KTR Resign Posters: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారపర్వం రేపటితో ముగియనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రచార రాజకీయం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో కేటీఆర్ రాజీనామా పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. కంటోన్మెంట్ అభివృద్ధి జాబితా ఇదిగో కేటీఆర్ రాజీనామాకు రెడీనా? అని పోస్టర్లలో రాసి ఉంది. జేబీఎస్-శామీర్ పేట్ కారిడార్ కు రూ.4263 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని పోస్టర్లపై రాసి ఉంది.
టీపీసీసీ జనరల్ సెక్రటరీ పృథ్వీ చౌదరి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ తో కలిసి ప్యారడైజ్ జంక్షన్‌లో జరుగుతున్న ఎలివేటెడ్ కారిడార్ పనులను పరిశీలించారు. సెప్టెంబర్ 15న NH-44 వెంట పారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ రోడ్ వరకు ఉన్న ప్రాంతాన్ని కవర్ చేస్తూ ఈ ప్రాజెక్టు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయన్నారు.
జేబీఎస్-శామీర్ పేట్ కారిడార్ పనులు ప్రారంభం అయితే తాను రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో సవాల్ చేశారు. ఈ సవాల్ పై తాజాగా హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వం తన వాగ్దానాలను అభివృద్ధిగా మారుస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం జేబీఎస్-శామీర్ పేట్ ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభమైనందున కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు స్పీకర్ సమక్షంలో అసెంబ్లీకి వచ్చి తమ రాజీనామాను సమర్పించాలని ఎమ్మెల్యే గణేష్ డిమాండ్ చేశారు.