Odisha News: ఒడిశాలోని బరంపూర్ సిటీలో బీజేపీ నేత, సీనియర్ న్యాయవాది పీతాబాస్ పాండాను గుర్తు తెలియని కాల్చి చంపారు. పార్టీ కార్యక్రమాన్ని ముగించుకుని ఇంటికి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు, ఆయనకు సమీపంలోకి వచ్చి కాల్పులు జరిపారు. ఈ ఘటనతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఒడిషాలో దారుణం
పీతాబాస్ పాండా బరంపురంలో ప్రముఖ న్యాయవాది. అంతేకాదు స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యుడిగా పేరు సంపాదించారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో పని చేశారు ఆయన. 2024 పార్లమెంటు ఎన్నికల ముందు ఆయన బీజేపీలో చేరారు. తక్కువ సమయంలో బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. గత నవీన్ హయాంలో జరిగిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అవినీతిపై గళం విప్పినట్లు స్థానికులు చెబుతున్నారు.
పార్టీ కార్యక్రమాల మీద సోమవారం బయటకు వెళ్లారు. తిరిగి ఇంటికి రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి చేరుకోనున్నారు. అతడి ఇంటికి సమీపంలో దుండగులు ఆయన్ని కాల్చి చంపారు. రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. పాండా చాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన మద్దతుదారులు సమీపంలోని ఎంకేసీజీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
బరంపూర్‌లో బీజేపీ నేత పాండాను కాల్చిన దుండగులు
అప్పటికే ఆయన చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. ఈ వార్త తెలియగానే బరంపూర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఒడిషా బీజేపీ నేతలు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సౌత్ రేంజ్ ఐజీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన జరిగిన తీరుని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సివుంది.
ALSO READ: మూడు పాపులర్ బ్రాండ్ల నకిలీ మద్యం, 14 మంది నిందితులు
హత్య కేసును అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర మంత్రి బిభూ భూషణ్, బరంపురం ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆసుపత్రికి చేరుకుని, ఆయన మృతికి నివాళులు అర్పించారు. హత్యను తీవ్రంగా ఖండించిన ఒడిశా న్యాయవాదుల సంఘం నిరసనకు పిలుపు నిచ్చింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులందరూ విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించారు.