కామారెడ్డి నుంచి పోటీ చేయాలనుకున్న షబ్బీర్
మరోమారు ఆలోచించమని కోరుతున్న అలీ అనుచరవర్గంషబ్బీర్ అలీ. పరిచయం అక్కర్లేని సీనియర్ కాంగ్రెస్ నేత. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ, ప్రస్తుత సీఎం రేవంత్ సైతం అక్కడి నుంచి పోటీ చేయాలనుకోవడంతో.. లోకేషన్ ఛేంజ్ చేశారు. లాస్ట్ బట్ బెస్ట్ అనిపించడం లో భాగంగా.. నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేశారు. కానీ బై బ్యాడ్ లక్ స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. పార్టీ గెలిచి తాను ఓడ్డంతో తీవ్ర అసంతృప్తి. ఏం చేద్దాం.. దురదృష్టం అలా వెంటాడిందని తనకు తాను బాధ ఓదార్చుకున్నారు. తన ఆశలన్నీ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఛాన్స్ కి షిఫ్ట్ చేసుకున్నారు.
ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కక పోవడంతో తీవ్ర నిరుత్సాహం
ఒకటీ రెండు కాదు ఏకంగా 45 ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్నారు షబ్బీర్ అలీ. దానికి తోడు పార్టీ మైనార్టీల్లోనే దిగ్గజ నేతగానూ ఒక బ్రాండ్ ఉంది. దీంతో.. పార్టీ సైతం ఆయనకు ముఖ్య సలహాదారు పోస్టునిచ్చి గౌరవించింది. తగిన విధంగానే సత్కరించింది. అయినా సరే ఆయనకు ఏమంత సంతృప్తి కలగలేదట. ఎలాగైనా సరే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికయ్యి .. అధ్యక్షా అనాలనుకున్నారట. ఎంతైనా.. సభలో ఉంటే ఆ పవరే వేరు కాబట్టి.. ఆ దిశగా ఇన్నాళ్ల పాటు తన ఆశలు పెంచుకుంటూ వచ్చారట. అయితే తన ఆశలన్నీ నిరాశలుగా మారడంతో తీవ్ర నిరుత్సాహ పడుతున్నారట షబ్బీర్ అలీ, ఆయన అనుచరులు.
షబ్బీర్ అలీ ద్వారా తీరుతుందని భావస్తే.. ఆశ అడియాశ
కాంగ్రెస్ కి పూర్వ వైభవం వచ్చింది. కానీ తమకు రాలేదు. ఒక్కటంటే ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. అంతగా వివక్ష చూపుతున్నారు. ఇదీ ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ శ్రేణుల అభిప్రాయమట. ఈ ముచ్చట షబ్బీర్ అలీ ద్వారా తీరుతుందని ఆశపడ్డవారికి తీవ్ర భంగపాటు తప్పలేదట. ఇదే అంశంపై షబ్బీర్ అలీ అనుచర వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోందట. సోషల్ మీడియా గోడలపై.. పోస్టుల మీద పోస్టులు పెడుతోందట.
సీనియర్ షబ్బీర్ కి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్న చర్చ
షబ్బీర్ అలీది కాంగ్రెస్ లో సుదీర్ఘ ప్రస్తానం. దాదాపు అర్ధశతాబ్ద కాలం నుంచీ ఆయన కాంగ్రెస్ పార్టీ వీర విధేయులు. అంకిత భావం గల నేతగానూ పేరు. తెలంగాణ శాసన మండలిలో ఇటు ప్రతిపక్ష నేతగా.. అటు పార్టీలోనూ పలు హోదాల్లో పని చేసిన అనుభవజ్ఞులుగానూ ప్రఖ్యాతులు. అలాంటి నేతకు తగిన ప్రాధాన్యతనివ్వలేదని అనుచర వర్గాలు పార్టీలో చర్చకు తెరలేపాయట. ఇటు పార్టీకే కాకుండా అటు మైనార్టీ సమాజానికి అలీ చేసిన సేవలు మరువలేనివనీ.. మైనార్టీ సంక్షేమం కోసం ఆయన న్యాయవాదిగానూ పని చేశారనీ తమ వాదన వినిపిస్తున్నారట. మైనార్టీ వర్గాల ప్రయోజనాలను కాపాడ్డంలో అవిశ్రాంత కృషి చేసిన అలీకి.. ఇంతటి ద్రోహం జరగటంతో.. తాము తట్టుకోలేక పోతున్నామనీ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారట. ఏది ఏమైనప్పటికీ.. తమ అభిమాన నేత- అలీకి తీరని అన్యాయం జరిగిందని మాట్లాడుకుంటున్నారట.
అధిష్టానం ఆదేశం మేరకే అడ్వయిజర్ గా కొనసాగుతున్నా- అలీ
ఇదే అంశంపై మాజీ మంత్రి, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సైతం స్పందించారు. అడ్వైజర్ గా కొనసాగడం తనకు ఇష్టం లేకున్నాసరే, పార్టీ అధిష్టానం తీస్కున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాననీ వాపోయారట. తన టార్గెట్ ఎమ్మెల్సీ ఆపై మంత్రి పదవి పొందడమనీ అంటున్నారట. ఈ దిశగా.. తను, తన వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నామనీ చెబుతున్నారట. తన వారి ముందు ఈ దిశగా తన బాధ వ్యక్తం చేస్తున్నారట సీనియర్ లీడర్ షబ్బీర్ అలీ. అప్పట్లో తాను రేవంత్ కోసం కామరారెడ్డి సీటు త్యాగం చేయకపోయి ఉంటే.. ఈ పాటికి నేరుగా ఎమ్మెల్యేగా గెలిచి.. ఆపై మైనార్టీ కోటాలో మంత్రి పదవి సాధించి ఉండేవాడిననీ అంటున్నారట. పార్టీ కోసం ఆ మాత్రం త్యాగం చేయడంలో తప్పులేదని భావించడమే తనకీ దుస్థితి తెచ్చిపెట్టిందని తన వారి ముందు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
ఇప్పుడు ఎమ్మెల్సీ లేదంటే.. వచ్చే మంత్రి వర్గ విస్తరణ ఛాన్సూ లేనట్టే..
తాజా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో అలీ పేరు లేక పోవడంతో.. వచ్చే మంత్రి వర్గ విస్తరణకు ఛాన్సే లేదు కాబట్టి.. షబ్బీర్ అలీ, ఆయన అచనురులు భగభగలాడి పోతున్నారట. దీంతో తమదైన స్టైల్లో సోషల్ మీడియా పోస్టులు పెట్టి తమ మంట చల్లార్చుకుంటున్నారట. తమ ఆక్రోశం, ఆవేదన.. సీదా జాతీయ నాయకత్వం దృష్టికి తీస్కెళ్లే యత్నం చేస్తున్నారట. ఇలాగైనా సరే, తమ లీడర్ షబ్బీర్ అలీకి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నారట.
గతంలో అసెంబ్లీ సీటు పొందిన, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారికి నో ఛాన్స్
అయితే పార్టీ అంతర్గత వర్గాల సమాచారం మేరకు తేలిందేంటంటే.. గత ఎన్నికల్లో అసెంబ్లీ సీటు ఇచ్చిన వారికి NO ఎమ్మెల్సీ ఛాన్స్. ఆపై గెలిచాక నామినేటెడ్ పోస్టులు పొందిన వారికీ.. ఈసారి మండలి అవకాశాలివ్వరాదని డిసైడ్. ఆల్రెడీ అధిష్టానం ఈ దిశగా ఫిక్స్ అయ్యింది కాబట్టే.. అలీకి ఛాన్సు మిస్సయిందనీ గాంధీ భవన్ వర్గాల ఇంటర్నల్ టాక్.
మరోమారు ఆలోచించమని కోరుతున్న అలీ అనుచరవర్గం
అయితే ఇలాంటివేవీ .. అలీ వర్గీయుల మనసులకైన గాయాలను మాన్పలేక పోతున్నాయట. ఇప్పటికైనా మించి పోయింది లేదు. ఇటు ఉమ్మడి జిల్లాకు ఇంత వరకూ మంత్రిమండలిలో.. దక్కని ప్రాతినిథ్యం. ఆటు మైనార్టీ కోటాకు రాని మంత్రిత్వం.. ఇక సీనియారిటీకి దక్కని గౌరవం వంటి ప్రాధాన్యతాంశాలను పరిగణలోకి తీసుకుని.. మరోమారు ఆలోచించమని కోరుతున్నారట. మరి చూడాలి. షబ్బీర్ వర్గీయుల ఆవేదనకు అధిష్టానం నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాల్సిందేనంటున్నారు.. హస్తం పార్టీ కార్యకర్తలు.