Podu Farming: స్వేచ్చ బ్యూరో: ఏళ్ల తరబడి సవాలుగా మారిన అటవీ సంరక్షణ, పోడు వ్యవసాయ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం సరికొత్త ప్రణాళికకు రూపకల్పన చేస్తోన్నట్లు సమాచారం. ఉత్తర భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రంలో అమలవుతున్న విజయవంతమైన ‘అంతర పంటల సాగు’ నమూనాను తెలంగాణలో కూడా అమలు చేసేందుకు అటవీ శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. అడవులను కాపాడుకుంటూనే, స్థానిక గిరిజన, ఆదివాసీ కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేలా ఈ ‘నయా ప్లాన్’ను రూపొందించారు.
అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజన, ఆదివాసీ కుటుంబాలకు జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది. సంప్రదాయంగా సాగు చేసుకునే భూముల విషయంలో వివాదాలు, పోడు సాగు విస్తరణ వంటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో.. అడవిని కాపాడుతూనే స్థానికులకు ఆదాయం వచ్చేలా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను కల్పించడంపై దృష్టి సారిస్తున్నారు.అటవీ భూములను కాపాడటంతో పాటు స్థానికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మూడంచెల వ్యూహం ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు సమాచారం. అటవీ శాఖతో పాటు హార్టికల్చర్ (ఉద్యానవన), ఉపాధి హామీ శాఖలను సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నట్లు సమాచారం. దట్టమైన అడవులకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా, అటవీ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలలో మేఘాలయ తరహాలో వాణిజ్య విలువ ఉన్న పంటలను సాగు చేయనున్నారు. ముఖ్యంగా వెదురు (బాంబూ), పామాయిల్, పైనాపిల్, విలువైన ఔషధ మొక్కల పెంపకంపై అధికారులు తీవ్రంగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఏ పంటను ఎక్కడ సాగు చేయాలనే అంశాన్ని నేల స్వభావం, నీటి లభ్యత, అటవీ పర్యావరణం, స్థానిక వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించేలా ప్రణాళిక రూపొందించనున్నట్లు సమాచారం.
సాగు కార్యకలాపాలు చేపట్టినా.. అటవీ భూముల సంరక్షణ, పర్యవేక్షణ బాధ్యతలు అటవీశాఖ ఆధ్వర్యంలోనే కొనసాగనున్నాయి. స్థానిక గిరిజనులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి, వారికి ఉపాధి కల్పించడం ద్వారా అడవుల పరిరక్షణలో వారి పాత్రను పెంచాలన్నది ప్రధాన ఉద్దేశం.మొక్కల పెంపకం, సంరక్షణ, అటవీ పునరుద్ధరణ, అగ్ని ప్రమాదాల నివారణ తదితర పనుల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
అటవీ ప్రాంతాల్లో పోడు సాగు విస్తరించకుండా నిరోధించడంతోపాటు, ఇప్పటికే అటవీ సంరక్షణపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు జీవనోపాధి కల్పించడమే ఈ ప్రతిపాదనలో కీలక అంశంగా భావిస్తున్నారు. అడవిని నరికితేనే జీవనోపాధి అనే పరిస్థితికి బదులు.. అడవిని కాపాడితేనే ఆదాయం వచ్చే విధానం తీసుకురావాలన్నది లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.స్థానికులకు నిరంతర ఉపాధి లభిస్తే కొత్తగా అడవులను సాగుభూములుగా మార్చడం, అటవీ భూములను ఆక్రమించడం వంటి వాటిని తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
Also read: టెక్కీకి ముద్దుపెట్టిన సెక్యూరిటీ గార్డు, గచ్చిబౌలిలో ఘటన, నిందితుడు అరెస్ట్
