
Telangana Politics : తెలంగాణలో ఎన్నికలకు కౌంట్‌డౌన్ దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. కేంద్రం, రాష్ట్రాల్లో అధికార పార్టీలుగా ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ లకు షాకుల మీద షాక్ లు తగులుతున్నాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అంటున్న బీజేపీకి మాత్రం వరుస షాక్‌లు తగులుతున్నాయి. జిల్లాల్లోని కీలక నేతలంతా కాషాయ కండువా పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్‌లో ముఖ్య నేతలు కూడా చేరిపోయారు. అందుకు లెటెస్ట్ ఎగ్జాంపుల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డే అని చెప్పాలి.
నిజానికి చాలా రోజులుగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీ అధిష్టానంపై కాస్త అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కొందరు బహిరంగంగా.. మరికొందరు ప్రత్యేక భేటీలు ఏర్పాటు చేసుకొని మరీ తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. బీజేపీ అసంతృప్తి నేతలంతా పార్టీ మారేందుకు సిద్ధమైపోయినట్టు ఎప్పుడో రెడీ అయిపోనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్‌ఎస్ జోష్ తగ్గిపోవడం.. కాంగ్రెస్ గెలుస్తుందన్న నమ్మకం పెరిగిపోవడంతో వీరంతా కాంగ్రెస్‌కే క్యూకట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం చాలా రోజులుగా బీజేపీ నేతలను ఆహ్వానిస్తున్నారు. బీజేపీలో చేరికల ఇన్ చార్జ్‌గా ఉన్న ఈటల రాజేందర్ సహా కీలక నేతలంతా కాంగ్రెస్‌లో చేరాలని ఆయన కోరారు. ఆయన ఆహ్వానాన్ని మన్నించారో లేక వేరే ప్రత్యామ్నాయం లేకనో తెలీదు కానీ ఇప్పుడు బీజేపీ, బీఆర్‌ఎస్ అసంతృప్తి నేతల గమ్యస్థానం మాత్రం కాంగ్రెస్సే అవుతోంది.
ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి కమలానికి బైబై చెప్పారు. నేడో, రేపో వివేక్ కూడా బీజేపీకి రామ్ రామ్ పలికేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక మిగిలిన అసంతృప్తులు సైలెంట్‌గా సర్దుకుపోతారా? లేక చివరి నిమిషంలో కాషాయ దళానికి ట్విస్ట్‌లు ఇస్తారా? అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఏదేమైనా కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత తెలంగాణలో పరిస్థితులు మారిపోయాయి. బీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం అన్న ఆలోచన మారిపోయింది. కాంగ్రెస్ లీడింగ్‌లోకి వచ్చింది. అప్పటి వరకు సస్పెన్స్‌లో ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరాలనుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టేసి.. హస్తం గూటికి చేరారు. వార్డ్ మెంబర్ల నుంచి మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. దీనికి తోడు బీఆర్‌ఎస్ ఫస్ట్ లిస్ట్ ప్రకటించడంతో అందులో టికెట్ దక్కని నేతలంతా కూడా అయితే రేవంత్, లేదంటే ఖర్గే చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు.
దీనికి తోడు బీజేపీ రాష్ట్ర పగ్గాలు బండి సంజయ్ నుంచి కిషన్ రెడ్డి చేతులకు వచ్చాక.. ఆ పార్టీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారైందన్న ప్రచారం కూడా ఆ పార్టీకి మరింత నష్టం చేసిందనే చెప్పాలి. కేంద్రమంత్రులు ప్రచారం చేస్తున్నా.. ఏకంగా అమిత్ షా, మోడీలు తరలివస్తున్న మాత్రం కాషాయ పార్టీ పరిస్థితి ఇప్పట్లో మెరుగు పడేలా కనిపించడం లేదు.