Uttam Kumar: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలతో గడిపి, తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నేను పుట్టి పెరిగిన ఊరి రుణం తీర్చుకుంటా
‘నేను ఇక్కడికి ఏ రాజకీయాలు చేయడానికి రాలేదు. తాటిపాముల నేను పుట్టి పెరిగిన ఊరు. ఈ నేలతో, ఇక్కడి ప్రజలతో నాకు ప్రత్యేక బంధం ఉంది. ఈ గ్రామానికి సేవ చేయడం, ప్రజల రుణం తీర్చుకోవడం నా బాధ్యత. అందుకే తాటిపాములను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నా శక్తివంచన లేకుండా కృషి చేస్తా,’ అని ఉత్తమ్ స్పష్టం చేశారు. అలాగే రాబోయే ఎన్నికల్లో తాను తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు.
దేవాదుల నీళ్లు తెస్తాం.. ప్రాజెక్టులపై విమర్శలు
ఈ ప్రాంత నీటి ఎద్దడి తీర్చేందుకు దేవాదుల ప్రాజెక్టు నీళ్లను నియోజకవర్గానికి తీసుకొచ్చే పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడుతూ.. కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను వాళ్లే కట్టి, వాళ్లే కూల్చారని విమర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి తుమ్మిడిహట్టి ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
నాణ్యమైన విద్య, పేదల సంక్షేమమే ధ్యేయం
హైదరాబాద్, సూర్యాపేటలోని కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల భవనాలను నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పేదలకు రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు అందించిన ఘనత తమ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆయన గుర్తుచేశారు.
Also Read: తెలంగాణ భవన్, ఎయిర్‌పోర్టు డిజైన్లలో కాకతీయ మార్కు.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం!