BigTV English

Myanmar Earthquake: విలవిలలాడుతున్న ప్రాణాలు.. 334 అణుబాంబులతో సమానమైన విధ్వంసం

Myanmar Earthquake: విలవిలలాడుతున్న ప్రాణాలు.. 334 అణుబాంబులతో సమానమైన విధ్వంసం

Myanmar Earthquake: మయన్మార్ ప్రకృతి విలయం.. ప్రపంచానికి చాలా సవాళ్లు, పాఠాలు, హెచ్చరికలు చేసింది. రిక్టర్ స్కేలుపై 7 అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం వస్తే జరిగే నష్టం చాలా ఉంటుంది. అసలే అంతర్యుద్ధంతో సతమతమవుతున్న మయన్మార్ కు భూకంపం.. భారీ ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణమైంది. ప్రకృతి విలయాన్ని ముందుగా ఊహించడం కష్టం. ఇప్పటికీ శిథిలాల కింద చాలా మంది ఉన్నారు. ఇంకెన్ని ప్రాణాలు పోయాయో సరైన లెక్కే లేదు. మరి ఈ భూకంపం ప్రపంచానికి ఇస్తున్న డేంజర్ బెల్ ఏంటి? ఫ్లోర్ల మీద ఫ్లోర్లు కడుతూ వెళ్తే ఇక కష్టమేనా?


ఎటు చూసినా శిథిలాలు
విలవిలలాడుతూ ప్రాణాలు
రెప్పపాటులో కూలిన భవనాలు
334 అణుబాంబుల పవర్
భయపెట్టిన మయన్మార్ భూకంపం

యుద్ధాలు, అంతర్యుద్ధాలు, సంఘర్షణలు కాదు.. ప్రకృతి విలయం మొదలు పెడితే.. తట్టుకోవడం ఎవరి తరం కాదు. అందుకు ఉదాహరణే మయన్మార్ భూకంప విలయం. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు వేల ప్రాణాలు శిథిలాల కింద నలిగిపోయాయి. ఇప్పటి వరకు 1700 మందికి పైగా చనిపోయారని అంటున్నారు. కానీ అంతర్యుద్ధంతో సతమతమవుతున్న మయన్మార్ లో అసలు లెక్కలు బాహ్య ప్రపంచానికి చెప్పేదెవరు? ఈ భూగోళంపై ఎర్త్ క్వేక్ జోన్ లో ఇండోనేషియా, థాయ్ లాండ్, మయన్మార్ కీలకంగా ఉన్నాయి. అక్కడ ప్రకంపనలు వస్తే మామూలుగా ఉండదు. రిక్టర్ స్కేల్ పై 7 అంతకంటే ఎక్కువ తీవ్రతతోనే వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు రిజల్ట్స్ ఇలాగే ఉంటోంది.


ఆఫ్టర్ షాక్స్ నెలల తరబడి ఉండే అవకాశం

ఓవైపు అంత్యక్రియలు జరుగుతూనే ఉన్నాయి.. ఇంకోవైపు శిథిలాల కింద కొత్త మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. మయన్మార్‌లో 7.7 తీవ్రతతో వచ్చిన పవర్ ఫుల్ ఎర్త్ క్వేక్ 300 కంటే ఎక్కువ అణుబాంబులు కలిపి విడుదల చేసిన శక్తికి సమానం. ఈ విషయాన్ని ప్రముఖ అమెరికన్ జియో సైంటిస్ట్ జెస్ ఫీనిక్స్ అంటున్నారు. ఈ భారీ భూకంపం తర్వాత ఆఫ్టర్ షాక్స్ నెలల తరబడి ఉండే అవకాశం ఉంది. అంటే ప్రకంపనలు వస్తూనే ఉంటాయి. భూమి లోపల ఉండే భారత టెక్టోనిక్ ప్లేట్ మయన్మార్ కింద ఉన్న యురేషియన్ ప్లేట్‌తో తాకిడి కారణంగా ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు.

