Food Poisoning: జోగులాంబ గద్వాల్ జిల్లా ధర్మవరం బీసీ బాలుర వసతి గృహంలో.. కలుషిత ఆహారం తిని 86 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలతో ఇబ్బందిపడుతున్న విద్యార్థులను.. గద్వాల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
వసతి గృహంలో మొత్తం 125 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి సుమారు 110 మంది విద్యార్థులు భోజనం చేశారు. రాత్రి 9 గంటల తర్వాత ఒక్కసారిగా కొందరికి వాంతులు, కడుపునొప్పి మొదలయ్యాయి. కొద్దిసేపట్లో అదే లక్షణాలు మరికొందరికి కూడా కనిపించడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్ధులను ఆసుపత్రికి తరలించారు.
కోదండాపురం ఎస్సై మురళి మాట్లాడుతూ.. అస్వస్థతకు గురైన విద్యార్థులు అందరూ గద్వాల్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. ఎవరూ ప్రాణాపాయంలో లేరు అని పేర్కొన్నారు. కలుషిత ఆహారం కారణమా లేక నీటిలో సమస్య ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఆహారం, నీటి నమూనాలను ఆహార భద్రతా విభాగం అధికారులు సేకరించి ప్రయోగశాలకు పంపించారు. వసతి గృహంలో ఆహారం వండిన విధానం, నిల్వ చేసిన పరిస్థితులు, వంటి అంశాలపై విచారణ జరుగుతోంది. జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
కలుషిత ఆహారం తిని ఆస్ప్రతిలో చేరిన విషయాన్ని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు.
అస్వస్థతకు గురైన విద్యార్థులందరూ ఇప్పుడు కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. కలుషిత ఆహారానికి కారణం ఏమిటో స్పష్టత రావాల్సి ఉందని, తప్పిదం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు భరోసా ఇచ్చారు.
Also Read: దారుణం.. ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి ఆత్మహత్య.. వీడియో వైరల్
ఈ ఘటనతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో.. ఆహార నాణ్యతపై అధికారులు రివ్యూ చేపట్టారు. రోజూ వడ్డించే ఆహారంపై మెడికల్ టీమ్ పర్యవేక్షణ ఉండాలని, ఆహారం వండే ప్రాంతాల్లో శుభ్రత తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.