Jio Recharge Plans Hike| జియో రీఛార్జ్ ప్లాన్ల ధరలు మళ్లీ పెరుగుతాయా? ఇప్పటికే మొబైల్ రీఛార్జ్ కోసం ఖర్చు చేస్తున్న వినియోగదారుల్లో ఈ ప్రశ్న ఆందోళన పెంచుతోంది. జియో భవిష్యత్తు బిజినెస్ వ్యూహాల గురించి సంస్థ అధినేత ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. టారిఫ్‌ల పెంపునకు మార్కెట్లో ఇంకా అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. అయితే, ధరలు పెంచడమే కాకుండా డిజిటల్ సేవలు, బ్రాడ్‌బ్యాండ్, ఆధునిక టెక్నాలజీ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. మరి జియో తదుపరి ప్రణాళికలు ఏమిటి? వినియోగదారులపై దీని ప్రభావం ఎలా ఉండవచ్చు? తెలుసుకుందాం.
రిలయన్స్ జియో తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు కొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచేందుకు ఇంకా అవకాశం ఉందని జియో అధినేత ఆకాశ్ అంబానీ సంకేతాలిచ్చారు. అయితే, కంపెనీ కేవలం డేటా ధరలపైనే కాకుండా ఇతర డిజిటల్ సేవలపైనా దృష్టి పెట్టాలని భావిస్తోంది.
జియో ప్లాట్‌ఫామ్స్ ప్రతిపాదిత IPOకు ముందు జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో ఆయన ఈ విషయాలను వివరించారు.
టెలికాం రంగంలో టారిఫ్‌లను మరింత పెంచేందుకు అవకాశం ఉందని ఆకాశ్ అంబానీ అభిప్రాయపడ్డారు. అయితే, రీఛార్జ్ ధరలను వెంటనే పెంచుతున్నట్లు ఆయన ప్రకటించలేదు. ధరలు పెరిగితే టెలికాం కంపెనీలకు ఇప్పటికే ఉన్న వినియోగదారుల నుంచి మరింత ఆదాయం లభిస్తుంది. అదే సమయంలో జియో కొత్త సేవలను అందించి వినియోగదారులకు అదనపు ప్రయోజనాలు కల్పించాలని చూస్తోంది.
మొబైల్ కనెక్టివిటీతోపాటు హోమ్ బ్రాడ్‌బ్యాండ్, వ్యాపార సేవలు, డిజిటల్ అప్లికేషన్ల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది.
Also Read: ఉద్యోగం వదిలి వ్యవసాయం.. ఎకరాకు రూ.30 లక్షలు ఆదాయం.. ఆంధ్రా యువకుడి భలే ఐడియా
జియో 2016లో భారత టెలికాం మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పట్లో మొబైల్ డేటా ధరలు ఎక్కువగా ఉండేవి. ఇంటర్నెట్ వినియోగం కూడా నేటితో పోలిస్తే పరిమితంగా ఉండేది. జియో తక్కువ ధరలకు డేటా సేవలను అందించడం ద్వారా మార్కెట్లో పోటీని పెంచింది. దీంతో ఇతర టెలికాం కంపెనీలు కూడా తమ ధరలు, సేవలపై దృష్టి పెట్టాల్సి వచ్చింది.
ఇప్పుడు తక్కువ ధరలకు డేటా అందించడంతోపాటు నాణ్యమైన నెట్వర్క్ సేవలు అందించడం కూడా ముఖ్యమని ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు.
జియో తన వ్యాపారాన్ని మొబైల్ నెట్‌వర్క్‌లకే పరిమితం చేయడం లేదు. హోమ్ బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ అప్లికేషన్లు, పరికరాలు, వ్యాపార అవసరాలకు సంబంధించిన సేవలను కూడా విస్తరిస్తోంది. ఇతర టెక్నాలజీ సంస్థలతో భాగస్వామ్యాలు చేసుకోవడం ద్వారా కొత్త సేవలను అందించాలని చూస్తోంది. సొంత టెక్నాలజీ పరిజ్ఞానం, పేటెంట్లు కూడా కంపెనీకి బలమని ఆకాశ్ అంబానీ వివరించారు.
Also Read: క్రెడిట్ కార్డు ఓవర్‌లిమిట్ సదుపాయం వల్ల లాభాలు, నష్టాలు.. భారీ ఫైన్ పడకుండా ఈ టిప్స్ పాటించండి
ప్రస్తుతం 5G సేవలతోపాటు భవిష్యత్తులో రానున్న 6G టెక్నాలజీపైనా జియో దృష్టి పెట్టింది. ఆకాశ్ అంబానీ అంచనా ప్రకారం.. 6G ప్రమాణాలు 2029 నాటికి ఖరారయ్యే అవకాశం ఉంది. వాణిజ్యపరమైన 6G సేవలు 2030ల ప్రారంభంలో అందుబాటులోకి రావచ్చు.
Also Read: విస్కీ ఎలా తాగితే రుచికరంగా ఉంటుంది? నీట్‌గా, ఐస్తోనా లేదా వాటర్‌తోనా
ప్రస్తుతానికి ఆకాశ్ అంబానీ వ్యాఖ్యలు తక్షణ రీఛార్జ్ ధరల పెంపును నిర్ధారించడం లేదు. కాబట్టి వినియోగదారులు అధికారిక ప్రకటనల కోసం వేచి చూడాలి.