ఆరుబయట పెద్ద పెద్ద భవనాలకు దూరంగా నిద్ర

ఈ భారీ భూకంపం తర్వాత మయన్మార్‌ లో రెస్క్యూ కొనసాగుతోంది. అయితే గ్రౌండ్ లో పరిస్థితులు అనుకున్నంత ఈజీగా లేవు. ఎక్కడి శిథిలాలు అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. దీంతో వాటి నుంచి ప్రాణాలతో బయటపడుతారన్న ఆశలు మాత్రం తగ్గిపోతున్నాయి. 40 డిగ్రీల వేడిలో సహాయక చర్యలు వేగంగా జరగట్లేదు. సిబ్బంది కూడా అలసిపోతున్నారు. ప్రకంపనలు కొనసాగుతుంటే.. చాలా మంది ఆరుబయటే పెద్ద పెద్ద భవనాలకు దూరంగా నిద్ర పోతున్నారు. మండలే నగరంలో కూలిన అపార్ట్‌మెంట్ బ్లాక్‌లో శిథిలాల కింద 55 గంటలకు పైగా చిక్కుకున్న గర్భిణీ స్త్రీ కాలు కట్ చేసి మరీ ప్రాణాలు కాపాడాలనుకున్న సిబ్బంది చర్యలు ఫలించలేదు.

మొదట 7.7 తీవ్రత, ఆ తర్వాత 6.7 తీవ్రత

మండలే సమీపంలో 7.7 తీవ్రతతో భూకంపం ఆ తర్వాత కొన్ని నిమిషాలకే 6.7 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల ధాటికి భవనాలు, వంతెనలు కూలిపోయాయి, రోడ్లు ధ్వంసమయ్యాయి. మధ్య మయన్మార్‌లో చాలా విధ్వంసం కనిపించింది. బాధితులకు సహాయం చేయడానికి రెడ్ క్రాస్ సంస్థ 100 మిలియన్ డాలర్లతో సహాయ చర్యలను వేగవంతం చేసింది. మనదేశం కూడా 15 టన్నుల సామాగ్రిని పంపింది. మయన్మార్‌కు భారత్ చేస్తున్న వైద్య సహాయానికి ఆపరేషన్ బ్రహ్మ అని పేరు పెట్టారు.

నాలుగేళ్లుగా అంతర్యుద్ధంతో అతలాకుతలం

5 కోట్లకు పైగా జనాభా ఉన్న మయన్మార్ లో సవాళ్లు ఈ భూకంపానికే పరిమితం కాదు. భూకంపానికి ముందే చాలా సవాళ్లతో ఉన్నాయి. 2021లో సైనిక తిరుగుబాటు తర్వాత నాలుగేళ్ల అంతర్యుద్ధంతో మయన్మార్ అతలాకుతలమైంది. భూకంపం తర్వాత కూడా అంతర్గతంగా ఘర్షణలు జరిగాయి. అంతర్యుద్ధం కారణంగా దాదాపు 35 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు భారీ భూకంపంతో ఇంకా పరిస్థితి దిగజారింది.

300కు పైగా అణుబాంబులు పడినంత ఎఫెక్ట్

ఇప్పుడు వచ్చిన భూకంపం ముందు మయన్మార్ అంతర్యుద్ధం ఎంత? 300కు పైగా అణుబాంబులు పడడంతో సమానంగా భూకంపం వణికించింది. ఇక ముందు కూడా ఇలాంటి ప్రకృతి విలయాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు సైంటిస్టులు. కారణం భూమి లోపల ఉండే పొరలు మయన్మార్ లో స్థిరంగా లేవు. రాపిడి పెరుగుతోంది. కథ మారుతోంది. రాబోయే రోజుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిందే అని సైంటిస్టులు కూడా హెచ్చరిస్తున్నారు. ఫ్లోర్ పై ఫ్లోర్.. కట్టడం కాదు.. అందులో నుంచి ప్రాణాలతో బయటపడడం కూడా ముఖ్యమే.

శిథిలాలు మీద పడితే 72 గంటల దాకా బతికే ఛాన్స్

సాధారణంగా భూకంపం నేరుగా మనిషి ప్రాణం తీయదు. కేవలం కూలిన భవనాలతోనే ప్రాణనష్టం ఉంటుంది. గత చరిత్రను పరిశీలిస్తే భూకంపాలు వచ్చిన సమయంలో 90శాతం మందిని తొలి మూడు రోజుల్లోనే రక్షించగలిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. భూకంపం వచ్చిన తొలి 24 గంటల్లో స్థానికులు.. చేతులు, చిన్న చిన్న పరికరాలతో చేపట్టే సహాయక చర్యలు అత్యంత కీలకం. వీరే అత్యధిక మందిని కాపాడుతుంటారు. ఆ తర్వాత సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌, ఫైర్‌ ఫైటర్లు, పోలీసులు మిషనరీతో కూలిన భవనాల దగ్గరికి చేరుకుని కాపాడడం మరో సవాల్ తో కూడుకున్నది. శిథిలాల మీద పడితే కొందరు 72 గంటల దాకా బతికే అవకాశాలు ఉంటాయి. శిథిలాల తొలగింపుతో వారిని కాపాడవచ్చు. ఆ తర్వాత కష్టమే. ఇప్పుడు మయన్మార్ లో కనిపిస్తున్నది కూడా ఇదే.

భూకంపం.. నివారించలేని ప్రకృతి విపత్తు

భూకంపం.. నివారించలేని ప్రకృతి విపత్తు. ఎవరూ అడ్డుకోలేరు. భరించాల్సిందే.. నష్టపోవాల్సిందే.. ముందస్తుగా గుర్తు పట్టలేం.. క్షణాల వ్యవధిలో ప్రజలను అలర్ట్ చేయలేం. నిజానికి ఏమీ లేని చోట భూకంపంతో పెద్దగా నష్టం ఉండదు. కానీ బిల్డింగ్ లు కూలడంతోనే ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా జరుగుతుంటుంది. ఇవి లేని చోట భూమి కంపిస్తే పెద్దగా నష్టమేమీ ఉండదు. అయితే ప్రపంచం ఇప్పుడు భూకంపాలతో డేంజర్ జోన్ లోకి వెళ్తోంది. తరచూ ఎక్కడో చోట భూమి కంపిస్తూనే ఉంటోంది. ప్రాణాలు పోతూనే ఉన్నాయి.

సెంట్రల్ మయన్మార్‌‌లో 10 కి.మీ. లోతున భూకంపకేంద్రం

భూమిలోపల ఫలకాలు ఎలా కదులుతున్నాయి.. అసలు ఏం జరుగుతోందన్నది అంత ఈజీగా గుర్తుపట్టలేం. చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ ఇది. దీని స్టడీకి కూడా చాలా టైమ్ పడుతుంది. అయితే కొన్ని సిద్ధాంతాల ప్రకారం అంచనాలైతే వేయొచ్చు. లేటెస్ట్ గా వచ్చిన భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతున సెంట్రల్ మయన్మార్‌‌లో ఉన్నట్లు గుర్తించారు. సగాయింగ్‌ ఫాల్ట్‌ కు సమీపంలో ఉండే ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. భూమిలోపలి పొరల్లోని టెక్టానిక్ ప్లేట్స్ బార్డర్స్ గ్యాప్స్ ను ఫాల్ట్స్ అంటారు.

ఏడాదికి 11- 18 మి.మీ. వేగంతో కదలికలు

వీటి మందం కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. ఇవి రెగ్యులర్ గా రాపిడికి గురవుతూ ఒకదానితో ఒకటి ఢీకొంటాయి. రెండు టెక్టానిక్ ప్లేట్ల మధ్య భాగమే సగాయింగ్ ఫాల్ట్. భారత్ టెక్టానిక్ ప్లేట్‌, మయన్మార్ మైక్రోప్లేట్‌ల మధ్య ఉండే సగాయింగ్‌ ఫాల్ట్‌ దాదాపు 1200 కిలోమీటర్ల మేర విస్తరించింది. టెక్టానిక్ ప్లేట్స్ నిరంతరం కదులుతూ ఉంటాయి. సగాయింగ్‌ ఫాల్ట్‌లో ఈ కదలికలు ఏడాదికి 11- 18 మిల్లీమీటర్ల వేగంతో జరుగుతున్నట్లు జియో సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. 18 మిల్లీమీటర్లు అంటే చాలా ఎక్కువని, ఈ ప్రభావం మున్ముందు తీవ్రంగా ఉంటుందని అంటున్నారు.

భూకంప రెడ్‌ జోన్‌లో మయన్మార్

టెక్టానిక్ ప్లేట్స్ వేగంగా ఒత్తిడికి గురికావడంతోనే మయన్మార్‌ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. సగాయింగ్‌ ఫాల్ట్‌ వల్ల తీవ్రత ఎక్కువుంది. అంతేకాదు.. భూకంపాల ముప్పు ఎక్కువున్న రెడ్‌ జోన్‌లో మయన్మార్ ఉంది. అంటే ఇక్కడ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఈ ప్రాంతంలో గత వందేళ్లలో రిక్టర్ స్కేల్‌పై 6 తీవ్రత కంటే ఎక్కువగా 14 భూకంపాలు వచ్చాయి. 2011 నాటి భూకంపంలో 151 మంది చనిపోయారు.

2016లో 6.9 తీవ్రత, ప్రస్తుతం 7.7 తీవ్రతతో భూకంపం

ఆ తర్వాత 2016లో 6.9 తీవ్రతతో భూకంపం నమోదుకాగా.. ప్రస్తుతం 7.7 తీవ్రతతో వచ్చింది. పట్టణ, నగరీకరణ పెరగడంతో భవనాలు కూలే చాలా మంది చనిపోతున్న పరిస్థితి. సో భూమి లోపలి ఫలకాల్లో కదలికల కారణంగా భూకంపాలు వస్తుంటాయి. ఇవి ఎందుకు కదులుతాయంటే.. భూమి పొరల్లో విపరీతమైన వేడి, ఇతర కారణాలతో అడ్జెస్ట్ మెంట్ ఇష్యూస్ ఉంటాయి. దీంతో ఆ ఒత్తిడి, రాపిడిని తట్టుకునే పరిస్థితి ఉండదు. ఒక ప్లేట్ మరో ప్లేట్ తో ఢీకొట్టడం వల్ల అది భూకంపం రూపంలో పైకి ఎఫెక్ట్ చూపుతుంది. భూమి నెర్రలుబారుతుంది.

పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ రీజియన్ లో ఉన్న జపాన్

అటు జపాన్ కు కూడా భూకంప ముప్పు ఎక్కువగానే ఉంటోంది. ఇది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ రీజియన్ లో ఉంది. ఇది భూకంపాలు రావడానికి, అగ్ని పర్వతాలు పేలడానికి అనుకూలంగా ఉన్న ఏరియా ఇది. భూకంపాలకు భయపడి బతకడం కంటే.. వాటి నుంచి తప్పించుకోడానికి ఏం చేయాలనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు జపాన్ వాసులు. చిన్నప్పటి నుంచే పిల్లలకు ఎర్త్ క్వేక్స్ పై పాఠాలు చెబుతున్నారు. డ్రిల్స్ నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఉన్నట్టుండి అలారమ్స్‌ మోగించి వెంటనే విద్యార్థులందరూ బెంచ్‌ల కింద దాక్కోవాలని చెబుతుంటారు. ఇదో రెగ్యులర్ ప్రాక్టీస్ అయిందక్కడ.

భూకంపాలు వస్తే బిల్డింగ్స్ కూలిపోకుండా కొత్త టెక్నాలజీ

కాస్త భూకంపం వచ్చినా వెంటనే సేఫ్‌ ప్లేస్‌కి వెళ్లిపోయేలా జపాన్ స్కూల్ పిల్లలు కూడా అలవాటు పడ్డారు. భూకంపాలను తట్టుకునేలా ఇళ్లని నిర్మించే టెక్నాలజీని వినియోగిస్తోంది జపాన్. ఇక్కడి బిల్డింగ్స్‌లో సెస్మిక్ ఇసోలేషన్ బేరింగ్స్ ను వాడుతున్నారు. భూకంపం వచ్చినప్పుడు బిల్డింగ్‌ హారిజాంటల్‌గా కదిలేలా చేస్తాయి ఈ బేరింగ్స్. ఫలితంగా భవనంపై ఒత్తిడి తగ్గి డ్యామేజ్‌ తగ్గిపోతుంది. భూకంపాన్ని ముందుగా పసిగట్టేలా భవనాల్లో సెన్సార్ బేస్డ్ అలారమ్స్ ఉంటాయి. భూకంప తీవ్రతను తట్టుకుని నిలబడగలిగేలా ఇండ్లు కట్టుకోవాలని జపాన్ ప్రభుత్వం ఏనాడో బిల్డింగ్ కోడ్ తీసుకొచ్చింది.

భవనాలు కూలి శిథిలాల కింద నలిగిపోయే వారే ఎక్కువ

సో మన దగ్గర ములుగు జిల్లాలో 5 తీవ్రతతో వచ్చిన భూకంపం నుంచి జపాన్, ఇండోనేషియా, మయన్మార్, థాయ్ లాండ్ దాకా జరుగుతున్న పరిస్థితులు భూగోళానికి వార్నింగ్ బెల్ గా మారాయి. పెద్ద ఎత్తున బిల్డింగ్స్ కడుతూపోతే కుదరదు. భూకంపాలను తట్టుకునేలా డిజైన్ చేయడం ముఖ్యం. ఎందుకంటే భూకంపంతో డైరెక్ట్ గా ప్రాణనష్టం లేదు. కేవలం బిల్డింగ్ లు కూలి శిథిలాల కింద చిక్కుకునే చాలా మంది చనిపోతుంటారు.

భూమి పైపొరల్లో 16 ప్రధాన ఫలకాలు

భూమి పైపొరల్లో 16 ప్రధాన ఫలకాలు ఉంటాయి. రెండు ఫలకాలు కలిసే చోటును ఫాల్ట్‌ అని పిలుస్తారు. అంటే ఒక వైపు ఉన్న భూఫలకం ఒక దిశలో మరోవైపు ఉన్న భూఫలకం మరొక దిశలో కదులుతూ ఉంటాయి. నిజానికి ఈ ఫలకాలు చాలా నెమ్మదిగా కదులుతుంటాయి. అయితే, ఒక్కోసారి రెండింటిలో ఒక ఫలకం వేగంగా కదలడం, లేదా కిందకు ఒరగడంతో భారీ శక్తి వెలువడుతుంది. దాంతోనే ఎర్త్ క్వేక్స్ వస్తుంటాయి.

