Indian Railways: భారతీయ రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే అత్యవసరంగా డబ్బులు కావాల్సిన వాళ్లు రన్నింగ్ ట్రైన్ లోనూ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. రైల్వే చరిత్రలోనే తొలిసారి రైల్లో ATM సెంటర్ ఏర్పాటు చేసింది. ఇంతకీ ఈ ఏటీఎం సెంటర్ ఏ రైల్లో అందుబాటులోకి తెచ్చింది? ఏ రూట్ లో ప్రయాణించే వారికి ఈ సేవలను అందించనుంది? అనే విషయాలను తెలుసుకుందాం..
పంచవటి ఎక్స్ ప్రెస్ లో ATM సెంటర్ ఏర్పాటు
ముంబై- మన్మాడ్ నడుమ రాకపోకలు కొనసాగించే పంచవటి ఎక్స్ ప్రెస్ రైల్లో తాజాగా ఏటీఎం సెంటర్ ను ఏర్పాటు చేశారు అధికారులు. ఈ ATMను ఎక్స్ ప్రెస్ లోని AC చైర్ కార్ కోచ్ లో ఏర్పాటు చేశారు. త్వరలో ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సాకారంతో..
పంచవటి రైల్లో ఏర్పాటు చేసిన ATMను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అందించింది. ఈ ATMను కోచ్ వెనుక చివరలో, తాత్కాలిక ప్యాంట్రీ స్థలంగా ఉపయోగించే క్యూబికల్ లో ఏర్పాటు చేశారు. రైలు కదులుతున్న సమయంలో భద్రత కోసం ఈ మిషన్ షట్టర్ తలుపు ద్వారా ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఈ ఏటీఎం ఏర్పాటు కోసం మన్మాడ్ రైల్వే వర్క్ షాప్ లో కీలక మార్పులు చేశారు. ప్రయాణ సమయంలో ATM పని చేయడానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఈ కోచ్ లో ఏర్పాటు చేశారు. త్వరలోనే ఈ ఏటీఎం సేవలను రైల్వే, బ్యాంకు అధికారులు కలిసి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. “ఇప్పటికే ATM ఇన్ స్టాలేషన్ పూర్తి అయ్యింది. ఏటీఎం ఏర్పాటు చేసిన తర్వాత పంచవటి ఎక్స్ ప్రెస్ ముంబైకి వచ్చింది. భారతీయ రైల్వే చరిత్రలో ఇదో సరికొత్త ముందడుగుగా భావిస్తున్నాం. రైల్వే ప్రయాణీకులకు ఈ ATM సేవలు ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రయాణీకుల విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది” అని చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ స్వప్నిల్ నీలా వెల్లడించారు.
Read Also: రైల్లో అస్వస్థతకు గురైనప్పుడు వెంటనే ఇలా చెయ్యండి.. ప్రాణాలు దక్కుతాయ్!
పంచవటి ఎక్స్ ప్రెస్ రైలు గురించి..
12109 నెంబర్ గల పంచవటి ఎక్స్ ప్రెస్ రైలు ముంబై నుంచి మన్మాడ్ మధ్య ప్రతి రోజు రాకపోకలు కొనసాగిస్తుంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) నుంచి మన్మాడ్ జంక్షన్ (MMR) వరకు ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణం దాదాపు 4 గంటల 35 నిమిషాలు పడుతుంది. ఈ రూట్ లో అత్యంత రద్దీగా ఉండే రైళ్లలో పంచవటి ఎక్స్ ప్రెస్ ఒకటి. నూతనంగా తీసుకొచ్చిన ATM సేవ ప్రయాణీకులకు ఎంతో మేలు కలిగించనుంది. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ ATM సెంటర్ సక్సెస్ అయితే.. మరిన్ని రైళ్లలో ATM సెంటర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Also: వావ్.. ఈ దేశాల్లో ట్రైన్ జర్నీ ఉచితం, అక్కడికి వెళ్తే ఓసారి ట్రై చెయ్యండి!