రివ్యూ : ప్రిడేటర్ – బాడ్‌ల్యాండ్స్ మూవీ
డైరెక్టర్ : డాన్ ట్రాచ్టెన్‌బర్గ్ (ప్రే ఫేమ్)
నటీనటులు : డిమిట్రియస్ షూస్టర్-కోలోమటాంగి (డెక్ – యంగ్ ప్రిడేటర్), ఎల్లే ఫాన్నింగ్ (థియా – ఆండ్రాయిడ్ డ్యూయల్ రోల్) తదితరులు
మ్యూజిక్ : సారా షాచ్నర్ – బెంజమిన్ వాల్‌ఫిష్,
సినిమాటోగ్రఫీ : జెఫ్ కట్టర్
నిర్మాతలు : జాన్ డేవిస్, డాన్ ట్రాచ్టెన్‌బర్గ్, మార్క్ టోబెరాఫ్, బెన్ రోసెన్‌బ్లాట్
Predator Badlands Review in Telugu : హాలీవుడ్‌లో ప్రశంసలు అందుకున్న యాక్షన్ సైన్స్-ఫిక్షన్ సిరీస్ “ప్రిడేటర్” తొమ్మిదవ భాగం “ప్రిడేటర్ బాడ్లాండ్స్” నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రంలో డిమిట్రియస్ షుస్టర్-కోలోమతంగి, ఎల్లే ఫానింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఇండియాలో హిందీ, తమిళం, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఈ మూవీ విడుదలైంది. మరి ఈ ప్రిడేటర్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం పదండి.
కథ
యౌట్జా బృందం చేసే ఒక మిషన్ తో సినిమా ప్రారంభమవుతుంది. తమ శత్రువు కాలిస్ ను వేరే ప్రపంచంలో కనుగొని చంపాలి అన్నది ఆ మిషన్. ఈ ప్రమాదకరమైన పనికి క్విని ఎంపిక చేస్తారు. కానీ అంతలోనే తన తమ్ముడిని రక్షించడానికి ప్రయత్నించి క్వి చనిపోతాడు. దీంతో డెక్ తన సోదరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాడు. యౌట్జాగా తనను తాను నిరూపించుకుని, గెలాక్సీలోని మోస్ట్ డేంజరస్ ప్లానెట్ జెన్నాలో తమ శత్రువును చంపడానికి వెళ్తాడు. అక్కడ ప్రమాదాలను దాటుకుంటూ తల నుంచి నడుము వరకు మాత్రమే ఉన్న హ్యూమనాయిడ్ రోబోట్ థియాను కలుస్తాడు డెక్. థియాకు మాట్లాడే శక్తి, భావోద్వేగాలను అర్థం చేసుకునే శక్తి ఉంది. డెక్ వెతుకుతున్న కాలిస్‌ను ఎక్కడ వెతకాలో ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె ఆమె తనకు కాళ్ళు లేకపోవడంతో డెక్‌ను సహాయం చేయమని అడుగుతుంది. కాలిస్ నుండి తనను రక్షించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె నుండి విడిపోయిన తన రోబోటిక్ మానవ కవల థెస్సాతో తిరిగి కనెక్ట్ అవుతుంది. అసలు ఈ థియా, థెస్సా ఎవరు? డెక్ కాలిస్‌ను కనుగొని చంపేశాడా లేదా? అనేది తెలుసుకోవడానికి సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం “ప్రిడేటర్: బాడ్లాండ్స్” అనేది ఇతర జీవులను రాక్షసులలాగా వేటాడే ప్రపంచానికి మనల్ని పరిచయం చేస్తుంది. “ప్రిడేటర్” సిరీస్ ను చూస్తే కథ తెలుస్తుంది. కానీ మునుపటి చిత్రాలను చూడని వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే… యౌట్జా అనేది ఇతర గ్రహాలకు ప్రయాణించి ప్రమాదకరమైన జీవులను, మానవులను వేటాడే దోపిడీ గ్రహాంతర జాతి. ఇప్పటివరకు ప్రిడేటర్‌ను విలన్‌గా చూసిన ప్రేక్షకులు, ఇక్కడ యంగ్ ప్రిడేటర్ డెక్‌ను హీరోగా చూస్తారు.
నటుడు డిమిట్రియస్ షుస్టర్-కొలోమతంగి డెక్ పాత్రను పోషించాడు. రాక్షసుడిగా మారడానికి ఆయన కనీసం 2-3 కిలోల ప్రొస్థెటిక్ మేకప్ వేసుకుని ఉంటారు. గంటల తరబడి పడే ఈ కష్టంతోనే ఆయన మొహం కనిపించకపోయినా యౌట్జాగా తెరపై అద్భుతంగా నటించాడు. టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించినప్పటికీ, డిమిట్రియస్ షుస్టర్ నటన బాగుంది. థియా పాత్రలో నటించిన ఎల్లే ఫానింగ్ కు విభిన్న నటనా నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వచ్చింది. సినిమా మొత్తం తన వైవిధ్యమైన భావోద్వేగాలతో, థియా పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే డిమిట్రియస్ షుస్టర్-కొలోమతంగి – ఎల్లే ఫానింగ్ మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి హార్ట్ అండ్ సోల్.
“ప్రిడేటర్: బాడ్‌ల్యాండ్స్” చిత్రానికి దర్శకత్వం వహించిన డాన్ ట్రాచ్టెన్‌బర్గ్, గతంలో ప్రే (2022) అనే చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో బద్ధ శత్రువులైన ప్రమాదకరమైన జీవుల మధ్య ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది. కథను అల్లిన విధానం కూడా బాగుంది. కొన్ని సన్నివేశాలు మాత్రం కొంచెం బోరింగ్‌గా అనిపించవచ్చు. అలాగే మూవీని చూస్తున్నప్పుడు ప్రే, ఐకానిక్ ప్రిడేటర్ మూవీని మిక్స్ చేసి కొట్టాడా అన్పిస్తుంది. మొదటి సన్నివేశం నుండి చివరి సన్నివేశం వరకు ఒకే యాక్షన్ సన్నివేశాలు రిపీట్ అవ్వడం, సినిమా మధ్యలో కొంచెం స్లో అవ్వడం చికాకు పెడతాయి. కానీ చివర్లో ఒక శక్తివంతమైన ట్విస్ట్ అదిరిపోతుంది. టెక్నికల్ గా మూవీ బాగుంది. అయితే ప్లానెట్స్ సీన్స్ లో సిజిఐ దారుణంగా ఉంది.
ప్లస్ పాయింట్స్
యాక్షన్, విజువల్స్ సీన్స్
నటీనటుల పర్ఫార్మెన్స్
ప్రిడేటర్‌ను సింపథీ హీరోగా చూపించడం
బ్యాక్గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్
సన్నివేశాల సాగదీత
సిజిఐ సీన్స్
మొత్తానికి
క్రూరత్వం తగ్గిన ‘ప్రిడేటర్’ ఇది. ఈ ఫ్రాంచైజీలో మిగతా సినిమాలను దృష్టిలో పెట్టుకుని థియేటర్ కు వెళ్తే పక్కా డిసప్పాయింట్ అవుతారు.
రేటింగ్ : 2/5