Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ అసలు రంగు బయటపడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంపై ఆయన తల్లి మహానంద కుమారి చేసిన సంచలన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన కొడుకు మృతి వెనుక ఉన్న మిస్టరీపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేయడం ఆ పార్టీని ఇరకాటంలోకి నెట్టేసింది. కేటీఆర్ మౌనం వీడితేనే గోపీనాథ్ మరణం వెనుక ఉన్న మిస్టరీ బయటపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కన్నీటితో కేటీఆర్‌ను ప్రశ్నించిన తల్లి
గోపీనాథ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు, కన్నతల్లిగా తనను, తన పెద్ద కొడుకును కనీసం చివరి చూపు కూడా చూడడానికి అనుమతించలేదని మహానంద కుమారీ కన్నీటి పర్యంతం అయ్యారు. గోపీనాథ్‌కు చికిత్స అందిస్తున్న ఐసీయూ పరిసరాల వైపు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారని వెల్లడించారు. గోపీనాథ్‌ను పరామర్శించడానికి వచ్చిన కేటీఆర్‌ను కలిసి లోపలికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరినా ఆయన పట్టించుకోలేదని తెలిపారు. తాను మాట్లాడతానని చెప్పి, ఆ తర్వాత కేటీఆర్ మరో మార్గం నుంచి వెళ్లిపోయారని, తమ ఆవేదనను బేఖాతరు చేశారని ఆమె మండిపడ్డారు.
మరణ ప్రకటనపై అనుమానం
‘నా కొడుకు చనిపోయినా వెంటిలేటర్‌పై ఉంచారా? కేటీఆర్ వచ్చి వెళ్లిన తర్వాతే గోపీనాథ్ మరణాన్ని ఎందుకు ప్రకటించారు?’ అని మహానంద కుమారి ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న నిజం ఏంటో వెల్లడించాలని ఆమె నేరుగా కేటీఆర్‌ను డిమాండ్ చేయడం సంచలనంగా మారింది. ఒక సీనియర్ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నాయకుడి మృతిపై ఆయన కుటుంబం నుంచే ఇంత తీవ్రమైన ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనమైంది. మరోవైపు ఈ ఆరోపణలపై బీఆర్‌ఎస్ అధిష్టానం మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోందని జూబ్లీహిల్స్ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించి, ఆసుపత్రిలో ఏం జరిగింది..? గోపీనాథ్ మరణానికి సంబంధించిన వాస్తవాలు ఏంటి..? అనేది బహిర్గతం చేయాల్సిన బాధ్యత కేటీఆర్‌పై ఉందని జూబ్లీహిల్స్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
బీఆర్‌ఎస్‌కు తీవ్ర నష్టం తప్పదు
మాగంటి గోపీనాథ్ తల్లి చేసిన సంచలన వ్యాఖ్యలు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ పరిస్థితిని మరింత దిగజార్చాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, సొంత కుటుంబం నుంచి మాగంటి సునీత వ్యవహారశైలిపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తడంతో ఇక ఆమెపై సానుభూతి చూపేది ఎవరనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గోపీనాథ్ మొదటి భార్య మాలిని దేవి, ఆమె కుమారుడు ప్రద్యుమ్నతో పాటు తల్లి సైతం బీఆర్‌ఎస్ అభ్యర్థికి వ్యతిరేకంగా మాట్లాడటం, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం అంశం తీవ్ర వివాదాస్పదమవ్వడం బీఆర్ఎస్‌కి నష్టం కలిగించే అంశాలనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గోపీనాథ్ తల్లి ఆవేదనపై మహిళ నుంచి పెద్దఎత్తున సానుభూతి లభిస్తోంది.
92 ఏళ్ల వయసులో ఓ తల్లికి సొంత కొడునును కూడా చివరి చూపు చూసుకొనే అవకాశం ఇవ్వని ఇలాంటి వారు ఎంతటి దుర్మార్గులని చర్చించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఏదైనా సమస్య ఉందని మాగంటి సునీత ఇంటికి వెళ్తే సామాన్యలకు దక్కే మర్యాద ఏపాటిదో అర్థం అవుతోందని చర్చించుకుంటున్నారు. ఈ పరిణామాలు అన్నీ కూడా ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తీవ్రంగా దెబ్బతీస్తాయనే ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
ALSO READ: Jubilee Hills bypoll: జూబీహిల్స్ బైపోల్‌లో సైలెంట్ వేవ్ రాబోతుంది.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు