 
					CPM Leader Murder: ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. సీపీఎం రైతు సంఘం నేత, సీనియర్ నాయకుడు సామినేని రామారావును గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. చింతకాని మండలం పాతర్లపాడు గ్రామం సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రతిరోజు లాగే ఉదయం వాకింగ్‌కు వెళ్లిన రామారావును దుండగులు దాడి చేసి, గొంతుకోసి హతమార్చారు.
స్థానికులు రోడ్డుపక్కన ఆయన మృతదేహాన్ని గమనించి.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, రామారావు రైతు సమస్యలపై చురుకుగా పోరాడేవారు. స్థానిక రాజకీయ విభేదాలా లేక ఇతర కారణాల వల్ల హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఈ ఘటనతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. సీపీఎం నాయకులు, రైతు సంఘం కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ దారుణ హత్యపై డిప్యూటీ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. రాజకీయ విభేదాలు ప్రాణాంతకంగా మారడం దురదృష్టకరం. దోషులను వెంటాడి చట్టపరంగా శిక్షిస్తాం అని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లా పోలీసు అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి, శాంతిభద్రతల విషయంలో నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని ఆదేశించారు.
డిప్యూటీ సీఎం పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, సైబర్ టీమ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్ని వినియోగించి.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు.
సామినేని రామారావు గత రెండు దశాబ్దాలుగా.. రైతు హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారు. ఆయన రైతు సంఘం సమావేశాల్లో చురుకుగా పాల్గొనేవారు. పేదల పక్షాన గళమెత్తిన ఆయన మరణం గ్రామ ప్రజల్లో తీవ్ర ఆవేదన కలిగించింది. సీపీఎం నేతలు, కార్యకర్తలు చింతకాని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. 48 గంటల్లో నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు.
డిప్యూటీ సీఎం రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. రామారావు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, పూర్తిస్థాయిలో ఆదుకుంటానని భరోసా ఇచ్చారు.
Also Read: పెళ్లి వాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. ముగ్గురు మృతి
ఈ నేపథ్యంలో పోలీసులు 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కదలికలపై సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ సిగ్నల్ ట్రాకింగ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు.