Bigbasket Online Scam: డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ మోసాలు కొత్త కొత్త రూపాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. పెద్ద కంపెనీల పేర్లను వాడుతూ, ప్రజల విశ్వాసాన్ని దోచుకునే సైబర్ దొంగలు ఇప్పుడు మరో కొత్త పద్ధతిని అవలంబించారు. తాజాగా బిగ్ బాస్కెట్ పేరుతో ఒక పెద్ద మోసం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో హైదరాబాద్ యూసుఫ్‌గూడకు చెందిన ఓ వ్యక్తి రూ.1.97 లక్షలు కోల్పోయాడు.
తక్కువ ధరలో కిరాణా ఆఫర్ల
పోలీసుల సమాచారం ప్రకారం, యూసుఫ్‌గూడలో నివసించే వ్యక్తికి వాట్సాప్‌లో “బిగ్ బాస్కెట్” పేరుతో ఉన్న నంబర్ నుంచి సందేశం వచ్చింది. “ఫెస్టివల్ ఆఫర్” పేరుతో తక్కువ ధరలో కిరాణా సరుకులు అందిస్తున్నట్లు లింక్ పంపించారు. ఆ ఆఫర్‌లు చూసి ఆకర్షితుడైన వ్యక్తి ఆ లింక్‌ను క్లిక్ చేశాడు.
ఏపీ కే (APK) ఫైల్ ఇన్‌స్టాల్ చేయడంతో ప్రారంభమైన మోసం
ఆ లింక్‌ను ఓపెన్ చేయగా “బిగ్ బాస్కెట్ డిస్కౌంట్ యాప్” అనే APK ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేయమని సూచన వచ్చింది. “ఆర్డర్ కన్ఫర్మ్ కావాలంటే యాప్ ఇన్‌స్టాల్ చేయాలి” అనే మెసేజ్ రావడంతో, ఏమీ అనుమానం లేకుండా అతను ఆ యాప్‌ను ఇన్‌స్టాల్ చేశాడు. దీంతో కొన్ని నిమిషాల్లోనే అతని మొబైల్ ఫోన్ పూర్తిగా హ్యాక్ అయింది.
ఓటీపీ ఇవ్వకపోయినా డబ్బులు డెబిట్
అతని క్రెడిట్ కార్డు నుంచి ఓటీపీ ఇవ్వకుండానే.. రూ.1.97 లక్షలు ఒకదాని తరువాత ఒకటి డెబిట్ అయ్యాయి. అకస్మాత్తుగా వచ్చిన ట్రాన్సాక్షన్ అలర్ట్స్ చూసి అతను షాక్ అయ్యాడు. వెంటనే బ్యాంక్‌ను సంప్రదించగా, మీ ఫోన్‌లో కాల్ ఫార్వార్డింగ్ యాక్టివేట్ అయింది. దాంతో ఓటీపీలు నేరుగా మోసగాళ్లకు వెళ్తున్నాయి అని తెలిపారు.
కాల్ ఫార్వార్డింగ్ మాయచూపు
సైబర్ నేరగాళ్లు ముందు నుంచి ఒక స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. APK యాప్ ఇన్‌స్టాల్ చేసిన వెంటనే, యూజర్ ఫోన్‌లో ఉన్న కాల్ సెట్టింగ్స్‌లో మార్పులు జరిగి, కాల్ ఫార్వార్డింగ్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయ్యింది. దీంతో బ్యాంక్ నుంచి వచ్చే OTP, వెరిఫికేషన్ కాల్స్ అన్నీ నేరుగా మోసగాళ్ల ఫోన్‌కు వెళ్లిపోయాయి.
ఫిర్యాదు చేసుకున్న బాధితుడు
అమాంతం డబ్బులు మాయం కావడంతో.. బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యూసుఫ్‌గూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, సైబర్ నేరగాళ్లను గుర్తించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో మోసగాళ్లు హర్యానా, ఢిల్లీలోని ఫేక్ కాల్ సెంటర్ల ద్వారా పని చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మోసగాళ్ల కొత్త మాయాజాలం
పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం, ఈ మోసం ఒక కొత్త రకమైన “రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (RAT)” ద్వారా జరిగినట్లు గుర్తించారు. ఈ యాప్ ఇన్‌స్టాల్ అయిన వెంటనే, దొంగలు బాధితుడి మొబైల్‌ను పూర్తిగా కంట్రోల్ చేయగలిగారు. కేవలం OTP కాకుండా, గ్యాలరీ, కాంటాక్ట్స్, మెసేజ్‌లు కూడా వారికి యాక్సెస్ అయ్యాయి.
పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల గణాంకాల ప్రకారం, ఈ ఏడాది జనవరి నుండి సెప్టెంబర్ వరకు నగరంలోనే 4,500కి పైగా ఆన్‌లైన్ మోసాల కేసులు నమోదయ్యాయి. వీటిలో 40 శాతం కేసులు ఫేక్ ఆఫర్ల పేరుతోనే జరిగినవని అధికారులు చెబుతున్నారు.
ప్రజలకు జాగ్రత్తలు
పోలీస్ శాఖ పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, ప్రజలు జాగ్రత్తగా లేకపోతే ఇలాంటి మోసాలకు గురవుతూనే ఉంటారని అధికారులు హెచ్చరిస్తున్నారు. సైబర్ భద్రత కేవలం అధికారుల బాధ్యత కాదని, ప్రతి యూజర్ సెక్యూరిటీ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.