 
					Visakha News: విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఎంవీపీ కాలనీలో డిగ్రీ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందడంతో.. అనుమానాలు తలెత్తుతున్నాయి. సమత కాలేజ్‌లో చదువుతున్న విద్యార్థి సాయి తేజ మృతికి.. కాలేజీ లెక్చరర్ల లైంగిక వేధింపులే కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. సాయి తేజ్ మృతికి నిరసనగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.
సాయి తేజ పై లైంగిక వేధింపుల వ్యవహారం తమ దృష్టికి రాలేదన్నారు ప్రిన్సిపాల్. చాటింగ్ కూడా తమ చేతికి ఇప్పుడే వచ్చింది కాబట్టి ఏం మాట్లాడలేమంటున్నారు. ఏమీ తెలీకుండా మాట్లాడడం కరెక్టు కాదని అన్నారు. సరిగ్గా అదే సమయంలో లెక్చరర్స్ ఉన్న రూములోకి విద్యార్ధి సంఘాలు దూసుకెళ్లడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
సాయి తేజ ఆత్మహత్యకు గల కారణాలపై తోటి విద్యార్థులు, స్నేహితులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కళాశాలలో పనిచేస్తున్న ఒక మహిళా లెక్చరర్ సాయి తేజను గత కొద్ది రోజులుగా లైంగికంగా.. మానసికంగా వేధింపులకు గురి చేస్తోందని వారు చెబుతున్నారు. లెక్చరర్ వేధింపులు తట్టుకోలేకనే సాయి తేజ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని స్నేహితులు వాపోతున్నారు.
కొంతమంది విద్యార్థులు చెబుతున్న వివరాల ప్రకారం.. సాయి తేజ మొబైల్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులో ఇద్దరు లెక్చరర్‌లతో చేసిన కొన్ని వాట్సాప్ సందేశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. సాయి తేజ మృతి, లెక్చరర్‌పై వచ్చిన తీవ్ర ఆరోపణల నేపథ్యంలో తోటి విద్యార్థులు వెంటనే సమత కళాశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని, వేధింపులకు పాల్పడిన లెక్చరర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో ఎంవీపీ కాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద మృతి.. కళాశాల మహిళా లెక్చరర్‌పైనే లైంగిక వేధింపులు, మానసిక వేధింపుల ఆరోపణలు రావడం విశాఖపట్నంలో సంచలనం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి మృతికి గల పూర్తి కారణాలు, ఆరోపణలపై లోతైన విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.