El Niño: స్వేచ్య బ్యూరో: రాష్ట్రంలో రానున్న కాలంలో ఎదురుకానున్న ఎల్‌నినో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అప్రమత్తంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజాభవన్ వేదికగా జరిగిన అత్యవసర సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ, సామాజిక , ప్రకృతి విపత్తుల పరిస్థితులపై సుదీర్ఘంగా దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో ఎల్‌నినో ప్రభావం, తాగు-సాగు నీటి సమస్యలు, విద్యుత్ డిమాండ్, ఉపాధి హామీ పథకం అమలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు , కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలపై సీఎం విస్తృతంగా ప్రశంసించారు.
ప్రకృతి వైపరీత్యాలు మూడు రకాలని, అందులో భూకంపాలు, వరదలు తక్షణ నష్టాన్ని కలిగిస్తే.. కరువు మాత్రం నెమ్మదిగా కబలిస్తుందని సీఎం పేర్కొన్నారు. ఎల్‌నినో కారణంగా ప్రపంచవ్యాప్తంగా వంద దేశాలతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాలు తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. మహారాష్ట్రలో ఇప్పటికే మంచినీటిని రేషన్‌లా ఇస్తున్నారని, అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ కరువు ప్రభావం వచ్చే ఏడాది జూలై వరకు ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.సమస్య చిన్నగా మొదలై పెద్దదవుతుందని, ప్రజలను అప్రమత్తం చేయకుండా ఈ విపత్తును ఎదుర్కొలేమని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఇప్పటికే క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేశామని, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు ప్రత్యేక అధికారిగా రామకృష్ణారావును నియమించినట్లు వెల్లడించారు.
ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు అడుగంటి డెడ్ స్టోరేజీకి చేరాయని, భవిష్యత్తులో సాగునీటికి అవకాశం లేదని, కేవలం తాగునీటికే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. 30 లక్షల పంప్సెట్లలో ఇప్పటికే 15 లక్షలు ఎండిపోయాయని, రైతులు ఆశపడి పంటలు వేసి పెట్టుబడులు నష్టపోవద్దని హితవు పలికారు. కేవలం ఆరుతడి పంటలు, కూరగాయల సాగు మాత్రమే చేయాలని సూచించారు. రైతు వేదికల ద్వారా రైతులకు నిరంతరం అవగాහన కల్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అభినందించారు.
Also Read: ఇంజినీర్ జాబ్ మానేసి రాపిడో డ్రైవర్ పనికి.. ఇప్పుడు నెలకు రూ.1.2 లక్ష ఆదాయం
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సీజన్లో విద్యుత్ వినియోగం 20 వేల మెగావాట్లకు చేరిందని సీఎం తెలిపారు. యూనిట్‌కు రూ. 15 పెట్టినా మార్కెట్లో కరెంట్ దొరికే పరిస్థితి లేదని, అప్పులు తెచ్చి మరీ ప్రభుత్వం నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తోందని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ విద్యుత్ పొదుపు పాటించాలని, ప్రజలు కూడా స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. దామరచర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్‌ను తప్పుడు ప్రణాళికలతో నిర్మించడం వల్ల ఏటా బొగ్గు రవాణా భారం పడుతోందని బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ప్రతి చేతికి పని పేదలకు, కూలీలకు రోజువారీ ఉపాధి కల్పించే లక్ష్యంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సంక్రాంతి నుంచి మే వరకు పకడ్బందీగా అమలు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్రామాల్లో పర్యటించి పొలాలకు వెళ్లే రోడ్లు, చెరువులు, కుంటలు, కాలువల పునరుద్ధరణ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. గ్రామాల్లో మూగజీవాల కోసం ప్రత్యేక పశుగ్రాసం, తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా పేదల ఓటు హక్కులనుకాలరాసి,రాజ్యాంగాన్ని బలహీనపరచాలని చూస్తోందని సీఎం తీవ్రంగా ధ్వజమెత్తారు. దీనికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ‘సైమన్ గో బ్యాక్’ ఉద్యమ స్ఫూర్తితో ‘జ్ఞానేశ్ గో బ్యాక్’ నినాదంతో జరిగే ఈ సభకు తెలంగాణ నుంచి 15 వేల మంది తరలివెళ్లి రాష్ట్ర తడాఖా చూపాలని పిలుపునిచ్చారు.
మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పార్టీ అత్యంత ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేసిందని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్కరితో ఓటు నమోదు చేయించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఎన్నికలు లేని జిల్లాల నాయకులకు కూడా బాధ్యతలు అప్పగించి పార్టీ విజయం కోసం శ్రమించాలని కోరారు.
AlsobRead: వయసు మారితే బాడీ లాంగ్వేజ్ కూడా మారాల్సిందే – రాగ్ మయూర్!