కందకాలు తవ్విన ప్రదేశాల్లో, అటవీ సరిహద్దుల్లో బయో-ఫెన్సింగ్ (సహజ కంచె)గా విస్తారంగా వెదురు నాటాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ వెదురుకు వేగంగా పెరిగే గుణం ఉండటంతో జీవ రాశులు సమీప గ్రామాల్లోకి రాకుండా ఆవాసంగా మారనుంది. అంతేకాదు ఈ వెదురుతో పేపర్ తయారీ, ఫర్నిచర్ తయారీకి వాడటం ఎక్కువగా ఉండటంతో స్థానికులు ఆదాయమార్గం కానుంది. పామాయిల్ తోటలను ప్రభుత్వం ప్రోత్సహించడంతో పాటు ఉద్యానవనశాఖ నుంచి డ్రిప్లను సబ్సిడీపై అందజేస్తుంది. పామాయిల్ మొక్కలకు ఐదేళ్లపాటు పెట్టుబడిని ప్రభుత్వమే అందజేస్తుండటంతో కొన్ని సంవత్సరాల పాటు ఆదాయం రానుంది. అదే విధంగా పైనాపిల్ , మునగ, తులసి, కలబంద, నిమ్మగడ్డి (లెమన్‌గ్రాస్), అశ్వగంధ వంటి మెడిసినల్ ప్లాంట్స్ పెంచనున్నట్లు సమాచారం. ఫార్మా కంపెనీలతో ముందే బై-బ్యాక్ ఒప్పందాలు చేసుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
మేఘాలయలో అటవీ భూములకు కంచె వేయకున్నా అయినా ఒక్క అంగుళం కూడా ఆక్రమణ జరగదు. దీనికి కారణం అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అమలవుతున్న ‘ఇంటర్ క్రాపింగ్’ (అంతర పంటల) విధానమే. అడవి సహజ రూపాన్ని దెబ్బతీయకుండానే.. పెద్ద చెట్ల నీడలో, అటవీ సరిహద్దుల్లో పైనాపిల్, మిరియాలు, బ్రూమ్‌గ్రాస్, అల్లం, వెదురు సాగు చేస్తున్నారు. ఆ అడవుల నిర్వహణను స్థానిక స్వయం సహాయక బృందాలు, గ్రామ మండళ్లకు అప్పగిస్తున్నారు. పంట ద్వారా వచ్చే ఆదాయం స్థానిక ప్రజలకే. దీంతో అడవిని తమ సొంత ఆస్తిగా భావించి స్థానికులే రక్షించుకుంటారు. అక్కడి అనుభవాలను యథాతథంగా అమలు చేయకుండా.. తెలంగాణలోని అడవుల స్వభావం, గిరిజన ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసి అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి లేక గిరిజనులు అడవులను నరికి పోడు వ్యవసాయం చేయడం లేదా భూములు కబ్జా చేయడం లాంటి పరిణామాలు నిత్యకృత్యమయ్యాయి. ఈ నయా ప్లాన్ అమలైతే అటవీ విస్తీర్ణాన్ని, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం.. మరోవైపు అటవీ ప్రాంతాల్లోని కుటుంబాలకు ఉపాధి, ఆదాయ మార్గాలను అందించడం. తద్వారా పోడు సాగు విస్తరణ, కొత్తగా అటవీ భూముల ఆక్రమణకు అడ్డుకట్ట వేయడంతోపాటు.. స్థానికులను అటవీ సంరక్షణలో భాగస్వాములుగా మార్చే అవకాశం ఉంటుంది. ఉపాధి కల్పించే ఆ అడవులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యతను గిరిజనులే స్వయంగా తీసుకుంటారని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇంకా తుది కార్యాచరణ ప్రణాళిక ఖరారు కావాల్సి ఉంది. పంటల ఎంపిక, సాగు ప్రాంతాలు, లబ్ధిదారుల ఎంపిక, శాఖల మధ్య సమన్వయం, అటవీ చట్టాలకు అనుగుణంగా అమలు వంటి అంశాలపై అధ్యయనం పూర్తయిన తర్వాత విధివిధానాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.ఈ కార్యాచరణ కనుక విజయవంతమైతే.. రాష్ట్రంలో పచ్చదనం గణనీయంగా పెరగడంతో పాటు గిరిజనుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటంలో ఇదొక చారిత్రక అడుగు కానుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సైతం పేరురానుంది.
Also Read: పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటా!.. చిన్ననాటి జ్ఞాపకాలతో భావోద్వేగానికి గురైన మంత్రి ఉత్తమ్