప్పుడెలా పరిష్కారం చూపుతారనేది ఆసక్తిగా మారింది. ఇటీవల జిల్లా అధికారులు చేసిన డ్రోన్ సర్వేలో.. వందలుగా, మందలుగా ఆవులు తిరుగుతున్నాయి. వాటి వ్యవహారం చూస్తే.. కనీసం వాటి దగ్గరికెళ్లి.. వాటి మెడలో తాడు కట్టి తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదనిపిస్తోంది. వాటి దగ్గరికి వెళితే.. అవెలా రియాక్ట్ అవుతాయో కూడా ఎవ్వరికీ తెలియదు. మరి.. ఈ సమస్యకు జిల్లా అధికారులు ఎలా చెక్ పెడతారు? రైతులకు ఏ విధమైన పరిష్కారం చూపుతారనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

Related News

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Nellore Politics: అనిల్ దెబ్బకు వేమిరెడ్డి వెనక్కి తగ్గాడా?

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

Big Stories

×