పసిఫిక్ మహాసముద్రంలోనే 68% భూకంపాలు

ప్రపంచంలో ఎక్కువ భూకంపాలు 68 శాతం పసిఫిక్ మహాసముద్రం, 21 శాతం మధ్యదరా ప్రాంతాలు, 11 శాతం ఇతర ప్రాంతాల్లో సంభవిస్తాయి. సో ఆ తీర ప్రాంతాల్లో భూకంపాలు వస్తే సునామీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే ఉంటాయి. రిక్టర్ స్కేల్ పై 7 అంతకంటే ఎక్కువ తీవ్రత నమోదైతే పెను విధ్వంసం జరుగుతుంది. రిక్టర్ స్కేల్ పై 3.5 అంతకంటే తక్కువ తీవ్రతతో ప్రతి రోజూ భూమిపై దాదాపు వెయ్యి వరకు ప్రకంపనలు సంభవిస్తుంటాయి. వీటిని మనుషులు గుర్తించలేరు. రిక్టర్ స్కేల్ పై 5.5 నుంచి 6.0 మధ్య వస్తే క్వాలిటీ లేని బిల్డింగ్ లు దెబ్బతింటాయి. భూకంపాలు వచ్చినప్పుడు వాటి తీవ్రత ఒక నిమిషంలోపే ఉంటుంది కానీ నష్టం మాత్రం భారీగానే కలిగిస్తుంటుంది.

జోన్ 5లో ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్..

అలాగే పగలు, రాత్రి అన్న తేడా ఉండదు. ఎర్త్ క్వేక్ ఎప్పుడైనా రావొచ్చు. ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్, అసోం, గుజరాత్, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్ వంటి చోట్ల ఎక్కువగా ప్రకంపనలు వస్తున్నాయి. హైదరాబాద్ లో ఉన్న జాతీయ భూ భౌతిక పరిశోధనా సంస్థ మనదేశంలో భూకంపాలను 5 జోన్లుగా విభజించింది. జోన్ 5 అత్యంత తీవ్రమైన విధ్వంసం కలిగిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్, బిహార్, ఉత్తరాఖండ్, పశ్చిమ గుజరాత్, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్ జోన్ 5లో ఉన్నాయి. సో ఇక్కడ భారీ నిర్మాణాలు భూకంప తీవ్రతను తట్టుకునేలా నిర్మించాలి. కానీ అలా జరగడం లేదు.

2022 అఫ్ఘాన్ భూకంపంతో 1100 మంది మృతి

భూకంపాల్లో ప్రాణనష్టం తక్కువగా ఉండాలంటే.. వాటిని తట్టుకునేలా బిల్డింగ్ లు నిర్మించాలి. ప్రజల్లో అవగాహన పెంచాలి. భూకంపాల నుంచి రక్షించుకోవటంలో డ్రాప్-కవర్-హోల్డ్ విధానం ఎంతో ఎఫెక్టివ్ అన్నది ఇప్పటికే నిరూపితమైంది. భవనాలు దీర్ఘ చతురస్రాకార డిజైన్ తో ఉండాలి. పొడవైన గోడలు, పటిష్ట కాంక్రీట్ పిల్లర్స్ ఉండాలి. జూన్ 2022లో అఫ్గనిస్తాన్ లో వచ్చిన భూకంపంలో 1,100మంది జనం చనిపోయారు. 2015 ఏప్రిల్ లో నేపాల్ లో 7.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇందులో 8,800మందికి పైగా మరణించారు. అలాగే 2011 మార్చిలో జపాన్ లో 9.0 తీవ్రతతో ఎర్త్ క్వేక్ వచ్చింది. ఆ తర్వాత సునామీగా మారింది.

ఇండోనేషియా భూకంపంతో 2.30లక్షల మంది మృతి

ఆ ప్రకృతి విపత్తులో 20 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇక 2004 డిసెంబర్ లో ఇండోనేషియా తీరంలో వచ్చిన భూకంపం… 12కు పైగా దేశాల్లో సునామీ ప్రభావం చూపించింది. 9.1తీవ్రతతో అప్పుడు భూకంపం సంభవించింది. దాదాపు 2.30లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. భూకంపాల విషయంలో పెద్ద అప్డేట్ ఏంటంటే.. భారత టెక్టోనిక్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ కిందకి వెళ్తున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. ఉపరితలం నుండి దాదాపు 100 కిలోమీటర్ల దిగువన ముక్కలుగా విరిగిపోతున్నాయని, అందుకే ప్రకంపనల తీవ్రత ముందు ముందు మరింత పెరుగుతుందంటున్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×