
Maitreem Bhajata : అది 1966 వ సంవత్సరం. ఒకవైపు కమ్యూనిస్టు రష్యా, కేపిటలిస్టు అమెరికా దేశాలు ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు దూకుడుగా అడుగులు వేస్తున్న రోజులు.
ఈ రెండు దేశాలు నేరుగా యుద్ధానికి తలపడకున్నా, అనిశ్చితి ఎదుర్కొంటున్న ప్రతిదేశపు అంతర్గత వ్యవహారాల్లో వేలుపెట్టి.. హింసాయుత పోరాటాలకు ఆజ్యం పోస్తున్న రోజులవి.
‘కోల్డ్ వార్ టైం’గా చెప్పే ఈ రోజుల్లో వియత్నాం మీద అమెరికా యుద్ధం, అప్ఘానిస్థాన్‌లో అమెరికా మద్దతుతో లాడెన్ పోరాటాలు, క్యూబా- అమెరికా ఉద్రిక్తతలు సాగుతున్నరోజులవి.
ఇది చిలికిచిలికి మూడవ ప్రపంచయుద్ధానికి దారి తీస్తుందేమోననే భయంతో ప్రపంచం అంతా ఉన్న ఆ రోజుల్లోనే శ్రీమతి ఇందిరా గాంధీ దేశ ప్రధానిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు.
ప్రజలు శాంతికోసం ప్రయత్నాలు చేస్తున్న ఆ రోజుల్లో ఐక్యరాజ్యసమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దానికి భారత్‌కూ ఆహ్వానం అందింది.
అమెరికా, రష్యాలకు భయపడి ఏ దేశమూ శాంతి ప్రయత్నాలు చేయటానికి జంకుతున్న ఆ రోజుల్లో భారత్ తరపున శాంతి సందేశాన్ని ప్రపంచానికి వినిపించాలని ప్రధాని ఇందిర నిర్ణయించుకొని, ఆ పనిని డా. ఎం.ఎస్. సుబ్బులక్ష్మికి అప్పగించారు.
శాంతిని ఆకాంక్షిస్తూ ఒక కీర్తనను ఐక్యరాజ్యసమితిలో ఆలపించాలని కోరగా, ఏం పాడాలో తోచని సుబ్బులక్ష్మి.. నడిచేదైవంగా పేరొందిన నాటి కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఆశ్రయించారు.
ఆయన ఒక సంస్కృత కీర్తనను రాసివ్వగా, దానిని ప్రముఖ సంగీత దర్శకులు వసంత దేశాయ్ గారు స్వరపరచారు.
1966 అక్టోబరు 23న ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో తన బృందంతో డా. సుబ్బులక్ష్మి ఆలపించారు. దీని ఆంగ్ల అనువాదాన్నీ ఆ వేదికపై వినిపించగా.. సభికులంతా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో స్వాగతించారు. దీనిని ‘అంతర్జాతీయ శాంతి గీతం’గా ప్రపంచ దేశాలన్నీ కొనియాడాయి.
‘మైత్రీం భజత.. అఖిల హృత్ జైత్రీం’ అంటూ సాగే ఆ కీర్తనకు అర్థం ఇది. ‘మైత్రిని పెంచుకుందాం. ఇది అందరి మనసులనూ గెలుస్తుంది. పొరుగువారినీ నీవారిగానే భావించు. యుద్ధం వద్దేవద్దు. మనకు అన్నీ ఇస్తున్న భూమాత, మనందరినీ సృష్టించిన ఆ పరమాత్మ మనతోనే ఉన్నారు. దయతో వ్యవహరిస్తూ.. ప్రజలంతా హాయిగా జీవించేలా చూద్దాం. అందరి మేలూ కోరుకుందాం. అందిరికీ మంచి జరగనిద్దాం’.