Yoga Teacher Turns Beauty Queen: ఒకప్పుడు పల్లెటూరిలో పెరిగిన ఓ అమ్మాయి.. హైదరాబాద్ కు వచ్చి స్కూల్లో విద్యార్థులకు యోగా నేర్పించే టీచర్ గా జాయిన్ అయ్యింది. ఇప్పుడు అదే అమ్మాయి జాతీయ స్థాయి అందాల పోటీలో కిరీటం సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె మరెవరో కాదు ప్రీతి ముండే. తెలంగాణకు చెందిన ప్రీతి మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 టైటిల్‌ను గెలుచుకోవడంతో పాటు, మిస్ కంజీనియాలిటీ 2026 బిరుదును కూడా సొంతం చేసుకుంది.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ ప్రీతి ముండే స్వగ్రామం. గ్రామీణ వాతావరణంలో పెరిగిన ఆమెకు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం అలవాటయ్యాయి. చదువుతో పాటు యోగాపై ఆసక్తి పెంచుకున్న ఆమె, ఆ రంగంలోనూ తన ప్రతిభను చాటుకున్నారు. తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన ప్రీతి.. ప్రగతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో యోగా టీచర్‌గా పని చేస్తూ విద్యార్థులకు ఆరోగ్యం, యోగా ప్రాముఖ్యతను పెంపొందించారు. ఒకవైపు ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు తన కలలను కూడా వెంట తీసుకెళ్లారు.
ప్రీతి ప్రయాణంలో యోగా కీలక పాత్ర పోషించింది. జాతీయ స్థాయి యోగా ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన ఆమె.. శారీరక దారుఢ్యంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుకున్నారు. ఎన్‌సీసీ క్యాడెట్‌గా పనిచేయడం వల్ల ఆమె క్రమశిక్షణ మరింత మెరుగయ్యింది. అదే సమయంలో మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకున్న ప్రీతి, అందాల పోటీల వైపు అడుగులు వేశారు. వేదికపై నిలబడటమే లక్ష్యంగా కాకుండా, తన వ్యక్తిత్వాన్ని, ఆలోచనలను కూడా ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగారు.
రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన మిస్ ఇండియా ఎర్త్ 2026 పోటీలో ప్రీతి తెలంగాణకు ప్రాతినిధ్యం వహించారు. పోటీదారుల మధ్య తన ప్రతిభను ప్రదర్శించి మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 కిరీటాన్ని గెలుచుకున్నారు. అంతేకాదు.. పోటీలో తన స్నేహపూర్వక స్వభావం, ఇతరులతో కలిసిపోయే తీరుకు గుర్తింపుగా మిస్ కంజీనియాలిటీ 2026 టైటిల్ కూడా దక్కించుకున్నారు. ఆమె విజయానికి మరింత ప్రత్యేకతను తెచ్చుకున్నారు.
ప్రీతి తన విజయాన్ని కేవలం అందాల పోటీ వరకే పరిమితం చేయలేదు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ‘కైండ్ హార్ట్స్’ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. వ్యర్థాలను తడి, పొడి చెత్తగా వేరు చేయడం, పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటడం, సరస్సుల ప్రక్షాళన వంటి అంశాలపై విద్యార్థులు, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచే పర్యావరణ బాధ్యతను అలవాటు చేయాలన్నది ఆమె ప్రయత్నం.
ప్రస్తుతం ప్రీతి అరోరా యూనివర్సిటీలో యోగాలో మాస్టర్స్ చేస్తున్నారు. యోగా టీచర్‌గా, మోడల్‌గా, జ్యోతిష్యురాలిగా విభిన్న రంగాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. మిస్ ఎర్త్ అంతర్జాతీయ వేదికపై ఫిలిప్పీన్స్ లో పాల్గొనే అవకాశం కూడా ఆమెకు దక్కింది. ఒక పల్లెటూరి నుంచి వచ్చిన అమ్మాయి.. హైదరాబాద్‌లో ఉపాధ్యాయురాలిగా మొదలై జాతీయ కిరీటం వరకు చేరడం వెనుక ఎన్నో ఏళ్ల కృషి ఉంది. ప్రీతి ముండే కథలో కిరీటం ఒక మైలురాయి మాత్రమే. తన మూలాలను మర్చిపోకుండా, విద్య, ఆరోగ్యం, పర్యావరణం వంటి అంశాలతో ముందుకు సాగుతున్న ఆమె ప్రయాణమే అసలైన సక్సెస్ స్టోరీగా చెప్పుకోవచ్చు.
Read Also: పేదరికం లేని కుబేర దేశాలు.. ఈ మూడు కంట్రీస్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!