Sridhar Vembu: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన విడాకుల (Most Expensive Divorces) జాబితాలో ఒక భారతీయ వ్యాపారవేత్త పేరు చేరడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గజం జోహో (Zoho) వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు, తన విడాకుల ప్రక్రియలో భాగంగా ఏకంగా 1.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 15,000 కోట్లు) బాండ్‌గా డిపాజిట్ చేయాలని అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టు ఆదేశించింది. గతేడాదే ఈ ఉత్తర్వులు వెలువడినా, ఇటీవల ఈ వివరాలు బహిర్గతం కావడంతో చర్చ మొదలైంది. సాఫ్ట్‌వేర్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసిన వెంబు, ఇప్పుడు ఈ విడాకుల వివాదంతో వార్తల్లో నిలిచారు.
శ్రీధర్ వెంబు 1993లో ప్రమీలా శ్రీనివాసన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. గ్రామీణాభివృద్ధిని కాంక్షిస్తూ, సాధారణ జీవనశైలిని గడిపే వ్యక్తిగా పేరున్న వెంబు విడాకుల సెటిల్మెంట్ మొత్తం ఇంత భారీ స్థాయిలో ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫోర్బ్స్ (Forbes) నివేదిక ప్రకారం, 2024లో వెంబు నికర ఆస్తుల విలువ 5.85 బిలియన్ డాలర్ల భారతీయ ధనవంతుల జాబితాలో 39వ స్థానంలో నిలిచారు శ్రీధర్ వెంబు.
ప్రపంచ చరిత్రలో అత్యంత భారీ సెటిల్మెంట్లతో ముగిసిన విడాకుల వివరాలను పరిశీలిస్తే, జోహో సీఈఓ శ్రీధర్ వెంబు కేసు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నాల్గవ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బిల్ గేట్స్ – మెలిండా గేట్స్ దంపతులు 27 ఏళ్ల వివాహ బంధం తర్వాత 2021లో విడిపోగా, మెలిండాకు సుమారు $73 బిలియన్ల విలువైన ఆస్తులు లభించాయి. రెండవ స్థానంలో ఉన్న అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ – మెకెంజీ స్కాట్ విడాకులు.. మూడవ స్థానంలో మీడియా టైకూన్ రూపర్ట్ మర్డోక్ – మరియా టోర్వ్ ఉండగా, తాజాగా కాలిఫోర్నియా కోర్టు శ్రీధర్ వెంబును తన భార్య ప్రమీలతో జరుగుతున్న వివాదంలో భాగంగా $1.7 బిలియన్ల (సుమారు రూ. 15,000 కోట్లు) బాండ్ డిపాజిట్ చేయాలని ఆదేశించడంతో, ఈయన కూడా మర్డోక్ సరసన అత్యంత ఖరీదైన విడాకుల జాబితాలో చేరారు.
జోహో (Zoho) కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కేవలం ఒక బిలియనీర్ వ్యాపారవేత్త మాత్రమే కాదు, నిరాడంబరతకు, సామాజిక బాధ్యతకు మారుపేరుగా నిలిచిన వ్యక్తి. సిలికాన్ వ్యాలీ విలాసాలను వదిలి, గ్రామీణ భారత అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఆయన IT మద్రాస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు. అనంతరం అమెరికాలోని ప్రతిష్టాత్మక ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుండి MS, PhD పూర్తి చేశారు.
1994లో క్వాల్‌కామ్ (Qualcomm) కంపెనీలో వైర్లెస్ ఇంజనీర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. 1996లో తన సోదరులు, స్నేహితులతో కలిసి ‘అడ్వెంట్ నెట్’ (AdventNet) అనే కంపెనీని ప్రారంభించారు. 2009లో దీని పేరును ‘జోహో’గా మార్చారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాలతో పోటీ పడుతున్నప్పటికీ, జోహో ఇప్పటివరకు ఏ బయటి పెట్టుబడిదారుడి (VC) నుండి నిధులు తీసుకోలేదు. ఇది పూర్తిగా లాభాలతో నడిచే (Bootstrapped) అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఒకటి.
Read Also: బంగారం కొందామనుకుంటున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే!